– పెట్టుబడుల ఆకర్షణ, ప్రభుత్వ భూముల విలువ పెంపుపై దృష్టి
– పర్యాటక రంగాన్ని కీలక ఆదాయ వనరుగా తీర్చిదిద్దాలి
– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 3 : రాష్ట్రంలో అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకుంటూ ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేందుకు సమగ్ర కార్యాచరణ చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. హిల్ట్ పాలసీ అమలు, పర్యాటక రంగంలో పెట్టుబడుల ఆకర్షణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. రాష్ట్ర సచివాలయంలో ఆయన అధ్యక్షతన వనరుల సమీకరణపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం శనివారం జరిగింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసేలా ప్రభుత్వ భూములను సమర్థవంతంగా వినియోగించుకోవడం, వాటి విలువను పెంచడం, పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని కల్పించడం, పర్యాటక రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం వంటి అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. అదనపు ఆదాయ వనరులను గుర్తించడంతోపాటు పెట్టుబడులను ఆకర్షించే ప్రాజెక్టులను వేగంగా కార్యరూపంలోకి తీసుకురావాలన్నారు. ప్రభుత్వ ఆస్తులు, భూముల ద్వారా గరిష్ఠ ఆర్థిక ప్రయోజనం పొందేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. హిల్ట్ పాలసీలో ఎలాంటి అభ్యంతరాలు లేని పార్కులకు సంబంధించిన దరఖాస్తులను ప్రాధాన్యతతో పరిశీలించి త్వరితగతిన క్లియరెన్స్ ఇవ్వాలని భట్టి విక్రమార్క ఆదేశించారు. ఈ పాలసీపై పరిశ్రమలకు మరింత అవగాహన కల్పించేందుకు ఆరు పార్కుల్లో మంత్రుల ఆధ్వర్యంలో రోడ్ షోలు నిర్వహించాలని సీఎస్ సంజయ్ జాజు సూచించారు
గ్లోబల్ సమ్మిట్‌కు 70-80 పర్యాటక ప్రాజెక్టులు
పర్యాటక రంగంలో భారీ పెట్టుబడులను ఆకర్షించేలా ప్రాజెక్టులను సిద్ధం చేయాలని భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. గతంలో రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలను వివరించినప్పుడు సుమారు రూ.30 వేల కోట్ల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. రాబోయే గ్లోబల్ సమ్మిట్‌లో దేశ, విదేశీ పెట్టుబడిదారులకు పర్యాటక రంగంలోని అవకాశాలను సమగ్రంగా ప్రదర్శించేందుకు 70-80 సమగ్ర ప్రాజెక్టు నివేదికలు సిద్ధం చేయాలని సీఎస్‌కు సూచించారు.
కోటలు, టైగర్ టూరిజంపై ప్రత్యేక దృష్టి
చారిత్రక కోటలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసేందుకు పీపీపీ విధానంలో 11 కోటలకు బిడ్లు ఆహ్వానించినట్లు అధికారులు తెలిపారు. టైగర్ టూరిజం కార్యక్రమాలను వెంటనే ప్రారంభించాలని భట్టి ఆదేశించారు. నిజాంసాగర్‌లోని నిజాం గెస్ట్‌హౌస్‌ను పర్యాటక అవసరాలకు వినియోగించే అంశాన్ని పరిశీలించాలని సివిల్ సప్లై, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సూచించారు. రాష్ట్రంలో పర్యాటక మౌలిక వసతులను మరింత బలోపేతం చేసేందుకు కారవాన్ పార్కుల ఏర్పాటుపై దృష్టి సారించాలని, ఇందుకోసం గుర్తించిన మూడు జిల్లాల కలెక్టర్ల సహకారంతో ప్రక్రియను వేగవంతం చేయాలని భట్టి విక్రమార్క ఆదేశించారు. ప్రధాన పర్యాటక ప్రాజెక్టుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించాలని, ప్రతి ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుంది, ఎప్పటికి పర్యాటకులకు అందుబాటులోకి వస్తుందనే అంశాలపై స్పష్టమైన కార్యాచరణ రూపొందించాలన్నారు. సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ వాణిప్రసాద్, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ప్లానింగ్ సెక్రటరీ గౌరవ్ ఉప్పల్, వివిధ శాఖల ఉన్నతాధికారులు శశాంక, కృష్ణ భాస్కర్, ఇలంబర్తి, నిఖిల్ చక్రవర్తి, లోకేష్ కుమార్, కృష్ణ ఆదిత్య, సర్ఫరాజ్ అహ్మద్ పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





