బిల్లుల చెల్లింపులో జాప్యం వొద్దు..

  • గ్రామాల్లో అత్యవసరసేవలకోసం మంత్రి సీతక్క ఆదేశాలు
  • బిల్లుల చెల్లింపుల్లో సర్పంచ్‌, ఉప సర్పంచ్‌ల మధ్య పంచాయితీకి చెక్
  • చెక్కులపై సంతకాల్లో కారణం లేకుండా ఆలస్యం చేస్తే చర్యలు
  • ఏడు పని దినాల్లో సంతకం చేయకపోతే కలెక్టర్ విచారణ
  • పంచాయతీల్లో చెక్కుల చెల్లిపుపై ప్రభుత్వ ఆదేశాలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 1 : గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనులు, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా వంటి అత్యవసర సేవలకు సంబంధించిన బిల్లుల చెల్లింపులు నిలిచిపోకుండా రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. చెక్కుల (cheque payments in panchayats)పై సంతకాలు చేయడం లేదా వ్యయాన్ని డిజిటల్ సిగ్నేచర్ కీ ద్వారా ఆమోదించడంలో ఉప సర్పంచ్‌లు అనవసరంగా జాప్యం చేస్తే చర్యలు తీసుకునేలా పంచాయతీరాజ్ శాఖ జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. మంత్రి సీతక్క ఆదేశాల మేరకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్ గురువారం నాడు మెమో జారీ చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు ఈ ఆదేశాలను తక్షణమే అమలు చేయాలని సూచించారు.

గ్రామ పంచాయతీల్లో కొంతమంది ఉప సర్పంచ్‌లు ఎలాంటి సరైన కారణం లేకుండా చెక్కులపై సంతకాలు చేయకపోవడం, వ్యయాన్ని డిజిటల్ సిగ్నేచర్ ద్వారా ఆమోదించకపోవడం వల్ల చెల్లింపులు ఆలస్యం అవుతున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, గ్రామాల్లో అభివృద్ధి పనుల అమలు వంటి అత్యవసర సేవలపై ప్రభావం పడకుండా ఈ నిర్ణయం తీసుకుంది. చెక్కులపై సంతకం చేయాలని లేదా డిజిటల్ సిగ్నేచర్ కీ ద్వారా వ్యయాన్ని ఆమోదించాలని ఉప సర్పంచ్‌కు సమర్పించిన తేదీ నుంచి ఏడు పని దినాల్లోపు ఎలాంటి సరైన కారణం లేకుండా సంతకం చేయకపోతే.. దీనిపై జిల్లా కలెక్టర్ విచారణ చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది.సంతకం చేయకపోవడానికి లేదా వ్యయాన్ని ఆమోదించకపోవడానికి నిజమైన కారణం ఉందా లేదా అనే అంశాన్ని విచారణలో పరిశీలించనున్నారు. విచారణలో ఉప సర్పంచ్ ఎలాంటి సరైన కారణం లేకుండా ఉద్దేశపూర్వకంగా చెక్కులపై సంతకం చేయకుండా లేదా డిజిటల్ సిగ్నేచర్ ద్వారా వ్యయాన్ని ఆమోదించకుండా జాప్యం చేసినట్లు తేలితే తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం, 2018 ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి.

పంచాయతీరాజ్ చట్టంలోని సంబంధిత నిబంధనల ప్రకారం ఉప సర్పంచ్‌కు అప్పగించిన అధికారాలను దుర్వినియోగం చేసినట్లయితే చర్యలు తీసుకునే అవకాశం ఉందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఉప సర్పంచ్ కారణం లేకుండా చెక్కులపై సంతకం చేయడం లేదా వ్యయాన్ని డిజిటల్ సిగ్నేచర్ ద్వారా ఆమోదించడంలో జాప్యం చేసినట్లు విచారణలో తేలితే, చెక్కులను డ్రా చేసే అధికారాన్ని మరో చట్టబద్ధమైన అధికారికి అప్పగించేలా జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ అధికారాన్ని పంచాయతీ కార్యదర్శి, ఎంపీఓ, ఎంపీడీవో తదితర చట్టబద్ధ అధికారుల్లో తగిన వారికి అప్పగించే అవకాశం కల్పించారు.దీంతో ఒక వ్యక్తి కారణంగా గ్రామ పంచాయతీకి సంబంధించిన ప్రజా సేవలు, అభివృద్ధి పనులు, అత్యవసర నిర్వహణ పనులకు సంబంధించిన చెల్లింపులు నిలిచిపోకుండా నిరంతర ప్రక్రియ కొనసాగనుంది.

గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్యం, తాగునీరు, అభివృద్ధి పనులు వంటి కార్యక్రమాలకు సంబంధించిన చెల్లింపులు ఆలస్యం కావడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితి రాకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. చట్టబద్ధమైన అభ్యంతరాలు ఉంటే వాటిని పరిశీలించేందుకు అవకాశం ఉంటుంది.. కానీ సరైన కారణం లేకుండా చెల్లింపులను నిలిపివేయడం మాత్రం అనుమతించబోమని తాజా ఆదేశాలు స్పష్టం చేస్తున్నాయి.జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులు ఈ ఆదేశాల మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్ శాఖ సూచించింది. కొన్ని గ్రామాల్లో సర్పంచులు ఉప సర్పంచ్ల మధ్య ఆధిపత్య రాజకీయ ఇతర కారణాల వల్ల బిర్లా చెల్లింపు ఆలస్యం అవుతుంది. సర్పంచ్ చెక్ పై సంతకాలు చేసినా, ఉప సర్పంచ్లు సంతకాలు చేయడం లేదని చాలామంది సర్పంచులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. మరి ముఖ్యంగా సర్పంచ్ సంఘాలు మంత్రి సీతక్కను పలుసార్లు కలిసి, ఉప సర్పంచ్ల దీనివల్ల గ్రామ అభివృద్ధి కుంటుపడుతోందని, జాయింట్ చెక్ పవర్ ను రద్దుచేయాలని విజ్ఞప్తి చేశారు. అయితే ప్రభుత్వం ఉపసర్పంచులు సంతకం చేసేందుకు ఏడు రోజుల గడువు విదిస్తూ మెమో జారీ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *