సైబర్ ప్రపంచంలో చిన్నారుల రక్షణ మన బాధ్యత

– సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నరసింహ
– ‘నల్సా’ ఆధ్వర్యంలో చిన్నారుల భద్రతపై జాతీయ సదస్సు

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 3 : మానవాళికి ఉన్న అత్యంత విలువైన ఆస్తి చిన్నారులేనని, సైబర్ ప్రపంచంలో వారిని లైంగిక దోపిడీ నుంచి కాపాడుకుంటూ సురక్షితమైన వాతావరణం కల్పించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.ఎస్.నరసింహ స్పష్టం చేశారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ (నల్సా), రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో సైబర్ స్పేస్‌లో చిన్నారులకు న్యాయం – లైంగిక దోపిడీ నివారణ అనే అంశంపై ప్రతిష్టాత్మక సదస్సును శనివారం నిర్వహించారు. సదస్సుకు ముఖ్యమంత్రితోపాటు సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

పిల్లలకు కరవవుతున్న ‘సమయం’

మారుతున్న ఆధునిక జీవనశైలిలో ఉద్యోగాలు చేసే తల్లిదండ్రులపై పని ఒత్తిడి పెరిగిపోయి పిల్లల కోసం తగినంత సమయం కేటాయించలేకపోతున్నారన్నారు. మరోవైపు మిగిలిన సమయాన్ని సైబర్ ప్రపంచం హరించేస్తోందని జస్టిస్ నరసింహ ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లలను సురక్షితంగా ఉంచడానికి అత్యంత చౌకైనది, కానీ నేడు దొరకకుండా చేజారిపోతున్న అత్యంత ముఖ్యమైన సాధనం పిల్లలతో గడిపే సమయం అన్నారు. నిర్మాణ ప్రదేశాల్లో పనిచేసే కూలీల పిల్లలు సైతం మొబైల్ ఫోన్లలో లీనమైపోతున్న పరిస్థితి నేడు కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

చట్టాల్లో మార్పులు రావాలి

తల్లిదండ్రులు తప్పనిసరిగా తమ పిల్లల కోసం సమయాన్ని కేటాయించేలా గ్యారెంటీ ఇచ్చేందుకు వీలుగా వినూత్న చట్టాలు తీసుకురావాలిలన్నారు. ఇందుకు తెలంగాణ రాష్ట్రమే చొరవ తీసుకుని దేశానికి ఆదర్శంగా నిలవాలన్నారు. ఒక చిన్నారికి అత్యుత్తమ భద్రత తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ద్వారా మాత్రమే లభిస్తుందని చెప్పారు.

ఉపాధ్యాయులకు తగిన గౌరవం దక్కాలి

ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడి సహకారం లేకుండా ఏ చిన్నారీ ఉత్తమ పౌరుడిగా ఎదగలేడు.. కానీ మన పాఠశాలల్లో ముఖ్యంగా స్థానిక భాషా ఉపాధ్యాయులకు తగిన గౌరవం, మర్యాద దక్కడం లేదన్న భావన ఉంది.. ఈ దృక్పథం మారాలి అని అన్నారు. ఉపాధ్యాయులకు తగిన సమయం, భద్రత కల్పించినప్పుడే వారు పిల్లలను ఉన్నతంగా తీర్చిదిద్దగలరని చెప్పారు.

వృద్ధుల సమాజంగా మారే ప్రమాదం

మన దేశంలో జననాల (ఫెర్టిలిటీ) రేటు క్రమంగా పడిపోతోందని తెలిపారు. సౌకర్యవంతమైన భర్తీ నిష్పత్తి 2.1 నుంచి ప్రస్తుతం 1.97కి పడిపోయామని, ఇదే పరిస్థితి కొనసాగితే మరో రెండు తరాల తర్వాత జపాన్ తరహాలో మన సమాజం కూడా వృద్ధుల సమాజంగా మారిపోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే మనకున్న ఈ చిన్నారులు అనే ఆస్తిని బలోపేతం చేసుకోవాలని సూచించారు. చట్టాలు, సాంకేతికతను ఉపయోగించి వారికి పూర్తి భద్రత కల్పించాలన్నారు. కాగా, తన ప్రసంగం ప్రారంభంలో జస్టిస్ నరసింహ హైదరాబాద్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తాను ఇక్కడి వాతావరణంలోనే పెరిగానని, గాలిపటాలు ఎగరేస్తూ, సైకిల్ తొక్కుతూ, రాత్రి వరకూ ఆడుకుంటూ ఎంతో సురక్షితమైన వాతావరణంలో స్వేచ్ఛగా గడిపిన తన బాల్య జ్ఞాపకాలను సభికులతో పంచుకున్నారు. దేశ భవిష్యత్తును సురక్షితం చేయడమంటే పిల్లల భవిష్యత్తును సురక్షితం చేయడమేనని అరవిందుడి సూక్తిని ఈ సందర్భంగా ఉటంకించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *