ఉపాధి లక్ష్యమే ఉన్నత విద్య పరమార్ధం కావాలి

– మంత్రి శ్రీధర్‌బాబు
– స్టార్టప్‌లు, ఆవిష్కరణల కోసం ఇంక్యుబేషన్ సెంటర్
– డిగ్రీతో పాటే నైపుణ్యాల సాధన నూతన ప్రమాణం కావాలి
– జేఎన్‌టీయూహెచ్‌లో వేడుకగా ‘రీచ్-2026’ సదస్సు

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 3 : తరగతి గదికి, పరిశ్రమల అవసరాలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని పూర్తిగా తగ్గించాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు విద్యా సంస్థలకు పిలుపునిచ్చారు. విద్యా వ్యవస్థ యువతలో ఆలోచనా శక్తిని పెంపొందించడమే కాక వారిలో నైపుణ్యాలను అందించేలా వాస్తవ ప్రపంచ సమస్యలకు పరిష్కారాలు చూపేలా సిద్ధం చేయాలని ఆకాంక్షించారు. తెలంగాణ ఉన్నత విద్యామండలి (టీజీసీహెచ్‌ఈ) ఆధ్వర్యంలో కూకట్‌పల్లి జేఎన్‌టీయూహెచ్‌లో శనివారం నిర్వహించిన ‘రీచ్-2026’ (రిసెర్చ్, ఎడ్యుకేషన్ అండ్ అడ్వాన్స్‌మెంట్) సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు.
తరగతి గది నుంచి భవిష్యత్ కెరీర్ వైపు, విద్య నుంచి నైపుణ్యాల వైపు, పరిశోధన నుంచి పారిశ్రామిక రంగానికి నిరంతర అనుసంధానం ఉండాలని మంత్రి పేర్కొన్నారు. మన విద్యా వ్యవస్థ కేవలం డిగ్రీ సర్టిఫికెట్లు అందించే విధానం నుంచి విద్యార్థులకు ఆచరణాత్మక నైపుణ్యాలు అందించే దిశగా మారాలన్నారు. కోర్సు పూర్తయిన వెంటనే విద్యార్థి ఉద్యోగానికి అర్హత సాధించాలని, పట్టా చేతికి వచ్చే సమయానికే ఆ స్థాయి సన్నద్ధత ఉండాలని పునరుద్ఘాటించారు. విద్యార్థులు, పరిశోధకులు తమ ఆలోచనలను స్టార్టప్‌లుగా, నూతన ఉత్పత్తులుగా మలచడానికి వీలుగా ప్రతి విశ్వవిద్యాలయంలో ఇంక్యుబేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. కరికులమ్ రూపకల్పన, ల్యాబ్‌ల నిర్వహణ, ఇంటర్న్‌షిప్‌లు, లైవ్ ప్రాజెక్ట్‌లు, పరిశోధనల్లో పరిశ్రమలు భాగస్వామ్యమవ్వాలని విజ్ఞప్తి చేశారు. ‘ఒక చేతిలో డిగ్రీ.. మరో చేతిలో నైపుణ్యం’ ఉండటమే మన నూతన ప్రామాణికం కావాలన్నారు. టాటా టెక్నాలజీస్ భాగస్వామ్యంతో 65 ప్రభుత్వ ఐటీఐలను రోబోటిక్స్, ఆటోమేషన్, ఇండస్ట్రీ 4.0 వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన కేంద్రాలుగా(ఏటీసీ) తీర్చిదిద్దుతున్నామని వెల్లడించారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా సరికొత్త విద్యా, నైపుణ్య వ్యవస్థను నిర్మిస్తున్నామని తెలిపారు. ‘తెలంగాణ రైజింగ్-2047’ లక్ష్యంతో ఉన్నత విద్యను ప్రపంచస్థాయిలో తీర్చిదిద్దడం, పరిశోధనల్లో ప్రతిభను పెంచడం, ఆవిష్కరణల వ్యవస్థను బలోపేతం చేయడంపై సదస్సులో విస్తృతంగా చర్చించారు. సదస్సులో సైయెంట్ వ్యవస్థాపక చైౖర్మన్ డాక్టర్ బి.వి.ఆర్. మోహన్ రెడ్డి, టీజీసీహెచఈ ఛైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి, జేఎన్‌టీయూహెచ్ వీసీ ప్రొఫెసర్ టి.కిషన్ కుమార్ రెడ్డి, ఉస్మానియా వర్సిటీ వీసీ¾ ప్రొఫెసర్ ఎం.కుమార్, ప్రొఫెసర్ పురుషోత్తంలతోపాటు వివిధ వర్సిటీల ఉప కులపతులు, 60కి పైగా ఉన్నత విద్యాసంస్థల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *