తెలుగు నూతన సంవత్సర ఆరంభం రోజు కూడా రాజకీయ పార్టీలు తమ వైషమ్యాలను వీడలేదు. తెలుగువారు అత్యంత శ్రద్ధతో ఆచరించే ఈ పండుగ రోజున రాష్ట్రంలోని ప్రజలంతా సుఖశాంతులతో జీవించేలా తమ ఇష్టదేవతలను వేడుకొంటూ ఎంతో సంబరంగా జరుపుకోవడం ఒక ఆనవాయితీ. ముఖ్యంగా మనది వ్యవసాయ ఆధారిత దేశం. దేశంలోని డెబ్బై శాతం జనం వ్యవసాయ ఆధారంగానే జీవిస్తున్నారు. వీరిలో ఎక్కువమంది నేటికీ వర్షాధారంగానే పంటలు పండిస్తున్న వారున్నారు. కొత్త సంవత్సరంలో వర్షాల పరిస్థితి, ఏ పంటలు లాభసాటిగా ఉంటాయి, ప్రకృతిలో వొచ్చే మార్పులు, ఆరోగ్యం తదితర విషయాలను తీసుకుని పాలకులు తీసుకోవాల్సిన చర్యలకు, వారి ఆలోచనలకు దిక్సూచిగా పంచాంగ శ్రవణం జరగడం ఆనవాయితీ.
అయితే గత కొంతకాలంగా సిద్దాంతులు కూడా పంచాంగ శ్రవణంలో రాజకీయాలను జొప్పిస్తున్నారు. తాజాగా ఆదివారం ఉగాది రోజు ప్రధానంగా మూడు రాజకీయ పార్టీ కార్యాలయాల్లో జరిగిన పంచాంగ శ్రవణాన్ని వీక్షిస్తే కొంత విచిత్రం, మరికొంత ఆశ్చర్యం కలుగక పోదు. ఆయా రాజకీయ పార్టీల అధినేతలకు అనుకూలమైన శ్రవణానందాన్ని కలిగించే విధంగా పంచాంగ శ్రవణం జరిగిందన్న వాదనలు వినవొస్తున్నాయి. తెలంగాణ భవన్‌లో జరిగిన పంచాంగ శ్రవణంలో బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి పదవిని చేపట్టే అవకాశాలున్నాయని చెప్పారు. తెలంగాణ ప్రజలు కెసిఆర్ పాలననే కోరుకుంటున్నారన్నది ఆ పంచాంగ శ్రవణంలో పేర్కొన్నారు. అయితే ఆయన ఆరోగ్యపరిస్థితి గురించి కూడా ఇటీవల వొస్తున్న వార్తలకు సమాధానమన్నట్లుగా ఆయన ఆరోగ్యానికి సంబంధించిన గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నట్లు కూడా సిద్దాంతి గారు చెప్పుకొచ్చారు.
కాంగ్రెస్ విషయానికొస్తే పాలకులకు పరిపాలన భారమే అయినప్పటికీ సమర్ధవంతమైన పాలనను ముఖ్యమంత్రి అందజేసే అవకాశముందన్నారు సిద్దాంతి. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. రాష్ట్ర సంపదను బయటికి పోకుండా కాపాడడమే కాకుండా విదేశీ పెట్టుబడులను తీసుకురావడంలో తమ ప్రతిభను కనబరుస్తారని చెప్పారు. కేంద్రం నుంచి రావాల్సిన వాటిని (నిధులు, పథకాలు కాబోలు) తెచ్చుకోవడంలో తన సామర్థ్యాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చూపిస్తారంటూ శాస్త్రోక్తంగా పంచాంగం చెబుతున్న మాటను సిద్దాంతి పేర్కొన్నారు. మొత్తానికి ఈ సంవత్సరం గ్రహస్థితి రాష్ట్రానికి మంచిరోజులు రావడానికి అనుకూలంగా ఉన్నాయన్నమాట.
కరీంనగర్‌లోని తన ఇంటిలో పంచాంగ శ్రవణాన్ని ఆలకించిన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ చేసిన కామెంట్ మరింత ఆసక్తిని కలిగించేదిగా ఉంది.
ఈ ఏడాది కూడా ప్రజాప్రతినిధులు, అధికారులు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతారని జ్యోతీష పండితులు చెబుతున్నది నిజమేననిపిస్తున్నదంటూ ఆయన ఘాటైన వ్యాఖ్యానం చేశారు. రాష్ట్రంలో గత పదేళ్ళుగా పట్టిన పింక్ వైరస్‌నైతే పారదోలగలిగాం, ఇప్పుడు కాంగ్రెస్ కరప్షన్ వైరస్ పట్టుకుందని, దాని బారినుండి ప్రజలను కాపాడుకోవాల్సి ఉందంటూ, కాంగ్రెస్ అవినీతిపై పోరాటం చేయడమే దానికి సరైన వ్యాక్సిన్ అంటారాయన. కెసిఆర్ అవినీతి అక్రమాలపై ఘాటుగా స్పందించిన కాంగ్రెస్ కెసిఆర్ కుటుంబాన్ని జైలు పాలు చేస్తానని రేవంత్‌రెడ్డి మాటతప్పాడని, ఫోన్ ట్యాపింగ్ కేసు నీరుగార్చడం లాంటివాటివి ఆ కోవలోకి వొస్తాయని ఆయన ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉగాది నాడు కూడా తన ప్రధాన ప్రతిపక్షమైన బిఆర్ఎస్‌ను ధూషించకుండా ఉండలేకపోయారు. ఉగాది రోజున పేద ప్రజలకు ఉచితంగా సన్న బియ్యం పంపిణీని ప్రవేశపెడుతామని ప్రకటించిన విషయం తెలిసిందే. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్‌లో ఈ పంపిణీని ప్రారంభిస్తూ, అంతకు ముందు రవీంద్ర భారతిలో పంచాంగ శ్రవణానంతరం ఆయన గత బిఆర్ఎస్ ప్రభుత్వంపైన విరుచుకు పడ్డారు. పండుగలకో, మరో ముఖ్యమైన రోజున్నో పేద ప్రజలు తెల్ల అన్నం తినేవారని, వారి బాధను అర్థం చేసుకుని గత నాయకులు ప్రవేశపెట్టిన విధానంలో తాము మార్పుచేసి, సన్నబియ్యాన్ని వారికి అందిస్తున్న విషయాన్ని చెప్పుకొచ్చారు. అయితే తమకన్నా ముందు పదేళ్ళు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వ నాయకత్వం తామే మేధావులమని కితాబు ఇచ్చుకున్నవారు కనీసంగా పేదలకు సన్నబియ్యం ఇవ్వాలన్న ఆలోచన చేయక పోవడాన్ని ఎత్తిచూపారు. పైగా వరి వేస్తే ఉరే అని రైతులను భయపెట్టారు.
కాని, తమ ప్రభుత్వం సన్నబియ్యం ఉత్పత్తిని ప్రోత్సహించే క్రమంలో అయిదువందల రూపాయల బోనస్‌ను కూడా అందజేస్తున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. 2018లో తనపై కక్షకట్టి కెసిఆర్ ఓడించిన విషయాన్ని గుర్తుచేస్తూ, మరో మూడు నెలల్లోనే ఎంపీగా, పిసీసీ అధ్యక్షుడిగా ఇప్పుడు సింఎంగా అవడమంటే అది తన సంకల్ప బలంగా పేర్కొన్న రేవంత్‌రెడ్డి, తన లక్ష్యాలేవీ ఇప్పటివరకు విఫలంకాలేదంటూ ‘తెలంగాణ రైజింగ్ 2050’ అన్న సంకల్పాన్ని కూడా నిలబెట్టుకుంటానన్న ధీమా వ్యక్తంచేశారు. ఆనాటి వరకు రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకురావడమే కాదు, దేశానికే ఆదర్శంగా నిలువాలన్నదే తన సంకల్పంగా ఆమన పేర్కొన్నారు. మొత్తానికి ఈ ఉగాది తీపి, పులుపు, కారం తో పాటు ఉప్పు, చేదు, వగరు కలిపి రాజకీయ విమర్శలతో కొనసాగింది.