– వచ్చేది మా ప్రభుత్వమే
– వేలంలో భూములు ఎవరు కొన్నా వెనక్కి ఇచ్చే ప్రసక్తే లేదు
– హిల్ట్ పాలసీ పేరుతో పారిశ్రామిక భూములూ అమ్ముతున్నారు
– ఎల్‌నినో కంటే కాంగ్రెస్ పాలనే ప్రమాదకరం
– మాజీమంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 13: 2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కూకట్పల్లి ట్రక్ పార్క్ భూములను అమ్మకానికి పెడితే.. నాడు ఎమ్మెల్యేగా ఉన్న మాధవరం కృష్ణారావు, సీపీఐ నారాయణ, సీపీఎం రాఘవులు, ఎంపీ వినోద్ కుమార్, నేను, ఉద్యమకారులందరం కలిసి ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున పోరాటం చేశాం. కానీ ఇవాళ 13 ఏళ్ల తర్వాత మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఈ భూమిని మొత్తానికి మొత్తం అమ్మకానికి పెట్టడం అత్యంత దురదృష్టకరమని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు అన్నారు. కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలోని మూసాపేటలో ప్రజా అవసరాల కోసం కేటాయించిన ‘ట్రక్ పార్క్’ భూములను ప్రభుత్వం వేలం వేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం ఉదయం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందంతో కలిసి ఆ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, ట్రక్ డ్రైవర్లు, కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రజావసరాల కోసం కేటాయించిన భూములను ప్రభుత్వం అమ్మకానికి పెట్టడంపై స్థానికులు హరీశ్ రావు ఎదుట తీవ్ర ఆవేదన వ్యక్తం చేయగా ట్రక్ పార్క్ భూముల వేలాన్ని అడ్డుకుంటామని, స్థానిక ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని హరీశ్ రావు భరోసా ఇచ్చారు. అనంతరం అక్కడ నిర్వహించిన ధర్నాలో పాల్గొని మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 27న వేలం వేసేందుకు నిన్న హెచ్ఎండిఏ నోటిఫికేషన్ ఇచ్చింది. మూసాపేటలోని సర్వే నంబర్లు 121/P నుంచి 141 వరకు, 146, 147, 155, 156, 157 లలో ఉన్న భూములను అమ్మకానికి పెట్టారు.ఎంత దుర్మార్గమంటే.. సర్వే నంబర్ 155లో ఉన్న ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌ను, 156లో ఉన్న ట్రక్ పార్కింగ్‌ను, హెచ్ఎండిఏ నర్సరీని, ఆర్టీఓ ఆఫీస్‌ను, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు ఇచ్చిన జాగాను కూడా అమ్మేస్తారట.. అంటే రేవంత్ రెడ్డి ఇంకేమీ మిగిల్చే పరిస్థితి కనిపించడం లేదు. 2013లో బీఆర్ఎస్, సీపీఐ, సీపీఎంల ఉమ్మడి పోరాటంతో కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తగ్గి ఈ భూమిని కాపాడుకోగలిగాం. ఆ తర్వాత కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న పదేళ్లలో ఈ ట్రక్ పార్క్ భూమిలో ఒక్క గజం కూడా అమ్మలేదు కదా, కనీసం అమ్మే ప్రయత్నం కూడా చేయలేదు. పైగా ప్రజా అవసరాల కోసం ఆలోచించి.. చెట్లు పెంచడానికి హెచ్ఎండిఏ నర్సరీకి, ఏసీపీ పోలీస్ స్టేషన్‌కు, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు, ఆర్టీఓ ఆఫీస్‌కు కొంత భూమిని ఇచ్చాం. ప్రజలకు అందుబాటులో ఉండేలా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కట్టించాం, ట్రక్ పార్కింగ్‌ను కొనసాగించామని గుర్తుచేశారు. కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, శేరిలింగంపల్లి.. ఈ మూడు నియోజకవర్గాల మధ్య ఉన్న ఒకే ఒక్క ఖాళీ స్థలం ఇది. ఈ ప్రాంతంలో ప్రస్తుతం 10 లక్షల మంది ప్రజలు నివసిస్తుంటే, రాబోయే నాలుగైదేళ్లలో మరో 10 లక్షల జనాభా పెరగబోతోంది.పక్కనే ఉన్న ఇండియన్ కంటైనర్ డిపో నుంచి రోజుకు 500 కంటైనర్లు లోడ్ అయి ఎక్స్పోర్ట్ అవుతుంటాయి. సిటీలోకి లారీలకు కేవలం 4 గంటలే ఎంట్రీ ఉంటుంది కాబట్టి పార్క్ చేసుకుని డ్రైవర్లు విశ్రాంతి తీసుకుంటారు. మరి ఈ స్థలాన్ని అమ్మేస్తే ఆ వందలాది లారీలు, కంటైనర్లు ఎక్కడ పెట్టుకోవాలని ప్రశ్నించారు.
సూర్యుడి చుట్టూ భూమి తిరిగినట్టు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతసేపూ భూముల చుట్టే తిరుగుతున్నాడు. ఏడ భూమి కనబడితే ఆడ అమ్ముడే పనిగా పెట్టుకున్నాడు.చివరకు కాప్రాలో 484 గజాలు, అమీన్పూర్లో 302 గజాల స్థలాన్ని కూడా వేలానికి పెట్టారంటే ఎంత సిగ్గుచేటు! కాప్రాలో బస్తీ దవాఖానా కిరాయి బిల్డింగ్‌లో నడుస్తోంది, ఆ 484 గజాల్లో బస్తీ దవాఖానా కట్టొచ్చు కదా? 50 గజాలు, 100 గజాలు, 300 గజాలు కూడా వదలకుండా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుని రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నా డు.భూముల వేలంపై రేవంత్ రెడ్డి మాటలు చూస్తే ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుంది..అయ్యో.. నాకంటే స్పీడ్‌గా ఈయన రంగులు మారుస్తున్నాడే అని ఊసరవెల్లి కూడా ఉరేసుకుంటుందేమోనని ఎద్దేవా చేశారు. నాడు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇదే రేవంత్ రెడ్డి.. ప్రభుత్వ భూములు అంటే పెద్దలు ఇచ్చిన ఆస్తి, జాతి సంపద.. ఆ భూములు అమ్మితే బొందలు పెట్టడానికి శ్మశానవాటికకు, దవాఖానాలకు, కాలేజీలకు, స్కూళ్లకు కూడా జాగా ఉండదు అని మాట్లాడాడు. మరి ఇవాళ ఏం చేస్తున్నాడు? ఇదే కూకట్పల్లి నియోజకవర్గం కైతలాపూర్‌లో నిన్న శ్మశానవాటిక కూడా లెవెల్ చేసేశారు, దాన్ని కూడా మ్మేస్తారేమో..ఎన్నికల ముందు మేము అధికారంలోకి వస్తే ఇంచు భూమి కూడా అమ్మబోమని వాగ్దానం చేసి.. ఇవాళ ఇంచు భూమి కూడా మిగల్చకుండా అమ్ముతున్నాడు. హౌసింగ్ బోర్డు భూములు, రాజీవ్ స్వగృహ భూములు, టీజీఐఐసీ భూములు, హెచ్ఎండిఏ భూములు, కుడా భూములు, దళిత గిరిజనుల అసైన్డ్ భూములు, సెంట్రల్ యూనివర్సిటీ భూములు, ఉర్దూ యూనివర్సిటీ భూములు, ఇండస్ట్రియల్ భూములు, హెరిటేజ్ భూములు, ఎన్విరాన్మెంటల్ భూములు.. చివరకు ఎవాక్యూ ప్రాపర్టీలను కూడా రాత్రికి రాత్రే ప్రైవేట్ ఆస్తులుగా మార్చి అమ్మేస్తున్నారు. 1982 జూలై 5న ఆనాటి హుడా తరఫున ఆర్డీఓ ఈ కూకట్పల్లి, మూసాపేట భూములను ఎస్సీ, ఎస్టీ, పేద రైతుల నుంచి ఎకరాకు లక్ష, లక్షా ఇరవై వేలు ఇచ్చి సేకరించారు. ఆనాటి భూసేకరణ చట్టం ఆర్డర్‌లోనే.. ఈ భూమిలో ఎలాంటి ఇండ్లు కట్టడానికి గానీ, వ్యాపారం చేయడానికి గానీ వీల్లేదు.. కేవలం ప్రజా ప్రయోజనాలకు మాత్రమే వాడాలి అని స్పష్టంగా రాశారు. అంతేకాదు, ఈ భూమిని ట్రక్ పార్కింగ్, ప్రజా ప్రయోజనాల కోసమే వాడుతామని ఇదే అధికారులు హైకోర్టు, సుప్రీంకోర్టులో అఫిడవిట్లు దాఖలు చేశారు. మరి ఇవాళ ఎకరం రూ. 100 కోట్లకు అమ్ముతామంటున్నారే.. కొన్నవాడు ఇక్కడ ఇండ్లు కట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారమే కదా చేసేది? మీ హెచ్ఎండిఏ చట్టానికే విరుద్ధంగా ఎలా అమ్ముతారు? ఒకవేళ ఈ భూమిని ప్రజా అవసరాలకు వాడకపోతే.. ఆనాడు భూములిచ్చిన పేద ఎస్సీ, ఎస్టీ రైతులకైనా తిరిగి ఇచ్చేయండి. లేదంటే ఈ 10 లక్షల జనాభా కోసం ఒక దవాఖానా, పార్కు కట్టండి.ఇక్కడ జాగా లేక జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీలు షిఫ్ట్ సిస్టమ్‌లో నడుస్తున్నాయి. పిల్లల చదువుల కోసం కాలేజీలకైనా కేటాయించండి. అంతేగానీ అమ్ముకోవడానికి వీల్లేదు.హెచ్ఎండీఏ అధికారులను కూడా హెచ్చరిస్తున్నా.. మీరు హైకోర్టు, సుప్రీంకోర్టులో వేసిన అఫిడవిట్లకు విరుద్ధంగా ఈ భూములు అమ్మితే చట్టరీత్యా చెల్లదు.. మీరందరూ శిక్షార్హులవుతారు.వేలంలో పాల్గొనేవారికి కూడా స్పష్టంగా చెప్తున్నా.. రేపు వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే.. మీరు వేలంలో పాల్గొని భూమి కొన్నా మీకు అనుమతులు రావు. ఈ భూమిని వెనక్కి తీసుకుని ప్రజా ప్రయోజనాలకే వాడుతుంది. మీరు నష్టపోతారు కాబట్టి ఎవరూ వేలంలో పాల్గొనవద్దు. నాటి స్ఫూర్తితోనే నేడు కూడా బీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం కలిసి ఎంతవరకైనా పోరాడి, అవసరమైతే న్యాయస్థానాల్లో కొట్లాడి ఈ భూముల అమ్మకాన్ని అడ్డుకుంటాయి. రాష్ట్రంలో ఏకంగా రూ. లక్ష కోట్ల భూములను అమ్మకానికి పెట్టాడు. ఇప్పటికే రూ. 26 వేల కోట్ల భూములు అమ్మేశాడు.విద్యార్థులు పోరాడుతున్నా వినకుండా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాలు, హెచ్ఎండిఏకు చెందిన 800 ఎకరాలను రాత్రికి రాత్రే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో కుదువబెట్టి రూ. 20 వేల కోట్ల అప్పు తెచ్చాడు.ఆ అప్పు ఇప్పించినందుకు ముంబైకి చెందిన ఒక బ్రోకర్‌కు ప్రభుత్వ ఖజానా నుంచి అధికారికంగా రూ. 500 కోట్ల లంచం ఇచ్చాడు రేవంత్ రెడ్డి! రేపు ఆ అప్పు కట్టకపోతే యూనివర్సిటీ భూములు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ పరమవుతాయి.
మరోవైపు బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాటు కబ్జా కాకుండా కాపాడి, హైకోర్టు, సుప్రీంకోర్టులో కొట్లాడి గెలిపించిన మియాపూర్‌లోని 400 ఎకరాల భూమిని.. ఇంకా జడ్జిమెంట్ కాపీ కూడా చేతికి రాకముందే అమ్మేస్తానంటున్నాడు. మియాపూర్‌లో 400 ఎకరాలు, కూకట్పల్లి ప్రాంతంలో ఉన్న 150 ఎకరాల హౌసింగ్ బోర్డు భూములు అమ్మి ఇంకో రూ. 50 వేల కోట్లు తేవాలని చూస్తున్నాడు. ఎవడి జాగీరు అని ఈ భూములు అమ్ముతున్నావ్ రేవంత్ రెడ్డీ? నీకు ఎవరిచ్చారు ఈ అధికారం? హిల్ట్ పాలసీ పేరుతో బాలానగర్, అజామాబాద్, జీడిమెట్ల ప్రాంతాల్లో ఉన్న 9,900 ఎకరాల ఇండస్ట్రియల్ భూములను కమిషన్ల కోసం అడ్డికి పావుసేరుకు రెగ్యులరైజ్ చేస్తూ పెద్ద కుంభకోణానికి పాల్పడుతున్నారు. ప్రత్యామ్నాయ పరిశ్రమలు పెట్టకుండా వాటిని రియల్ ఎస్టేట్‌గా మారిస్తే అక్కడ పనిచేసే వేలాది మంది కార్మికుల ఉద్యోగ భద్రత ఏం కావాలి?
మరోవైపు 22-ఎ నిషేధిత జాబితా తీసేశామని రోజుకో డైలాగ్ కొడుతున్నారు గానీ, నేటికీ యూఎల్సీ భూముల్లో, కాలనీలు, అపార్ట్మెంట్లలో రిజిస్ట్రేషన్లు కావడం లేదు. అధికారులు లంచాలు, కమిషన్ల కోసం ప్రజలను ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటూ వేధిస్తున్నారు. ప్రజల జీవితాలను విధ్వంసం చేయడానికి ఒక పెద్ద తుఫాను, సునామీ, భూకంపమో రావాల్సిన అవసరం లేదు, యుద్ధాలు జరగాల్సిన అవసరం లేదు.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చాలు అనడానికి రేవంత్ రెడ్డి పాలనే నిదర్శనం…ఎల్‌నినో కరువు ప్రభావం ఒక్క ఏడాదే ఉంటుంది, కానీ రేవంత్ రెడ్డి ఐదేళ్ల పాలన రాష్ట్రాన్ని 10 ఏళ్లు వెనక్కి నెట్టేస్తోంది. హైడ్రా, 22-ఎ పేరుతో పేదల బతుకులను కూల్చేస్తున్న ఈ ప్రభుత్వమే ప్రజల పాలిట ఒక వైపరీత్యంగా మారింది. రాష్ట్రంలో కరువు వచ్చి 25 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. పక్కన మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు రైతులను ఆదుకున్నాయి గానీ, రేవంత్ రెడ్డి మాత్రం ఒక్క రూపాయి సాయం చేయలేదు. ఒకవైపు కరువు, కరెంట్ కోతలు ఉంటే.. అందాల పోటీలు, ఫుట్‌బాల్ షోకులు, గ్లోబల్ సమ్మిట్ల పేరుతో వందల కోట్లు తగలేస్తూ గోబెల్స్ ప్రచారాలు చేసుకుంటున్నాడు. ఎంపీగా కూకట్‌పల్లికి ఏమీ చేయలేకపోయాను, ముఖ్యమంత్రిగా కూకట్‌పల్లిని ఉద్ధరిస్తానని రేవంత్ రెడ్డి గతంలో డైలాగ్ కొట్టాడు. హౌసింగ్ బోర్డు భూములు, ట్రక్ పార్కింగ్ భూములు, పార్కులు, క్యాంప్ ఆఫీసులు, పెట్రోల్ పంపులు, బొందల గడ్డలు.. ఇలా గజం జాగా లేకుండా అమ్ముకోవడమే కూకట్‌పల్లిని ఉద్ధరించడమా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డీ.. నాడు ఉద్యమంలో పాల్గొనక తెలంగాణ ద్రోహిగా ముద్రపడ్డావు, నేడు ప్రజల భూములు అమ్మితే రాష్ట్ర ద్రోహిగా మిగిలిపోతావు. తక్షణమే కూకట్పల్లి ట్రక్ పార్క్ భూముల వేలాన్ని రద్దు చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ప్రత్యక్ష పోరాటానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానంద గౌడ్, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, నవీన్ రావు, సీపీఐ, సీపీఎం నాయకులు, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.





