– నాలుగు కమిషనరేట్లపై డీజీపీ సమీక్ష
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 2: ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులకు అనుగుణంగా నాలుగు కమిషనరేట్ల పరిధిలోని పోలీస్ స్టేషన్ల పరిధుల పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని డీజీపీ సీవీ ఆనంద్ ఆయా కమిషనర్లను ఆదేశించారు. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి, ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన అంశాలపై ఆయన గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయా కమిషనరేట్ల పోలీస్ కమిషనర్లు పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ, పరిధుల విభజన, పరిపాలనా అవసరాలు తదితర అంశాలపై తమ ప్రతిపాదనలను డీజీపీకి వివరించారు. ఈ సందర్భంగా డీజీపీ ఆనంద్ మాట్లాడుతూ మున్సిపల్ సంస్థలు, రెవెన్యూ డివిజన్లు, న్యాయస్థానాల పరిధులను పరిగణనలోకి తీసుకుని పోలీస్ స్టేషన్ హద్దులను నిర్ణయించాలని సూచించారు. భవిష్యత్ పట్టణ విస్తరణ, జనాభా పెరుగుదల, పరిపాలనా అవసరాలను దృష్టిలో ఉంచుకుని దీర్ఘకాలిక ప్రణాళికతో పోలీస్ స్టేషన్ల పరిధులను పునర్వ్యవస్థీకరించాలన్నారు. ఈ ప్రక్రియలో సంబంధిత అన్ని వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నగరంలోని కొన్ని ప్రాంతాల పోలీస్ స్టేషన్ పరిధుల నిర్ణయంపై ప్రత్యేక సూచనలు చేసిన డీజీపీ.. పోలీస్ స్టేషన్ల పరిధుల మార్పులు, చేర్పుల నిర్ణయం వల్ల ప్రజలకు, ప్రభుత్వ శాఖలకు, న్యాయవ్యవస్థకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అలాగే, ఆయా ప్రాంతాల భౌగోళిక, పరిపాలనా ప్రత్యేకతలను ప్రతిబింబించే విధంగా పోలీస్ స్టేషన్లకు తగిన పేర్లు నిర్ణయించాలని సూచించారు. పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ ద్వారా ప్రజాకేంద్రిత, సమర్థవంతమైన పోలీసింగ్ మరింత బలోపేతం కావడంతో పాటు ప్రజలకు పోలీసు సేవలు మరింత చేరువ కావాలని డీజీపీ ఆకాంక్షించారు. సమావేశంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి.సజ్జనార్, ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డి, మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి, జాయింట్ కమిషనర్లు, ఇతర సీనియర్ పోలీసు అధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





