ఈ ప్రభుత్వం సామాజిక న్యాయ ఛాంపియన్

– అన్ని వ‌ర్గాల‌కు స‌మానావ‌కాశాల‌ క‌ల్ప‌న‌తోనే సామాజిక న్యాయం
– పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి సీతక్క

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 13 : సమాజంలోని అన్ని వర్గాలకు సమానావకాశాలు, గౌరవం, ప్రాతినిధ్యం కల్పించినప్పుడే నిజమైన సామాజిక న్యాయం సాధ్యమవుతుందని రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు. సామాజిక న్యాయం అనేది కేవలం సిద్ధాంతం కాదని, తరతరాలుగా వివక్షకు గురైన వర్గాలకు సమాన హక్కులు, అవకాశాలు కల్పించే బాధ్యత అని స్పష్టం చేశారు. హెచ్ఐసీసీలోని భారత్ సమ్మిట్–2026లో భాగంగా శుక్ర‌వారం నిర్వహించిన సామాజిక న్యాయంపై అనే అంశంపై ప్యానల్ డిస్కషన్ జ‌రిగింది. మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ మహిళా అధ్యక్షురాలు అల్కాలాంబ, ప్రొఫెసర్లు కంచ ఐలయ్య, భూక్యా భంగ్య, సుజాత సూరేపల్లి త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి సీత‌క్క మాట్లాడుతూ ఒక మారుమూల ఆదివాసీ గ్రామం నుంచి వచ్చి నేడు మంత్రిగా ప్రజల ముందు నిలబడటం తన జీవిత ప్రయాణంలో ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు, విద్య, ప్రజాసేవల ఫలితమని తెలిపారు. తనలాంటి గ్రామాల్లో ఎంతోమంది అమ్మాయిలకు ఎన్నో కలలు ఉన్నాయని, వారు ప్రతిభ లేక వెనుకబడటం లేదని, అవకాశాలు అందక వెనుకబడుతున్నారని పేర్కొన్నారు. సామాజిక న్యాయం అంటే ప్రతి ఒక్కరికీ గౌరవం, ప్రాతినిధ్యం, సమాన అవకాశాలు కల్పించడమేనని, వ్యక్తి విలువను కులం ఆధారంగా నిర్ణయించకూడదని అన్నారు. సమాజంలో ఉన్న అసమానతలను తొలగించేందుకు కేవలం మంచి ఉద్దేశాలు సరిపోవని, విధానపరమైన, నిర్మాణాత్మక మార్పులు అవసరమని అన్నారు. ఒక సమాజం సాధించిన అభివృద్ధిని ఆ సమాజంలోని మహిళల పురోగతి ఆధారంగా అంచనా వేయాలని అంబేద్కర్ చెప్పిన మాటలను గుర్తు చేశారు. మహిళలను కేవలం ప్రభుత్వ పథకాల లబ్ధిదారులుగా కాక పారిశ్రామికవేత్తలు, ఉపాధి కల్పించేవారు, నిర్ణయాధికారులు, నాయకులుగా తీర్చిదిద్దాలన్నదే త‌మ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఇందిరా మహిళా శక్తి భవనాల ద్వారా గ్రామీణ మహిళలకు మార్కెట్ అవకాశాలు కల్పిస్తున్నామని, మహిళలు అవకాశాల కోసం గ్రామాలను వదిలి వెళ్లకుండా అవకాశాలే వారి వద్దకు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. కులగణన సమాజంలో విభజనలు సృష్టించదని, తరతరాలుగా కొనసాగుతున్న అసమానతలను వెలుగులోకి తెస్తుందని మంత్రి సీతక్క అన్నారు. కులగణన అనేది సమాజానికి ఎక్స్‌రే లాంటిదని, వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకుని సమానావకాశాలు కల్పించేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు. రాష్టంలో కులగణన నిర్వహించి కులాల వారీగా గణాంకాలను ప్రకటించడం ద్వారా సామాజిక న్యాయం దిశగా ముందడుగు వేశామని, ఎస్సీ వర్గీకరణ అంశాన్ని కూడా ప్రభుత్వం పరిష్కరించిందని తెలిపారు. లోక్‌స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు రాహుల్ గాంధీ ప్రతిపాదిస్తున్న ‘జిత్నీ ఆబాదీ ఉత్నా హక్’ నినాదం జనాభా ప్రాతిపదికన హక్కులు, ప్రాతినిధ్యం కల్పించాలనే భావనను ప్రతిబింబిస్తుందని అన్నారు. సంక్షేమ పథకాలు ప్రజలకు ఉపశమనం కలిగిస్తాయని, ప్రాతినిధ్యం వారి గొంతుకకు బలాన్నిస్తుందని, నిర్మాణాత్మక మార్పులే సమానత్వాన్ని సాధ్యం చేస్తాయని పేర్కొన్నారు. సామాజిక న్యాయం కోసం మరో తరం కూడా ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉండకూడదని, అది భవిష్యత్తులో అందించే హామీ కాదని, ప్రస్తుత తరానికి దక్కాల్సిన హక్కు అని స్పష్టం చేశారు. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ చెప్పినట్లు న్యాయం ఆలస్యమైతే అది న్యాయాన్ని నిరాకరించడమేనని గుర్తుచేశారు. దేశమంటే మట్టి కాదని, దేశమంటే మనుషులని గురజాడ అప్పారావు చెప్పిన మాటలను ప్రస్తావిస్తూ అభివృద్ధి చివరి గ్రామం, చివరి కుటుంబం, చివరి వ్యక్తికి చేరినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్య‌మ‌వుతుందన్నారు. ఆదివాసీ కుటుంబానికి రహదారి అంటే హాస్పిట‌ల్‌, పాఠశాల, మార్కెట్‌కు చేరుకునే అవకాశం అని, ఆదివాసీ బాలికకు విద్య అంటే మెరుగైన భవిష్యత్తుకు తొలి అడుగు అని వివరించారు. తెలంగాణ రైజింగ్ విజయాన్ని నగరాల్లో నిర్మించే ఎత్తైన భవనాలతో కాక అత్యంత వెనుకబడిన ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పుతో కొలవాలన్నారు. ఏ కులంలో పుట్టినా ఎదగడానికి అడ్డంకులు ఉండకూడదని, ఆడపిల్ల అనే కారణంతో ఆశలు ఆగిపోకూడదని అన్నారు. విద్య అనేది ప్రపంచాన్ని మార్చగలిగే అత్యంత శక్తివంతమైన ఆయుధమని నెల్సన్ మండేలా చెప్పిన మాటలను ప్రస్తావించారు. పరిస్థితులు ఎవరినీ అణగదొక్కని తెలంగాణను నిర్మించడమే లక్ష్యమని, గొంతు కోల్పోయిన వారికి స్వరం, గౌరవం నిరాకర‌ణ‌కు గురైన‌ వారికి ఆత్మగౌరవం కల్పించాలని అన్నారు. రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందిందన్నదే కాక ఎంతమంది జీవితాలను మార్చగలిగామన్నదే తెలంగాణ రైజింగ్ విజయానికి అసలైన కొలమానమని మంత్రి సీతక్క చెప్పారు. అభివృద్ధి రాష్ట్రాన్ని సంపన్నం చేస్తే, సామాజిక న్యాయం సమాజాన్ని గొప్పదిగా తీర్చిదిద్దుతుందని అన్నారు.

భారత్ సమ్మిట్ వేదికగా ప్రజాస్వామ్యం, శాంతిపై విస్తృత చర్చలు

ప్రపంచంలో ఏ మూలన సంక్షోభం తలెత్తినా దాని ప్రభావం సామాన్యుడి జీవితంపై పడుతుందని, అంతర్జాతీయ పరిణామాలకు ప్రజల జీవన విధానానికి ప్రత్యక్ష సంబంధం ఉందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. హెచ్ఐసీసీలో భార‌త్ స‌మ్మిట్ శుక్ర‌వారం ప్రారంభ‌మైన సంద‌ర్భంగా  ఆమె మీడియాతో మాట్లాడారు.మారుతున్న ప్రపంచ రాజకీయాలు, ఆర్థిక అసమానతలు, వాతావరణ మార్పులు, ప్రపంచ శాంతి వంటి కీలక అంశాలపై చర్చించేందుకు ‘భారత్ సమ్మిట్’ అద్భుతమైన వేదికగా నిలిచిందని ఆమె పేర్కొన్నారు. అలీనోద్యమ స్ఫూర్తితో దేశాలు తమ సార్వభౌమత్వాన్ని, స్వతంత్ర విదేశాంగ విధానాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ‘తెలంగాణ రైజింగ్’ సెషన్ల ద్వారా రాష్ట్ర అభివృద్ధి నమూనా, ఫ్యూచర్ సిటీ, పెట్టుబడులు, సంక్షేమం, మహిళా సాధికారత, సమ్మిళిత అభివృద్ధి విధానాలను ప్రపంచ ప్రతినిధులకు పరిచయం చేయనున్నట్లు తెలిపారు. మట్టి మనుషుల గొంతుకగా, రైతుల హక్కుల పరిరక్షణ కోసం ఈ సమ్మిట్ పనిచేస్తుందని, ప్రజల గొంతులను వినిపించడాన్ని తప్పుబట్టడం తగదని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *