నిరసనలను నమోదు చేయండి

– పార్లమెంటు లోపల, బయటా ప్రజల గొంతుకనై పోరాడతా
– కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ
– ప్రభుత్వ అణచివేతను ఎదుర్కొనేందుకు ‘సత్యాగ్రహ’ ప్రారంభం

న్యూదిల్లీ, అక్టోబర్ 3 : దేశవ్యాప్తంగా ప్రజా సమస్యలపై జరుగుతున్న వివిధ రూపాల ఆందోళనలు, నిరసనలను ఒకే వేదికపైకి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సరికొత్త డిజిటల్ వేదికను అందుబాటులోకి తెచ్చింది. మహాత్మా గాంధీ 157వ జయంతి స్ఫూర్తితో సత్యాగ్రహ అనే వినూత్న డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రారంభించారు. ప్రభుత్వాల చేతిలో అణచివేతకు గురవుతున్న గొంతుకలకు ఈ ప్లాట్‌ఫామ్ బలమైన భరోసా ఇవ్వనుందని ఆయన స్పష్టం చేశారు.

ఒంటరి పోరాటాలకు ముగింపు

దేశంలో భూమి కోసం, మహిళా హక్కుల కోసం, దళిత-ఓబీసీ హక్కుల కోసం, అలాగే విద్య, పరీక్షల పత్రాల లీకేజీలు వంటి విభిన్న అంశాలపై ఎన్నో నిరసనలు జరుగుతున్నాయని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. అయితే, చాలామంది తమ హక్కుల కోసం ఒంటరిగా పోరాడుతూ ప్రభుత్వాల చేతిలో అణచివేతకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘బాపు మనకు సత్యాన్ని మించిన ఆయుధం లేదని నేర్పించారు.. అంతకంటే గొప్ప ఆయుధం సత్యంతో కలిసికట్టుగా నిలబడటం.. విడివిడిగా జరిగే పోరాటాలను ఒకే డిజిటల్ మ్యాప్‌లోకి తెచ్చి ప్రజల మధ్య ఐక్యతను పెంపొందించడమే ‘సత్యాగ్రహ’ ప్రధాన ఉద్దేశం’ అని రాహుల్ గాంధీ సోషల్ మీడియా వేదికగా వివరించారు. నిరసనలు తెలిపే వారు ఎలాంటి సంకోచం లేకుండా ఈ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. తమ నిరసన పెద్దదైనా, చిన్నదైనా సరే ‘సత్యాగ్రహ’ వెబ్‌సైట్‌లోకి వెళ్లి రెండు నిమిషాల్లో వివరాలు నమోదు చేసుకోవచ్చు. తమ పేరు, గ్రూప్ వివరాలు, ఏ అంశంపై పోరాడుతున్నారో స్పష్టంగా పొందుపరచాలని కోరారు.

ప్రతిపక్ష నేతగా అండగా ఉంటా

ఈ ప్లాట్‌ఫామ్‌లో నమోదైన నిరసనల వివరాలను పరిశీలించి, బాధితులకు తగిన మద్దతు అందిస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. ఎక్కడైతే సత్యం అణచివేయబడుతుందో అక్కడ వారికి అండగా నిలవడం ప్రతిపక్ష నేతగా తన బాధ్యత అని చెప్పారు. పార్లమెంటు వేదికగా గళం వినిపించడంతోపాటు రోడ్డెక్కి పోరాడేందుకైనా, లేఖలు రాసేందుకైనా తాను ముందుంటానని, ఈ పోరాటంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకడుగు వేసేది లేదని ఆయన పునరుద్ఘాటించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *