– రూ.450 కోట్ల పెట్టుబడి. వేయిమందికి ఉద్యోగాలు
– 2,600 మంది బీ2బీ సరఫరాదారులు
– లాంఛనంగా ప్రారంభించిన ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 28 : జాతీయ, అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు తమ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల(జీసీసీ) ఏర్పాటుకు హైదరాబాద్‌ను తమ గమ్యస్థానంగా ఎంచుకుంటుండగా తాజాగా ఈ జాబితాలో ప్రముఖ బిజినెస్ టూ బిజినెస్ (బీ2బీ) క్యాష్ జనరేషన్ ప్లాట్‌ఫాం ‘బిల్ట్రస్ట్’ కూడా చేరింది. మాదాపూర్ రహేజా మైండ్ స్పేస్‌లో 40వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.450 కోట్ల పెట్టుబడి అంచనా వ్యయంతో అభివృద్ధి చేసిన ‘బిల్ట్రస్ట్ టెక్నాలజీ సెంటర’ను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనతికాలంలోనే హైదరాబాద్ జీసీసీలకు హబ్‌గా మారిందన్నారు. గతేడాది 75కు పైగా కొత్త జేసీసీలు ఇక్కడ ప్రారంభమయ్యాయని, ఇది దేశంలోనే అత్యధికమని వివరించారు. ఈ ఏడాది 100 జీసీసీలను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. జీసీసీలను ‘బ్యాక్ ఆఫీస్ ఆపరేషన్లకు మాత్రమే పరిమితం చేయకుండా గ్లోబల్ వాల్యూ సెంటర్లుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామన్నారు. హైదరాబాద్‌లో ఏఐ-ఫస్ట్ జీసీసీని ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిన ‘బిల్ట్రస్ట్’కు ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటామన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్థ 2,600 మంది బీ2బీ సరఫరాదారులు, 14 మిలియన్లకు పైగా కొనుగోలుదారులకు సేవలు అందిస్తోందన్నారు. గ్లోబల్ ఆపరేషన్స్, టెక్నాలజీ, ఆరఅండ్ డీ విభాగాల అనుసంధానంలో ఈ టెక్నాలజీ సెంటర్ కీలకపాత్ర పోషిస్తుందన్నారు. ఇక్కడ దశలవారీగా కొత్తగా వేయిమంది హై స్కిల్డ్ వర్క్ ఫోర్స్‌కు ఉద్యోగాలు లభిస్తాయన్నారు. హైదరాబాద్‌లో టెక్ ట్యాలెంట్‌కు కొదవ లేదని, వారిని పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్రంలోని ప్రముఖ విద్యా సంస్థలు, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, టాస్క్, టీ హబ్ తదితర సంస్థలతో కలిసి పనిచేసేందుకు ముందుకు రావాలని బిల్ట్రస్ట్ ప్రతినిధులను మంత్రి శ్రీధర్‌బాబు ఆహ్వానించారు. కార్యక్రమంలో బిల్ట్రస్ట్ సీఈవో గ్రాంట్ హల్లరాన్, ఇండియా జీసీసీ కంట్రీ హెడ్ ఫర్హాద్ హెచ్.బారియా తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





