ఉత్తర, దక్షిణ భారత రాజకీయ శైలి వేరు

– తెలంగాణలో విద్యార్థి సంఘాలు తక్కువ
– నేను ఏపార్టీలో వున్నా రాష్ట్రంకోసమే పనిచేస్తా
– ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

దిల్లీ, సెప్టెంబర్ 28: తెలంగాణలో విద్యార్థి సంఘాలు చాలా తక్కువ.. లెఫ్ట్, రైట్ సంఘాలున్నాయి. ఎన్ఎస్ఐయూ ప్ర‌భావం పెద్ద‌గా లేదు. ఉత్తర భారతదేశంలో, దక్షిణ భార‌త‌ దేశంలో రాజ‌కీయాల శైలి వేరని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దిల్లీలో అస్సాం దిన‌ప‌త్రిక ప్ర‌తిదిన్‌ సోమవారం నిర్వహించిన కాంక్లేవ్‌లో ఇండియాస్ నెక్ట్స్ చాఫ్ట‌ర్ అంశంపై ప్రసంగించారు. మా ద‌గ్గ‌ర యూనివ‌ర్సిటీ లా కాలేజ్‌, ఆర్ట్స్ కాలేజీ నాయ‌కునిగా ఏబీవీపీలో గెలిచిన వారు త‌ర్వాత కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు. యూనివ‌ర్సిటీలో విద్యార్థి సంఘంలో ఉన్నా, గ్రామానికి వెళ్లిన తర్వాత ఆ కుటుంబం కాంగ్రెస్‌లోనే ఉంటుంది. తెలంగాణ‌లో బీజేపీకి పెద్ద‌గా ప్రాధాన్యం లేదు. స్టూడెంట్ రాజ‌కీయాల్లో ఏబీవీపీ ప్ర‌భావం ఉంటే రాజ‌కీయాల్లో కాంగ్రెస్ ప్ర‌భావం ఉంటుందన్నారు. నేను 2006లో జ‌డ్పీటీసీ స‌భ్యునిగా, 2007లో ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్‌గా గెలిచా. ఆ రెండు సార్లు నేను కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించా.. అక్క‌డ రెండు పార్టీలే ఉన్నాయి.. కాంగ్రెస్, తెలుగుదేశం. నాకు జిల్లాలో కాంగ్రెస్ నాయకులతో పెద్ద‌గా సంబంధాలు పెద్దగా లేవు.. ప్ర‌భుత్వంపై పోరాడాలంటే ప్ర‌తిప‌క్ష‌మే మేల‌ని భావించా. అందుకే నేను తెలుగుదేశంలో చేరా. ఆ పార్టీ నుంచి 2009, 2014లో ఎమ్మెల్యేగా గెలిచా. తెలంగాణ‌ అభివృద్ధి, సంక్షేమం, తెలంగాణ ప్ర‌జ‌ల‌కు మేలు చేయ‌డం కోసం, ప్ర‌జ‌ల ఆత్మ‌గౌర‌వం కోసం సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు.  రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత నాయ‌క‌త్వం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఉండ‌డంతో తెలుగుదేశం పార్టీకి తెలంగాణ‌లో ప్రాధాన్యం త‌గ్గిపోయింది. మీరు మంచి నాయ‌కుడు, మీరు నాయుడుతో క‌లిసి ప‌ని చేస్తే తెలంగాణ‌లో ఇబ్బంది అని ప్ర‌జ‌లు చెప్పారు. దాంతో నేను కాంగ్రెస్‌లో చేరాల‌ని నిర్ణ‌యించుకున్నాను. రాహుల్ గాంధీ, దిగ్విజ‌య్ సింగ్‌, జైరాం ర‌మేశ్ తోపాటు నా శ్రేయోభిలాషులు కాంగ్రెస్‌లో ఉన్నారు. తెలుగుదేశం కేంద్రంలో ఎన్డీఏతో ఉంది. ఏపీలో ఎన్డీఏ ఉంది. తెలంగాణ‌లో బీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఉంది. నేను రెండింటితో పోరాడాల్సి ఉంది. ఆమె ఏ ల‌క్ష్యాల‌తో తెలంగాణ ఇచ్చారో వాట‌న్నింటిని కేసీఆర్ ప్ర‌భుత్వం తుంగ‌లో తొక్కింది. అందుకే నేను 2017లో కాంగ్రెస్‌లో చేరాను. రాహుల్ గాంధీని క‌లిసిన త‌ర్వాత 15 నిమిషాలు మాట్లాడాం. ఆ రోజే ఆయ‌న నా నాయ‌కుడు అని నిర్ణ‌యించుకున్నా. 2019లో ఎంపీగా గెలిచాను. రాష్ట్రంలో 2014 ఎన్నిక‌ల త‌ర్వాత కేసీఆర్‌, రేవంత్ మ‌ధ్య పోటీగా మారింది. ఆయ‌న న‌న్ను అనేకసార్లు జైలుకు పంపారు. నేను అసెంబ్లీకి క‌న్నా జైలుకే ఎక్కువసార్లు వెళ్లానని గుర్తుచేసారు. 2023లో కేసీఆర్ ను ఓడించాను. రాహుల్ గాంధీకి ఎటువంటి వ్య‌క్తిగ‌త అజెండాలు లేవు. ఆయ‌న‌కు దేశ‌మే ముఖ్యం. నేను విద్యార్థి సంఘంలో ఉన్నా. నాయుడు పార్టీలో ఉన్నా దేశం, రాష్ట్రం కోసం ఏదైనా చేయాల‌నుకున్నానని స్పష్టం చేశారు.

ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్యే నా లక్ష్యం

తెలంగాణలోని ప్రభుత్వ విద్యావ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసి యువతకు అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలు అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. స్వాతంత్య్రం వచ్చినప్పుడు 12.50% కంటే తక్కువగా ఉన్న అక్షరాస్యతను 33 ఏళ్లుగా ఉన్న సగటు ఆయుర్దాయాన్ని పెంచేందుకు పండిట్ నెహ్రూ విద్య, సాగునీరు, ఆరోగ్య రంగాలకు బలమైన పునాదులు వేశారని గుర్తుచేశారు. దేశంలో సగటున 30 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉంటే, తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి 17 మందికి ఒక టీచర్ ఉన్నారని పేర్కొన్నారు. మెరుగైన టీచర్-స్టూడెంట్ రేషియో ఉన్నప్పటికీ సరైన నాణ్యత, ఇంగ్లీష్ మీడియం బోధన, నర్సరీ/ప్రీ-ప్రైమరీ తరగతులు లేకపోవడం వల్ల ఏటా 50 నుంచి 60 వేల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలను వీడుతున్నారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో లోపాలను సవరించి తగిన మార్పులు సూచించేందుకు ప్రత్యేక విద్యా కమిషన్‌ను నియమించామన్నారు. ప్రభుత్వం ఏటా రూ. 2,500 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్‌గా చెల్లిస్తున్నప్పటికీ కొన్ని ప్రైవేటు కళాశాలల్లో తగిన సంఖ్యలో లెక్చరర్లు, విద్యార్హతల నాణ్యత కొరవడుతోందని, వీటిని క్రమబద్ధీకరిస్తామని సీఎం స్పష్టం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *