– తెలంగాణలో వ్యాపార అవకాశాలను అన్వేషించాలి
– పెట్టుబడిదారులకు సీఎస్ సంజయ్ జాజు పిలుపు
న్యూదిల్లీ, సెప్టెంబర్ 24 : ప్రపంచస్థాయి ఏరోస్పేస్, రక్షణ రంగ కంపెనీలు, భారతీయ తయారీదారులు, ఎంఎస్ఎంఈలు, స్టార్టప్‌లు, టెక్నాలజీ డెవలపర్లు ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ‘రక్షా ఎక్స్పో 2026’లో పాల్గొని తెలంగాణలో ఉన్న అవకాశాలను అన్వేషించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆహ్వానించారు. న్యూదిల్లీలో గురువారం జరిగిన ‘న్యూస్ 18 డిఫ్కాన్ 2026’ సదస్సులో ఆయన ప్రసంగిస్తూ హైదరాబాద్ భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 7 నుండి జరగనున్న ఈ ఎక్స్పో ప్రధానంగా వ్యాపార వృద్ధిపై దృష్టి పెట్టనుందన్నారు. గ్లోబల్ ఒరిజినల్ ఎక్విప్మెంట్ తయారీదారులు, భారతీయ కంపెనీలు, ఎంఎస్ఎంఈలు, స్టార్టప్‌లు, ప్రొక్యూర్మెంట్ బృందాల మధ్య ప్రత్యేకంగా బిజినెస్-టు-బిజినెస్(బీ2బీ) సమావేశాలు, ప్రత్యక్ష చర్చలు జరుగుతాయని తెలిపారు. ఈ వేదిక వెండార్ల అభివృద్ధికి, సాంకేతిక భాగస్వామ్యాలకు, భారతీయ సరఫరాదారులను దేశీయ, అంతర్జాతీయ సప్లై చైన్లలో అనుసంధానించడానికి ఎంతగానో దోహదపడుతుందన్నారు. తెలంగాణలో తయారీ కేంద్రాలు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు, ప్రత్యేక ఇంజనీరింగ్ టెస్ట్ బెడ్లు, జాయింట్ వెంచర్ల ఏర్పాటుకు భారతీయ సరఫరాదారులను ఎంపిక చేసుకోవాలని గ్లోబల్ కంపెనీలను ప్రోత్సహించనున్నట్లు స్పష్టం చేశారు. పాల్గొనే కంపెనీలకు, కాబోయే వ్యాపార భాగస్వాములకు మధ్య ముందే నిర్ధారించిన సమావేశాలను ఏర్పాటు చేయడానికి మిలిటరీ అటాచ్లు, కౌన్సులర్ ట్రేడ్ ఆఫీసులు కూడా సహకరిస్తాయని వివరించారు. రక్షా ఎక్స్‌పోలో ప్రత్యేకంగా ఏరోస్పేస్, డిఫెన్స్ అండ్ స్పేస్ కాంక్లేవ్, అధునాతన సాంకేతిక ప్రదర్శన, ఎయిర్ షో, లైవ్ ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు. కంపెనీలు తమ డ్రోన్లు, కౌంటర్-డ్రోన్ సిస్టమ్స్, అటానమస్ ప్లాట్‌ఫాంలు ల్యాండ్-బేస్డ్ రక్షణ పరికరాలను ప్రదర్శించవచ్చన్నారు. వివిధ దేశాలకు చెందిన పెవిలియన్లతో పాటు, భారతీయ ఎంఎసఎంఈలు, స్టార్టప్‌ల కోసం ప్రత్యేక టెక్నాలజీ జోన్లను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. గ్లోబల్ కంపెనీలు తమ సీనియర్ లీడర్షిప్, ప్రొక్యూర్మెంట్ హెడ్లు, సోర్సింగ్ బృందాలను ఈ సమ్మిట్‌కు పంపాలని ప్రధాన కార్యదర్శి ఆహ్వానించారు. ఎగ్జిబిషన్ స్పేస్‌ను బుక్ చేసుకోవాలని, తమ సామర్థ్యాలను ప్రదర్శించాలని, బీ2బీ సెషన్లలో పాల్గొనాలని, పెట్టుబడిదారులు, సోర్సింగ్ భాగస్వామ్యాలు, అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఈ సమ్మిట్‌ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 2025-26లో తెలంగాణ ఏరోస్పేస్, రక్షణ రంగ ఎగుమతులలో సాధించిన 103 శాతం వృద్ధిని, అలాగే వ్యూహాత్మక పరిశోధనా సంస్థలు, డిఫెన్స్ పీఎస్‌యూలు, దాదాపు 1,500 నుండి 2,000 ప్రెసిషన్-ఇంజనీరింగ్ ఎంఎస్ఎంఈలతో కూడిన బలమైన పర్యావరణ వ్యవస్థను ప్రధాన కార్యదర్శి తన ప్రసంగంలో హైలైట్ చేశారు. డ్రోన్లు, కౌంటర్-డ్రోన్ సిస్టమ్స్, ఏవియానిక్స్, అధునాతన మెటీరియల్స్, ప్రొపల్షన్, స్పేస్ టెక్నాలజీస్, ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్‌హాల్ రంగాలలో రాష్ట్రం తన సామర్థ్యాలను విస్తరిస్తోందని తెలిపారు. గ్లోబల్ సమ్మిట్ 2026కు హాజరుకావాల్సిందిగా, రక్షా ఎక్స్పో 2026ను ప్రారంభించాల్సిందిగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఇటీవల కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి వ్యక్తిగతంగా ఆహ్వానించిన విషయాన్ని గుర్తు చేశారు. ఏరోస్పేస్, రక్షణ రంగాల్లో సోర్సింగ్ భాగస్వామ్యాలు, సాంకేతిక సహకారం, పెట్టుబడులు, దీర్ఘకాలిక వ్యాపార సంబంధాలను సులభతరం చేసే ఫలితాధారిత పారిశ్రామిక వేదికగా రక్షా ఎక్స్పోను తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని సంజయ్‌జాజు చెప్పారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





