గురుకుల విద్యార్థినులను కరిచిన ఎలుకలు

– 14 మందికి గాయాలు.. ఆలస్యంగా వెలుగులోకి..

–      హాస్టల్ కు చేరుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి

–      లోపలికి వెళ్ళకుండా అడ్డుకున్న పోలీసులు, సిబ్బంది

–      అనుమతించకపోవడంతో హాస్టల్‌ ఎదుట ధర్నాకు దిగిన దయాకర్ రావు

జనగామ, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 25 :

జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో 14 మంది విద్యార్థినులను ఎలుకలు కరిచిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంగళవారం రాత్రి నిద్రిస్తున్న విద్యార్థినులను ఎలుకలు కరవడంతో పలువురికి గాయాలయ్యాయి. అనంతరం బాధితులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినట్లు సమాచారం. ఈ ఘటనపై స్పందించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు శుక్రవారం పాలకుర్తిలోని గురుకుల పాఠశాల, హాస్టల్‌కు చేరుకున్నారు. విద్యార్థినులను పరామర్శించి ఘటనకు గల కారణాలను తెలుసుకునేందుకు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు, పాఠశాల సిబ్బంది అనుమతించలేదని ఆయన తెలిపాయి. దీంతో విద్యార్థినుల పరిస్థితి గురించి తెలుసుకునే వరకు అక్కడి నుంచి వెళ్లేది లేదని పేర్కొంటూ హాస్టల్‌ ఎదుట ఎర్రబెల్లి ధర్నాకు దిగారు. అనంతరం హాస్టల్‌ వార్డెన్‌, ప్రిన్సిపాల్‌తో మాట్లాడిన ఎర్రబెల్లి.. విద్యార్థినులకు కనీస వసతులు కల్పించకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల ఆవరణలో పారిశుద్ధ్య సమస్యలు ఉన్నాయని, గతంలో ఇక్కడ పనిచేస్తున్న సిబ్బందిని పాము కరిచిన ఘటన కూడా జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ.. గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు భద్రత, కనీస వసతులు కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. 14 మంది విద్యార్థినులను ఎలుకలు కరిచిన ఘటనపై ఇప్పటివరకు స్పందించకపోవడం బాధాకరమన్నారు. ఘటనకు బాధ్యులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సాంఘిక సంక్షేమ పాఠశాలల సెక్రటరీ శారదతో ఫోన్‌లో మాట్లాడి ఘటన వివరాలను ఆమె దృష్టికి తీసుకెళ్లినట్లు ఎర్రబెల్లి తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చినట్లు చెప్పారు. కనీస వసతుల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించాలని, విద్యార్థినుల భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని ఎర్రబెల్లి డిమాండ్ చేశారు. గతంలో తాను మంత్రిగా ఉన్న సమయంలో విద్యార్థుల సౌకర్యాలపై నిరంతరం పర్యవేక్షణ చేపట్టామని ఆయన పేర్కొన్నారు.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *