బ్యాలెట్‌తో ఎన్నికల్లోకి వెళ్లేందుకు సిద్ధమా?

– కాంగ్రెస్ సీఎంలారా.. రాజీనామా చేసి రండి
– జ్ఞానేశ్ కుమార్‌కు, బీజేపీకి ఏం సంబంధం?
– అనివార్య కారణాల వల్ల అమిత్ షా టూర్ వాయిదా
– కేంద్ర మంత్రి బండి సంజయ్

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 3 : కేంద్ర ఎన్నికల కమిషన్‌పై, ఈవీఎంలపై పదేపదే ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సవాల్ విసిరారు. ఈవీఎంల వల్లే కాంగ్రెస్ పార్టీ కేరళ, తెలంగాణ, కర్నాటక, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో గెలిచింది కదా.. మరి ఆ నాలుగు రాష్ట్రాల సీఎంలు రాజీనామా చేసి ప్రభుత్వాలను రద్దు చేసి బ్యాలెట్‌తో మళ్లీ ఎన్నికలకు వెళ్లేందుకు సిద్దమా అని అడిగారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి శనివారం సాయంత్రం విచ్చేసిన కేంద్ర మంత్రి సంజయ్ కుమార్ పార్టీ నేతలు డాక్టర్ మనోహర్ రెడ్డి, సంగప్ప, శ్రీవర్దన్ రెడ్డి తదితరులతో కలిసి మీడియాతో మాట్లాడారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ కు, బీజేపీకి ఏం సంబంధం అని ప్రశ్నించారు. ఆయన ఎన్డీయే మంత్రి కాదు.. సీఈసీ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వ్యవస్థ అని చెప్పారు. అసలు ఇండి కూటమికి జనాదరణ లేదని, వాళ్ల ఆందోళన కార్యక్రమాలకు పట్టుమని పదిమంది కూడా రావడం లేదని, ముంబై, దిల్లీల్లో ఆందోళనలకు జనం పెద్దగా రాకపోవడమే ఇందుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. ‘సర’ ప్రక్రియలో భాగంగా సీపీఎం దొంగ ఓట్లను తొలగించడంవల్లే కేరళలో అధికారంలోకి వచ్చామని కాంగ్రెస్ నేత రమేశ్ చెన్నితల చెప్పారు కదా.. మరి దీనికి కాంగ్రెస్ నేతలు ఏమంటారు అని ప్రశ్నించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ రావాల్సి ఉన్నప్పటికీ అనివార్య కారణాలవల్ల ఆయన పర్యటన వాయిదా పడిందని బండి సంజయ్ తెలిపారు.

మచ్చార్ ధైర్యసాహసాలపై స్పందించకపోవడం సిగ్గుచేటు

ప్రపంచమంతా కెప్టెన్ స్మిత్ మచ్చార్ ధైర్య సాహసాలను కొనియాడుతుంటే రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ నేతలు కనీసం స్పందించకపోవడం సిగ్గు చేటన్నారు. స్మిత్ మచ్చార్‌పై దాడి చేసిన వ్యక్తి సామాజికవర్గం ఓట్లు పోతాయోయేమోననే భయంతోనే వాళ్లు స్పందించడంలేదని, అలాంటి వాళ్లంతా తన దృష్టిలో దేశద్రోహులు, దిమాగీ నక్సల్సేనని అన్నారు.

ఆలయంపై దాడి హేయనీయం

దిల్‌సుక్‌నగర్‌లో సంతోషిమాత ఆలయంపై దాడి హేయనీయమన్నారు.. హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. గతంలో దాడి చేసిన వాళ్లపై చర్యలు తీసుకుని ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదన్నారు. దాడి చేసిన మతం వాళ్లు బాధపడతారనే కారణంతో ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ప్రజలు ప్రశ్నిస్తే దాడి చేసినోడిని పిచ్చోడిగా చిత్రీకరించడం అలవాటైందని విమర్శించారు. పిచ్చోడికి మందిర్, మసీదు అనే తేడా తెల్వదు.. కానీ మందిరాలపైనే ఎందుకు దాడి చేస్తున్నారు అని అడిగారు. హిందువులు దీటుగా స్పందించకపోవడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వం పద్దతి మార్చుకుని దాడి చేసిన వాళ్లపై కఠినంగా వ్యవహరించాలని, లేకపోతే యువత రోడ్లపైకి వచ్చి తిరగబడితే వాళ్లను ఆపే పరిస్థితి ఉండదని హెచ్చరించారు.

కాంగ్రెస్, బీఆరఎస్ దొందూ దొందే

బీఆర్ఎస్ అవినీతిపై కాంగ్రెస్ విచారణ జరిపి చర్యలు తీసుకోదు.. కాంగ్రెస్ ఆరు గ్యారంటీల అమలుపై బీఆర్ఎస్ పోరాడదు అని మంత్రి బండి ఎద్దేవా చేశారు. కాళేశ్వరంలో లక్ష కోట్ల అవినీతి జరిగిందని సీబీఐకి ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం లేఖ రాయలేదన్నారు. కేసీఆర్ కుటుంబానికి పూర్వమే చింతమడకలో వందల ఎకరాలున్నాయనడం పెద్ద జోక్ అంటూ ఆనాడు వాళ్లకు హైదరాబాద్‌లో అసలు ఇల్లే లేదు.. అధికారంలోకి వచ్చాకే ఇన్ని హోటళ్లు, ఆస్తులు ఎట్లా వచ్చాయి అని ప్రశ్నించారు. కాగా, టీచర్లు, గ్రాడ్యుయేట్లు, నిరుద్యోగ యువత బీజేపీ పక్షానే ఉన్నారని, గతంలో రెండు ఎమ్మెల్సీ సీట్లను తాము కైవసం చేసుకోవడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. ప్రజల్లో బీజేపీకి సానుకూలత ఉందని, ఖైరతాబాద్ ఉప ఎన్నికలోనూ బీజేపీ గెలుపు తథ్యం అని బండి సంజయ్ స్పష్టం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *