– చెరువులు, కుంటల శిఖం భూముల్లో గ్రాసం సాగు
– 45 రోజుల్లో అందుబాటులోకి వచ్చేలా యుద్ధప్రాతిపదికన చర్యలు
– నిర్వహణ బాధ్యత స్వయం సహాయక సంఘాలకు
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 13 : ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తగ్గి పశుగ్రాసం కొరత ఏర్పడే పరిస్థితులు తలెత్తకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. పశువులకు అవసరమైన గ్రాసాన్ని అందుబాటులో ఉంచడంతోపాటు మూగజీవాలకు నీటి ఇబ్బందులు కలగకుండా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సమన్వయంతో ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ఇందులో భాగంగా నీటి లభ్యత ఉన్న చెరువులు, కుంటల శిఖం భూముల్లో పశుగ్రాసం సాగు చేయాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమాన్ని యుద్ధప్రాతిపదికన చేపట్టి 45 రోజుల్లో పశుగ్రాసం అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దాన కిషోర్ అధ్యక్షతన సచివాలయంలో మంగళవారం నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు. శిఖం భూములను గుర్తించి ఒక్కో ప్రాంతంలో ఐదు నుంచి పది ఎకరాల విస్తీర్ణంలో పశుగ్రాసం సాగు చేయాలని నిర్ణయించారు. ఇందుకు అనువైన స్థలాలను గుర్తించే బాధ్యతను నీటిపారుదల, కమాండ్ ఏరియా అభివృద్ధి శాఖకు అప్పగించారు. గుర్తించిన భూముల్లో సాగుకు అవసరమైన ఏర్పాట్లు వెంటనే చేపట్టి నిర్ణీత గడువులోగా పశుగ్రాసాన్ని అందుబాటులోకి తేవాలని దాన కిషోర్ ఆదేశించారు. పశుగ్రాసం సాగుకు అవసరమైన నిధులను ఉపాధి హామీ పథకం నిధుల నుంచి సమకూర్చనున్నారు. సాగుకు అనువైన, అధిక దిగుబడినిచ్చే సీఎస్హెచ్ 24-ఎంఎఫ్ రకం పశుగ్రాసాన్ని సాగు చేయాలని నిర్ణయించారు. విత్తనాలను పశుసంవర్ధక శాఖ ఉచితంగా అందించనుంది. దీంతో సాగు ప్రారంభానికి అవసరమైన విత్తనాల ఖర్చు రైతులు, సంబంధిత సంఘాలపై పడకుండా చర్యలు తీసుకోనున్నారు.
నిర్వహణ బాధ్యత స్వయం సహాయక సంఘాలకు
పశుగ్రాసం సాగు, పంట సంరక్షణ, నీటి నిర్వహణ వంటి పనులను పర్యవేక్షించే బాధ్యతను స్వయం సహాయక సంఘాలకు అప్పగించాలని నిర్ణయిం చారు. వివిధ శాఖల మధ్య సమన్వయంతో కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. భూముల గుర్తింపు, సాగు ఏర్పాట్లు, విత్తనాల సరఫరా, పంట నిర్వహణ వంటి అంశాల్లో జాప్యం జరగకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఎల్నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకున్నా పశువులకు అవసరమైన మేత కొరత ఏర్పడకుండా ముందుగానే పశుగ్రాసాన్ని సిద్ధం చేసుకోవడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. నీటి లభ్యత ఉన్న భూములను వినియోగించుకోవడం ద్వారా అందుబాటులో ఉన్న వనరులతోనే పశుగ్రాస ఉత్పత్తిని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
మూగజీవాలకు తాగునీటి సదుపాయం
పశువులకు తాగునీటి సమస్య తలెత్తకుండా అవసరమైన ప్రాంతాల్లో నీటి తొట్టెలు ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన పనులను వెంటనే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. పశువులకు నిరంతరం తాగునీరు అందేలా స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. పశుగ్రాసం సాగు, నీటి తొట్టెల నిర్మాణం వంటి పనులను సమాంతరంగా చేపట్టనున్నారు. శాఖల మధ్య సమన్వయంతో పనులు వేగవంతం చేసి, క్షేత్రస్థాయిలో అమలు తీరును పర్యవేక్షించాలని అధికారులు నిర్ణయించారు. పశువుల పోషణకు అవసరమైన పచ్చిమేత, తాగునీరు అందుబాటులో ఉండటం పాడి పరిశ్రమతోపాటు గ్రామీణ కుటుంబాల జీవనోపాధికి కూడా కీలకం. సమావేశంలో పశుసంవర్ధక శాఖ కార్యదర్శి ఇలంబర్తి, పంచాయతీరాజ్ కమీషనర్ దివ్య దేవ రాజన్, నీటిపారుదల, కమాండ్ ఏరియా అభివృద్ధి శాఖ (ఐ అండ్ సీఏడీ) ఈఎన్సీ రమేష్ బాబు, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఈఎన్సీ మధుసూదన్, వీబీజీ రాంజీ అధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





