రేపు సీఎం రేవంత్‌కు ‘ముహమ్మద్’ అవార్డు ప్రదానం

– బెస్ట్ పబ్లిక్ సర్వెంట్-2026కు రేవంత్‌రెడ్డి ఎంపిక
– కేరళ నిలంబూరులో అవార్డు ప్రదానోత్సవం
– రైతు, బీసీ, ప్రజా సంక్షేమ పాలనకు గుర్తింపు

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 24 : ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ప్రతిష్టాత్మక ‘ఆర్యదాన్ ముహమ్మద్ బెస్ట్ పబ్లిక్ సర్వెంట్-2026′ (ఉత్తమ ప్రజా సేవకుడు) అవార్డుకు ఎంపికయ్యారు. కేరళకు చెందిన దిగ్గజ కాంగ్రెస్ నేత, దివంగత ఆర్యదాన్ ముహమ్మద్ స్మారకార్థం ముహమ్మద్ ఫౌండేషన్ ఈ పురస్కారాన్ని అందజేస్తోంది. తెలంగాణలో రైతులు, వెనుకబడిన వర్గాలు, సామాన్య ప్రజల సంక్షేమానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేపట్టిన వినూత్న కార్యక్రమాలు, దూరదృష్టి గల నాయకత్వానికి గాను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు ఫౌండేషన్ వర్కింగ్ చైర్మన్, నిలంబూర్ ఎమ్మెల్యే ఆర్యదాన్ షౌకత్ తెలిపారు. అవార్డు ఎంపికకు ఎంపీ బెన్నీ బెహనన్, కేరళ రెవెన్యూ శాఖ మంత్రి ఎ.పి.అనిల్‌కుమార్, ప్రముఖ మేధావి కల్పేట్టా నారాయణన్ జ్యూరీగా వ్యవహరించారు. ప్రజాస్వామిక విలువలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉన్న నిబద్ధతను జ్యూరీ ప్రత్యేకంగా కొనియాడింది. ఆర్యదాన్ ముహమ్మద్ నాలుగో వర్ధంతిని పురస్కరించుకుని కేరళలోని నిలంబూర్‌లో శుక్రవారం ఉదయం 10 గంటలకు అవార్డును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రదానం చేస్తారు. పురస్కారం కింద రూ.లక్ష నగదు బహుమతి, ప్రశంసా పత్రం, జ్ఞాపికను అందజేస్తారు. వేడుకలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి(సంస్థాగత) కె.సి. వేణుగోపాల్ ఆర్యదాన్ ముహమ్మద్ స్మారక ఉపన్యాసం చేస్తారు. ముహమ్మద్ కేరళ కాంగ్రెస్ సీనియర్ నేత. ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా, కేరళలోని వివిధ మంత్రివర్గాల్లో నాలుగుసార్లు వివిధ శాఖలకు మంత్రిగా సేవలు అందించారు. రాజనీతిజ్ఞుడైన ముహమ్మద్ దూరదృష్టి గల నేతగా, అద్భుతమైన పార్లమెంటేరియన్‌గా, సమర్థుడైన పాలకునిగా, కార్మికవర్గ ఛాంపియన్‌గా కేరళ ప్రజల మదిలో నిలిచిపోయారు. నిజాయతీ, లౌకిక విలువలు, ప్రజా సంక్షేమ పాలనకు మారుపేరుగా ముహమ్మద్ నిలిచారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *