ఆగమవుతున్న అన్నదాత.. ఆదుకోలేకపోతున్న ప్రభుత్వం

యాసంగి పంటను అమ్ముకోవడంలో అన్నదాతలు ఆగమాగమవుతున్నారు. వర్షాకాలం పంటకు సిద్దం కావాల్సిఉండగా ఇంకా కొనుగోలు కేంద్రాలవద్దనే వారి కాలం గడిచిపోతున్నది. వరికోతలు పూర్తిఅయి నెలలు కావస్తున్నా ఎక్కడ వేసిన కుప్పులు అక్కడే ఉంటున్నాయి. తమ ధాన్యం ఎప్పుడు కొనుగోలు అవుతుందో తెలియని పరిస్థితిలో వారు కొట్టుమిట్టాడుతున్నారు. ఇది ఏ ఒక్క ప్రాంతానికో జిల్లాకు పరిమితమైన సమస్యకాదు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని గ్రామాల్లో రైతులు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కుంటున్నారు. ఏదో ఒక సమస్య అయితే సర్దుకోవచ్చు. పంటపండించడానికి రైతు ఎంత కష్టపడుతాడో చివరకు అమ్ముకోవడానికి అంతకన్నా ఎక్కువ శ్రమ పడాల్సి వొస్తున్నది.. పంట చేతికొచ్చిందని సంతోషపడాలా, చేతులారా పాడైపోతున్నదని దుఃఖ పడాలో తెలియని అయోమయంలో రైతులున్నారు.
       ఒకటారెండా ఎన్ని సమస్యలు, అన్ని సుడిగుండాల్లా వారిని చుట్టుముడుతున్నాయి. కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తరలించినప్పటినుండి వారి బాధలు మొదలవుతున్నాయి. ఐకెపి వాళ్ళు ఆలస్యంగా కొనుగోలు మొదలుపెట్టడం దగ్గరినుంచి, మిల్లుకు చేరేవరకు  రైతునే బాధ్యులను చేస్తున్నారు. ధాన్యంలో తేమ శాతం కొలమానం మొదలు బస్తాలకు ఎత్తేవరకు ఒక ప్రళయం. బస్తాలు లేవని, ఇప్పుడప్పుడే కాంటాలు పెట్టేదిలేదంటే రోజుల తరబడి పడిగాపులు పడాల్సిందే. చివరకు బస్తాలను కూడా రైతులే కొనుగోలు చేయాల్సినపరిస్థితి. సుతిలిదారం దగ్గరినుంచి తెచ్చుకున్న రైతులు లేకపోలేదు. అదేమంటే ఎంతకాలం కుప్పలుపోసి కూర్చుంటాం. అకాల వర్షాలకు ధాన్యం కొట్టుకుపోతే చేసేదేముందన్న ఆవేదన చెందుతున్నారు.
20, 25 రోజులనుండి 50 రోజులవరకు ధాన్యం కొనుగోలుకేంద్రాల్లో మూలుగుతున్నా అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుంటే రైతు ఏంచేయగలడు. అకాల వర్షాలబారినుండి ధాన్యం కాపాడుకునేందుకు వంద రూపాయలకు ఒక టార్పాలిన్‌ ‌చొప్పున ఎన్ని తీసుకుంటే, ఎన్నిరోజులు కప్పుతే ఎన్ని డబ్బులు అవుతాయో ఒక్కసారి ఊహించమంటున్నారు రైతన్నలు. తమ ధాన్యం సకాలంలో కొనుగోలు జరుగకపోడంతో అదనపు ఖర్చులే తడిసిమోపడవుతున్నాయని వారు వాపోతున్నారు. ధాన్యాన్ని లారీలోకి ఎక్కించే హమాలీ ఖర్చులుకూడా రైతులమీదే వేస్తున్నారు. ఎక్కించిన ధాన్యం మిల్లుకు ఎప్పుడు చేరుతుందో తెలియదు. అది మిల్లుకు చేరేలోగా ఎండకు ఎండి మళ్ళీ తూకం వేసినప్పుడు తక్కువ రావడంతో తరుగు పేరున కోతలు విధిస్తున్నారు. అంటే చివరి దశలోకూడా నష్టపోయేది రైతే అన్నమాట. అప్పటివరకు రైతుకు తన ధాన్యం ఎంత తూకానికి వచ్చిందన్న విషయంపైన ఏమాత్రం అవగాహన ఉండదు.
     ఇక రైస్‌ ‌మిల్లుకు చేరిన తర్వాత మిల్లులో వాటిని దింపుకునే స్థలం లేదంటూ వరుసగా నాలుగైదు రోజులవరకు లారీలోని ధాన్యం లోడ్‌ను దించరు. అంటే రైతుకు తాను విక్రయించిన ధాన్యం డబ్బులు రావాలంటే మరో వారంరోజుల వేచిచూడాల్సిందే. ఇక రోజులతరబడి కొనుగొలు కేంద్రాల్లో పడిగాపులుకాసే రైతుకు అక్కడేమన్నా సదుపాయాలున్నాయా అంటే ఏమీ ఉండవు. కనీసం మంచినీటి సౌకర్యాన్నికూడా ప్రభుత్వం కల్పించదు. ధాన్యం లాగానే రైతుకూడా ఎండకు ఎండి, వానకు తడువాల్సిందే. ఈ పరిస్థితిలో అనేక మంది రైతులు అనారోగ్యానికి గురవుతున్నారు. కొందరు తమ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ప్రాణాలు విడుస్తున్నారు. తమ గోసను పట్టించుకోని ప్రభుత్వంపై నిరసన వ్యక్తంచేయడానికి రైతులు రోడ్డున పడక తప్పడంలేదు. ధర్నాలు, రస్తారోకోలు చేస్తున్నారు. విసుగుపుట్టి కష్టపడి పండించిన ధాన్యాన్ని చేతులారా తగులపెట్టుకుంటున్నారు. వారికి మద్దతు ప్రకటించిన ప్రతిపక్ష పార్టీలపై అధికారపార్టీ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నదేగాని, వాస్తవంగా జరుగుతున్న పరిణామాలపై త్వరితగతిన చర్యలు తీసుకోలేకపోతున్నది.
       కొనుగోలు విషయంలో ఆలస్యం జరుగుతున్నదన్నది నిజమేనని బహిరంగంగా ఒప్పుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, త్వరితగతిన కొనుగోలు చేయాలని కలెక్టర్లకు ఆదేశాలిచ్చినట్లు చెప్పారు. అధికారపార్టీ ఎమ్మెల్యేలు ,మంత్రులు హుటాహుటిన కొనుగోలు కేంద్రాలకు వెళ్ళి వాస్తవపరిస్థితిని తెలుసుకుని ప్రత్యామ్నాయ  చర్యలు చేపట్టకపోవడంపట్ల రైతు నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వడగాడ్పులకు, అకాలవర్షాలకు గుండెపగిలి పలువురు రైతులు మృతి చెందారంటూ బిఆర్ఎస్‌ ‌కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్‌ ‌పేర్కొనడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కొనుగోలు కేంద్రాల్లో ఒక్క రైతుకూడా మరణించలేదంటున్నా రాష్ట్ర వ్యాప్తంగా రైతుల గోడునుమాత్రం ఆయన వినిపించుకుంటున్నట్లులేదు. ఎంతసేపటికి గత ప్రభుత్వంతో పోల్చుకోవడం తప్ప, ప్రస్తుత పరిస్థితిపై దృష్టి పెట్టకపోవడాన్ని రైతాంగం తీవ్రంగా నిరసిస్తున్నది.
గత ప్రభుత్వకన్నా రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేశామని, ఓర్వలేకనే బిఆర్ఎస్‌ ‌తప్పుడు ప్రచారాలు చేస్తున్నదంటున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి రైతుల గోడు వినిపిస్తున్నట్లులేదు. అంతా సవ్వంగానే ఉంటే తెలంగాణ రక్షణ సేన అధినేత కల్వకుంట్ల కవిత సెక్రెటరేట్‌ ‌ముందు ధాన్యం పారబోసి ధర్నా ఎందుకు చేస్తుంది. అది ఒక్కటేకాదు. వర్షాకాలం పంటకు ముందు భూమి బలంకోసం వాడే జీలుగు విత్తనాలకు మండల కార్యాలయానికి రోజులతరబడి రైతులు చక్కర్లు కొట్టాల్సి వొస్తున్నది. రైతు పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్ కార్డుతో  స్వయంగా హాజరుకావాలన్న నిబంధన పెట్టారు. పోనీ దరఖాస్తు చేసుకున్నదగ్గరే వాటిని ఇస్తారా అంటే దానికోసం వేరే కొనుగోలు కేంద్రానికి వెళ్ళాలి. అసలే ఉష్ణోగ్రత 46 డిగ్రీలు దాటుతున్న ఈ రోజుల్లో రైతును ఎండల్లో ఇలా తిప్పటం ఎంతవరకు సమంజసమో అధికారులకే తెలియాలి. ఇలా చెప్పుకుంటూ పోతే రైతుల కష్టాలకు అంతులేకుండా పోతున్నది. రైతేరాజని, రైతే దేశానికి వెన్నెముక అన్నవి కేవలం నినాదాలకే పరిమితమయ్యాయనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంటుంది..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *