– మానవ హక్కుల వేదిక డిమాండ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 28 : హైదరాబాద్ నగరంలో ప్రజల ఇళ్ల నుంచి, దుకాణాలు, హోటళ్లు, ఇతర వాణిజ్య, సంస్థల నుంచి ప్రతిరోజూ చెత్తను సేకరించి, జీహెచ్‌ఎంసీ నిర్దేశించిన ప్రాంతాలకు తరలించే స్వచ్ఛ ఆటోలు, టిప్పర్లు, ట్రాలీల కార్మిక వ్యవస్థను ప్రైవేటు సంస్థకు అప్పగించే చర్యలను ప్రభుత్వం నిలిపివేయాలని మానవ హక్కుల వేదిక ఒక ప్రకటనలో డిమాండ్ చేసింది. రెండు దశాబ్దాలుగా హైదరాబాద్‌లో చెత్త సేకరణ, తరలింపు కోసం ఈ విధానం అమలులో ఉంది. గత ప్రభుత్వం సబ్సిడీపై దళిత, వెనుకబడిన వర్గాలకు చెందిన కార్మికులకు సుమారు 4,750 స్వచ్ఛ చెత్త తరలింపు వాహనాలను అందించింది. ఈరంగం లో ఉపాధికి అవకాశం ఉందని, నిరుద్యోగులు గత 20 సంవత్సరాల్లో సుమారు 15వేల మంది కార్మికులు స్వంతంగా ఆటోలు, ట్రాలీలు తదితర వాహనాలను సమకూర్చుకుని చెత్త సేకరణ, తరలింపు ద్వారా స్వయం ఉపాధి పొందుతున్నారు. ఈ కార్మికులు ప్రజల ఇళ్ల నుంచి, దుకాణాలు, హోటళ్లు, ఇతర సంస్థల నుంచి చెత్తను సేకరించి, అందుకోసం కొంత తీసుకుంటూ తమ జీవనోపాధిని కొనసాగిస్తున్నారు. ఈ విధంగా వారు తమ స్వంత శ్రమ,ఆర్థిక వనరులు సమకూర్చుకొని, దాదాపు 10 వేల వాహనాలను ఖరీదు చేసి, ఒక వికేంద్రీకృత చెత్త సేకరణ, తరలింపు వ్యవస్థను ఏర్పరచుకున్నారు. ప్రస్తుతం సేకరించిన చెత్తను జీహెచ్‌ఎంసీ నిర్దేశించిన ప్రాంతాలకు తరలించిన అనంతరం, అక్కడి నుంచి రాంకీ ఎన్విరో ఇంజనీర్స్ సంస్థకు చెందిన వాహనాల ద్వారా జవహర్‌నగర్‌లోని ప్రధాన డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే ఉన్న ఈ స్వచ్ఛ ఆటో, టిప్పర్ కార్మిక స్వయం ఉపాధి వ్యవస్థను, అందులో ఆధారపడి జీవిస్తున్న వేలాది మంది కార్మికులతో సహా, ఒక ప్రైవేటు సంస్థకు అప్పగించే ప్రయత్నo చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చర్య అమలైతే తమ సొంత శ్రమతో ఏర్పరచుకున్న స్వయం ఉపాధి అవకాశాలను కోల్పోయే ప్రమాదం కార్మికులకు ఏర్పడుతుంది. అంతేకాక వారి జీవనోపాధి, సామాజిక భద్రతపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. తమను మున్సిపల్ శాఖ ఆధీనంలోనే కొనసాగించాలని, తమ ఉపాధికి భద్రత కల్పించడంతో పాటు పెన్షన్, ఆరోగ్య భద్రత, బీమా తదితర సామాజిక భద్రతా సౌకర్యాలతో కూడిన వ్యవస్థను ఏర్పాటు చేయాలని స్వచ్ఛ ఆటో, టిప్పర్ కార్మికులు కొంతకాలంగా ఆందోళన చేస్తున్నారు. ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం వంటి కీలకమైన ప్రజా సేవలను నిర్వహిస్తున్న కార్మికుల జీవనోపాధిని ప్రైవేటీకరణ పేరుతో దెబ్బతీయడం చాలా అన్యాయం. ఇప్పటికే తమ స్వంత శ్రమ,స్వంత పెట్టుబడితో ఏర్పరచుకున్న ఈ కార్మికుల స్వయం ఉపాధి వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. స్వచ్ఛ ఆటో, టిప్పర్, ట్రాలీ కార్మిక వ్యవస్థను రాంకీ వంటి ప్రైవేటు సంస్థకు అప్పగించవద్దని, ఈ కార్మికులు నిర్మించుకున్న వ్యవస్థ ను, మరింత పటిష్టం చేయాలని, వారికి ఆరోగ్య బీమా, ప్రమాద బీమా, పెన్షన్ తదితర సామాజిక భద్రతా సౌకర్యాలతో కూడిన సమగ్ర సంక్షేమ వ్యవస్థను ఏర్పాటు చేయాలని, చెత్త సేకరణ, తరలింపు రంగంలో పనిచేస్తున్న వేలాదిమంది కార్మికుల జీవనోపాధికి ప్రభుత్వం పూర్తి రక్షణ కల్పించాలని మానవ హక్కుల వేదిక ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
————————————————————————————————————————————————————–తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





