రాహుల్ వైద్య పరీక్షలు చేయించుకోవాలి

– ప్రధాని, హోంమంతిపై వ్యాఖ్యలు దురదృష్టకరం
– ఫిరాయింపులు ప్రోత్సహిస్తూ ఓట్ చోరీ అనడం ద్వంద్వ వైఖరి
– రాజ్యాంగబద్ధ సంస్థలు, బలగాలపై నమ్మకం లేకపోవడం సిగ్గుచేటు
– రాహుల్‌పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్ర‌హం

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 25:  అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ప్రజలచే ఎన్నికైన ప్రధానమంత్రి, హోంమంత్రిని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దేశద్రోహి అని వ్యాఖ్యానించడం ఆయన మానసిక దుస్థితికి, అసహనానికి నిదర్శనమని కేంద్ర బొగ్గు, గ‌నుల శాఖ‌ మంత్రి జి.కిషన్ రెడ్డి మండిపడ్డారు. వరుస ఓటములతో మానసిక సమతుల్యత కోల్పోయిన రాహుల్ గాంధీ బహిరంగంగా మాట్లాడే ముందు మానసిక వైద్యుడిని సంప్రదిస్తే మంచిదని హితవు పలికారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

అసలైన ‘ఓట్ చోరీ’ కాంగ్రెస్‌దే

బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన దానం నాగేందర్‌పై సుప్రీంకోర్టు అనర్హత వేటు వేయడాన్ని స్వాగతించి క్షమాపణలు చెప్పాల్సింది పోయి ప్రజాస్వామ్య పాఠాలు చెప్పడం హాస్యాస్పదమని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇతర పార్టీల టికెట్లపై గెలిచిన ప‌దిమంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవడమే అసలైన ‘ఓట్ చోరీ’ అని దుయ్యబట్టారు. ప్రజల తీర్పును దొంగిలించిన కాంగ్రెస్‌కు ఇతరులపై ఆరోపణలు చేసే నైతిక హక్కు లేదన్నారు.

రాజ్యాంగ సంస్థలపై నమ్మకం లేదు:

కాంగ్రెస్ పార్టీకి సుప్రీంకోర్టు, ఎన్నికల కమిషన్, ఈవీఎంలు, దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐలతో పాటు దేశాన్ని కాపాడే సాయుధ బలగాలపై కూడా నమ్మకం లేదని విమర్శించారు. విచారణ సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని ఆరోపిస్తున్న కాంగ్రెస్ నేతలు నేషనల్ హెరాల్డ్కే సులో రాహుల్ గాంధీ బెయిల్‌పై బయట ఎందుకు తిరుగుతున్నారో ఆత్మవిమర్శ చేసుకోవాలని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ గెలిస్తే ప్రజాస్వామ్యం గెలిచినట్లు, ఇతర పార్టీలు గెలిస్తే ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగినట్లు మాట్లాడటం వారి ద్వంద్వ వైఖరికి అద్దం పడుతోందన్నారు.

ఓటర్లను అవమానించడం సిగ్గుచేటు

భారత ఓటర్లను ఇరాక్, ఉత్తర కొరియా ప్రజలతో పోల్చడం తీవ్రంగా ఖండించదగ్గ‌ విషయమని కిషన్ రెడ్డి అన్నారు. ప్రపంచవ్యాప్తంగా గౌరవం పొందుతున్న ప్రధానమంత్రిపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడం తగదని, రాహుల్ గాంధీ తన వైఖరిని మార్చుకోకపోతే గతంలో కాంగ్రెస్‌కు పట్టిన గతే మళ్లీ పడుతుందని, ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *