- పదేళ్లలో కశ్మీర్ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా..?
- దేశమంతా పాదయాత్ర చేసినా రాహుల్ కు తెలుసుకున్నది శూన్యం
- మూడుసార్లు ఓడినా కాంగ్రెస్ లో మార్పు రాలేదు..
- మండిపడ్డ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
దేశమంతా రాహుల్ గాంధీ పాదయాత్ర చేసినా ఆయన తెలుకుసున్నది ఏమీలేదని, ఇప్పటికైనా రాహుల్.. చరిత్ర తెలుసుకోవాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. జమ్మూకశ్మీర్ అభివృద్ధిపై రాజా హరిసింగ్ విగ్రహం వద్ద రాహుల్ గాంధీ బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. జమ్మూ జమ్మూకశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదంగా ఉంటున్నాయని, మహారాజా హరిసింగ్ విషయంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల్ని పూర్తిగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నాను. గత మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని దేశ ప్రజలు ఓడించినా.. మీలో మార్పురాలేదు. దేశవ్యాప్తంగా పాదయాత్ర చేసినా.. దేశ చరిత్ర మీద, వాస్తవ పరిస్థితులపై కనీస అవగాహన కూడా రాలేదని అన్నారు. జమ్మూ కాశ్మీర్ లో బీజేపీలో డోగ్రా స్వాభిమాన్ సంఘటన్ పార్టీ విలీనం సందర్భంగా విలేకరుల సమావేశంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. జమ్ము కాశ్మీర్ ప్రజల మనసు గెలిచి మహరాజా హరి సింగ్ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. అలాంటి వ్యక్తి విషయంలో రాహుల్ మాటలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయన్నారు.
మహారాజా హరి సింగ్ పారిపోయాడని మాట్లాడటం హాస్యాస్పదమని, జమ్మూ కాశ్మీర్లో దాదాపుగా ప్రతి ఇంట్లో మహారాజా హరిసింగ్ ఫోటో ఉంటుందని, అలాంటి మహనీయుడిని అవమానించడమంటే.. యావత్ డోగ్రా సమాజాన్ని జమ్మూకాశ్మీర్ ప్రజలను అవమానించడమే. లెఫ్టినెంట్ గవర్నర్ గురించి కూడా చాలా చులకనగా మాట్లాడారు. బయటినుంచి వచ్చిన వ్యక్తికి ఇక్కడ పెత్తనమేంటని అన్నారు. జమ్మూకశ్మీర్లో.. 1965లో గవర్నర్ వ్యవస్థ ప్రారంభమైన తర్వాత.. కరణ్ సింగ్ ను మినహాయిస్తే .. మిగిలిన వారందరూ వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వారే. దేశవ్యాప్తంగా కూడా ఇలాగే స్థానికేతరులే గవర్నర్లుగా ఉన్నారు.
ఉంటారు కూడా.. గవర్నర్ వ్యవస్థను, లెఫ్టినెంట్ గవర్నర్ వ్యవస్థను మోదీనో , బీజేపీనో తీసుకురాలేదు. దేశవ్యాప్తంగా గవర్నర్ వ్యవస్థ ఇలాగే కొనసాగుతోంది. దేశ చరిత్ర రాజకీయ పరిజ్ఞానం పెంచుకున్న తర్వాతే రాహుల్ బహిరంగ వేదికలమీద మాట్లాడాలని కిషన్ రెడ్డి సూచించారు. పార్లమెంట్లో వివిధ చట్టాలపై చర్చ సందర్భంగా.. దేశ సైనికుల గురించి మిడిమిడి జ్ఞానంతో మాట్లాడారని మండిపడ్డారు. ఇతర దేశాల్లో మన దేశ వ్యవస్థలను అగౌరవపరుస్తూ మాట్లాడారని, ఎన్నికల వ్యవస్థను, పార్లమెంటును, ప్రజాస్వామ్య వ్యవస్థను కించపరిచారని, కులాలు,మతాలు, భాషల పేరుతో సమాజాన్ని విడదీసేలా మాట్లాడారని అన్నారు. జమ్మూ కాశ్మీర్లో 60 ఏళ్లలో మీరేం చేశారో.. గత 10 ఏళ్లలో బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పేందుకు బహిరంగ చర్చకు రావాలని రాహుల్ గాంధీకి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు.
ఎన్నికల ప్రచారంలో ఏది పడితే అది మాట్లాడకుండా.. చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉండాలన్నారు. సంక్షేమం, అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన విషయంలో.. జమ్ము కాశ్మీర్లో శాంతి నెలకొల్పడంలో, ప్రతి పేదవాడికి ఇండ్ల నిర్మాణంతో పాటు ఇంటికి టాయిలెట్లు, గ్యాస్ సిలిండర్ ఇవ్వడంలో.. ఐదులక్షల ఆరోగ్య బీమా, యువతకు, మహిళలకు చేయుత నందించడం.. వంటి ఎన్నో పనులు.. జమ్మూకశ్మీర్లో మోదీ ప్రభుత్వం చేసిందని తెలిపారు.
2004-2014 మధ్యలో.. మీ పరిపాలనలో జమ్మూకశ్మీర్లో అశాంతి, అలజడి తప్ప మీరు సాధించిందేమీ లేదన్నారు. గతంలో ప్రతిపక్ష నేతలుగా పని చేసిన అటల్ బిహారి వాజ్‌పేయి, ఎల్‌కే అద్వానీ, సుష్మా స్వరాజ్, గులాంనబీ ఆజాద్ లాంటి వాళ్లు.. ప్రతిపక్ష నేతలుగా తమదైన ముద్రవేశారు. దేశ హితం లక్ష్యంగా పనిచేశారు. కానీ రాహుల్ గాంధీ ఇతర దేశాల్లో భారతదేశాన్ని అవమానించే రీతిలో మాట్లాడితే చరిత్ర క్షమించదని కిషన్ రెడ్డిఅన్నారు. డోగ్రా స్వాభిమాన్ సంఘటన్ పార్టీ నేతలు ప్రపంచంలోనే అత్యంత పెద్ద పార్టీలో బీజేపీలో సభ్యులయ్యారని, ఇది ఏ ఒక్క కుటుంబానికి సంబంధించింది కాదని, 140 కోట్ల దేశ ప్రజలందరికీ చెందిన పార్టీలో చేరడంతో దేశం గర్వపడుతుందని కిషన్ రెడ్డి తెలిపారు.





