ప్రజా సమస్యలకు మండలస్థాయిలోనే పరిష్కారం

– గ్రీవెన్స్‌కు వచ్చిన ప్రతి దరఖాస్తుపై స్పష్టమైన సమాధానం ఇవ్వాలి
– ఎంపీడీ కార్యాలయాల్లో ప్రత్యేక హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేయాలి
– అత్యవసర సమస్యలపై తక్షణమే స్పందించాలి
– గోవింద‌రావుపేట ‘ప్ర‌జావాణి’లో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క

ములుగు, ప్రజాతంత్ర, ఆగస్టు 17 : ప్రజల సమస్యలకు మండలస్థాయిలోనే పరిష్కారం చూపాలని, మండల ప్రజావాణికి వచ్చిన ప్రతి దరఖాస్తుపై స్పష్టమైన సమాధానం తెలియజేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు. గోవిందరావుపేట మండల కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన మండల ప్రజావాణి కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ అత్యవసర సమస్యలపై అధికారులు తక్షణమే స్పందించాలని, మారుమూల గ్రామాలు, గూడేల్లో పర్యటించి సమస్యలు తెలుసుకోవాలని, చిత్తశుద్ధితో విధులు నిర్వర్తించాలని కూడా ఆదేశించారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం జిల్లా కేంద్రాలు, హైదరాబాద్ వరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా మండలస్థాయిలోనే ప్రతి సోమవారం గ్రీవెన్స్ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించి సమస్యలకు వెంటనే పరిష్కారం చూపాలన్నారు. మండలస్థాయిలో పరిష్కారం కాని సమస్యలను సంబంధిత జిల్లా, రాష్ట్రస్థాయి అధికారులకు పంపి వాటిపై సమాధానం తెప్పించి దరఖాస్తుదారులకు తెలియజేయాలన్నారు. గ్రీవెన్స్‌కు వచ్చే ప్రతి దరఖాస్తుదారుడి సెల్‌ఫోన్ నంబర్‌ను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు. ఎంపీడీవో కార్యాలయంలో ప్రత్యేకంగా హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేసి ప్రజలకు అవసరమైన సమాచారం అందించాలన్నారు. సమస్య పరిష్కారానికి ఎంత సమయం పడుతుందో ముందుగానే తెలియజేయడంతోపాటు, నిర్ణీత సమయంలో దరఖాస్తు పరిష్కారమైందా లేదా, పరిష్కారం కాకపోతే కారణం ఏమిటనే విషయాన్ని సంబంధిత వ్యక్తికి స్పష్టంగా తెలియజేయాలని అన్నారు. అత్యవసర సమస్యల విషయంలో అధికారులు వెంటనే స్పందించి చర్యలు ప్రారంభించాలని మంత్రి ఆదేశించారు. జిల్లా లేదా రాష్ట్రస్థాయిలో పరిష్కరించాల్సిన అంశాలకు అవసరమైన సమయాన్ని అంచనా వేసి కనీసం వారం రోజుల్లో దరఖాస్తుదారులకు పురోగతిపై సమాచారం అందించాలని సూచించారు. ప్రజలు ఒకే సమస్య కోసం పదేపదే కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి రాకూడదన్నారు. మండలాల వారీగా గ్రీవెన్స్ కార్యక్రమాలను పటిష్టంగా నిర్వహించడం ద్వారా జిల్లా కేంద్రానికి వచ్చే ప్రజల సంఖ్య తగ్గడంతోపాటు స్థానికంగానే సమస్యలకు వేగంగా పరిష్కారం లభిస్తుందని తెలిపారు. ఒంటరి మహిళలు, వితంతువుల, దివ్యాంగులకు సంబంధించిన పింఛన్ దరఖాస్తులను ఈ నెల 31లోగా అన్ని గ్రామాల నుంచి పూర్తిస్థాయిలో స్వీకరించాలని అధికారులను ఆదేశించారు. వికలాంగులు, గీత కార్మికులు, నేత కార్మికులు, తలసీమియా బాధితులు తదితర అర్హుల పింఛన్లకు ప్రభుత్వం దశలవారీగా చర్యలు చేపడుతోందని తెలిపారు. అర్హులైన వారు దరఖాస్తు చేసుకోలేదనే పరిస్థితి తలెత్తకుండా ఎంపీడీవోలు, తహసీల్దార్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. కాగా, పస్రా, గోవిందరావుపేట, చల్వాయి తదితర ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చామని, ఎస్టీ తండాలు, గూడేల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి సుమారు రూ.50 కోట్లతో పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. గ్రామాల్లో అంతర్గత, సీసీ రహదారుల సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కళ్యాణి, తహసిల్దార్ సృజన్ కుమార్, ఎంపీడీవో వరుణ్ కుమార్, స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *