రబీ సాగు కార్యాచరణపై ప్రత్యేక దృష్టి

– ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, నవంబర్ 13: రాష్ట్రంలో రబీ పంటల సాగు కార్యాచరణ ప్రణాళికను పకడ్బందీగా రూపొందించి ప్రతి జిల్లాలో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా అనువైన పంటల సాగును ప్రోత్సహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. సచివాలయం నుంచి సీనియర్ అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్లతో శుక్ర‌వారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌ లో వ్యవసాయం, ఉద్యానవన శాఖ, సూక్ష్మ సేద్యం, బిందు సేద్యం, కూరగాయలు, పప్పుధాన్యాల సాగు, ధాన్యం కొనుగోళ్లు, భూసేకరణ సమస్యలు, పాఠశాల విద్యా కార్యక్రమాలపై సమగ్రంగా సమీక్షించారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లకు ఇచ్చిన ఆదేశాలు, ప్రభుత్వ ప్రాధాన్యతలను ప్రధాన కార్యదర్శి వివరించారు. ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లను తమతమ జిల్లాలకు టీమ్ లీడర్లుగా అభివర్ణించారని, ప్రభుత్వ ప్రాధాన్యతలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేసే బాధ్యత కలెక్టర్లపై ఉందని తెలిపారు.

వ్యవసాయం – రబీ కార్యాచరణ ప్రణాళిక

రాబోయే రబీ సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని ప్రతి జిల్లాలో పంటల సాగుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ఎల్‌నినో ప్రభావం, వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని నీటి లభ్యతకు అనుగుణంగా పంటల ఎంపిక చేపట్టాలని తెలిపారు. రబీ పంటలకు అవసరమైన విత్తనాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలని, రైతులకు సకాలంలో అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
కూరగాయలు, పప్పుధాన్యాల సాగును ప్రోత్సహించాలని, కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలను గరిష్టంగా వినియోగించుకొని సాగు విస్తీర్ణం, ఉత్పాదకత పెంపునకు చర్యలు తీసుకోవాలని సూచించారు. సూక్ష్మ సేద్యం, ముఖ్యంగా బిందు సేద్యం విధానాన్ని విస్తృతంగా ప్రోత్సహించాలని తెలిపారు. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా జరిగేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. భూసేకరణకు సంబంధించిన సమస్యలను గుర్తించి పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

విద్యా కార్యక్రమాలపై సమీక్ష

జిల్లా కలెక్టర్లు తరచుగా ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి విద్యా కార్యక్రమాల అమలు, విద్యార్థులకు అందుతున్న సదుపాయాలు, బోధనా ప్రమాణాలను పరిశీలించాలని ప్రధాన కార్యదర్శి సూచించారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణ పనులను వేగవంతం చేసి గడువులోగా పూర్తి చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. తెలంగాణ పబ్లిక్ స్కూళ్లలో అవసరమైన పారిశుధ్య‌ పనులు చేపట్టి, పాఠశాలల్లో పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలని తెలిపారు. వీబీ-జీ రామ్ జీ కార్యక్రమం విస్తరణకు సంబంధించి అవసరమైన చర్యలు తీసుకోవాలని, సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కాన్ఫ‌రెన్స్‌లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, రెవెన్యూ (విపత్తు నిర్వహణ) శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రాణా, ప్రణాళికా శాఖ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్, పశు సంవర్ధక శాఖ కార్యదర్శి ఇలంబర్తీ, వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్, పంచాయత్ రాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్ దివ్య, సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ ముకుంద రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి.కర్ణన్, వ్యవసాయ శాఖ సంచాలకుడు గోపి, ఉద్యానవన శాఖ సంచాలకుడు షేక్ యాస్మిన్ బాషా తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *