– అరెస్టును ఖండించిన సీఎం రేవంత్, మంత్రి పొంగులేటి
న్యూదిల్లీ, అక్టోబర్ 6 : సీఈసీ జ్ఞానేష్‌కుమార్ రాజీనామా కోరుతూ ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంటు నుండి భారత ఎన్నికల సంఘం(సీఈసీ) ప్రధాన కార్యాలయం వైపు మంగళవారం భారీ ప్రదర్శన నిర్వహించారు. అయితే భారీ ప్రదర్శనకు అనుమతి లేకపోవడం, శాంతిభద్రతల సమస్యలను కారణంగా చూపుతూ దిల్లీ పోలీసులు ఆకాశవాణి భవన్ సమీపంలో ప్రదర్శనను అడ్డుకున్నారు. అనంతరం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, కేసీ వేణుగోపాల్ సహా పలువురు నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఉద్యమం ఒక సాధారణ రాజకీయ పోరాటం కాదని, రాజ్యాంగాన్ని కాపాడటానికి, పారదర్శక ఓటింగ్ హక్కులను నిర్ధారించడానికి చేస్తున్న పోరాటమని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
రాహుల్ పోరాటానికి వణుకుతున్న కేంద్ర ప్రభుత్వం : సీఎం రేవంత్ రెడ్డి
ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటంతో కేంద్ర ప్రభుత్వం వణికిపోతోందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. అస్తవ్యస్తంగా మారిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ రద్దు, సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేసే వరకు తమ పార్టీ విశ్రమించబోదని స్పష్టం చేశారు. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు గొడ్డలిపెట్టులా మారిన ‘సర’ రద్దు కోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ఓటు బచావో.. దేశ్ బచావో(ఓటును రక్షిద్దాం.. దేశాన్ని రక్షిద్దాం) ఉద్యమంలో భాగంగా అహింసాయుతంగా ఆందోళన చేస్తున్నరాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు కేసీ వేణుగోపాల్, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్, ఇండి కూటమి ఎంపీలను అరెస్టు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య, చట్ట విరుద్ధమైన ఈ అరెస్టులు బీజేపీ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శమన్నారు. స్వాతంత్య్ర ఉద్యమ కాలంలోనూ స్వల్ప కారణాలకే మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, సర్దార్ పటేల్ వంటి నేతలను నాటి వలస ప్రభుత్వం అరెస్టు చేసేదని, ఇప్పుడు బ్రిటిష్ జనతా పార్టీ(బీజేపీ) కూడా అలానే రాహుల్ గాంధీని అరెస్టు చేసిందని సీఎం విమర్శించారు. అక్రమ అరెస్టులు, జైళ్లు కాంగ్రెస్ నేతలకు కొత్త కాదని సీఎం అన్నారు. ప్రతి ఒక్కరి ఓటు హక్కును, దేశ ప్రజాస్వామిక వ్యవస్థను, దేశ భవిష్యత్తును రక్షించుకునేందుకు ప్రజలు, యువత రాహుల్ పోరాటంలో స్వచ్ఛందంగా భాగస్వాములవుతున్నారనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించాలని హెచ్చరించారు. అక్రమ అరెస్టులు, జైళ్లు, లాఠీచార్జ్జిలు కాంగ్రెస్, ఇండి కూటమి చేస్తున్న ఉద్యమాన్ని అణచివేయలేవని, తమ పోరాటాన్ని మరింత బలోపేతం చేస్తాయని సీఎం తెలిపారు.
అరెస్టులు అప్రజాస్వామికం : మంత్రి పొంగులేటి
ఓట్ల చోరీ, ఎన్నికల అక్రమాలపై ప్రశ్నిస్తున్న రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ, కేసీ వేణుగోపాల్‌ల అరెస్టులను రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్రంగా ఖండించారు. అరెస్టులు, లాఠీచార్జిలు, కేసులతో ఓట్ల చోరీపై కాంగ్రెస్ పోరాటాన్ని అణచలేరని స్పష్టం చేశారు. ప్రజల ఓటు హక్కు, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తన తప్పిదాలకు బాధ్యత వహించి రాజీనామా చేసే వరకు కాంగ్రెస్ పోరాటం ఆగదన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





