– కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
న్యూదిల్లీ, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 24 : పార్టీ ఫిరాయింపులకు పాల్పడి ప్రజాతీర్పును అపహాస్యం చేసిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలన్న హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించడాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నట్లు కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ తీర్పు ఒక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశమే కాదని, కాంగ్రెస్, బీఆర్ఎస్లు చట్టవ్యతిరేకంగా అనుసరిస్తున్న పార్టీ ఫిరాయింపుల రాజకీయాలకు ఇది ఒక గుణపాఠమని అన్నారు. పతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ ఫిరాయింపులను విమర్శించడం, అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకోవడం, వారికి మంత్రి పదవులు ఇవ్వడం రాష్ట్ర రాజకీయాల్లో ఈ రెండు పార్టీలు ఒక దురదృష్టకరమైన సంస్కృతిగా మార్చాయని విమర్శించారు. ప్రజాతీర్పును కాలరాయడంలో కాంగ్రెస్, బీఆర్ఎస్లు పోటీ పడుతున్నాయన్నారు. ఇది ఈ పార్టీల రాజకీయ ద్వంద్వ వైఖరికి అద్దం పడుతున్నదన్నారు. ప్రజాతీర్పును తమ రాజకీయ అవసరాలకు అనుగుణంగా మార్చుకుంటున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ అవకాశవాద రాజకీయాలకు సుప్రీంకోర్టు తీర్పు స్పష్టమైన హెచ్చరిక అని మంత్రి కిషన్రెడ్డి పేర్కొన్నారు. దానం నాగేందర్ అనర్హతతో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయిందని, ఇప్పుడు ఖైరతాబాద్ ప్రజలు అవకాశవాద, స్వార్థ, ఫిరాయింపు రాజకీయాలకు వ్యతిరేకంగా తమ ప్రతినిధిని ఎన్నుకునే అవకాశం రానుందని తెలిపారు. ప్రజాస్వామ్యంలో అంతిమ నిర్ణేతలు ప్రజలేనని, ఈ రెండు పార్టీల కుళ్లు రాజకీయాలకు తగిన బుద్ధి చెప్పి వచ్చే ఉప ఎన్నికలో బీజేపీకి పట్టంగట్టడం ఖాయం అని కిషన్రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు


