ఖేలో ఇండియా పోటీలకు శాశ్వత ఏర్పాట్లు

– సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 2 : ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లకు సంబంధించిన అన్ని వనరులను ఖేలో ఇండియా-2026 పోటీలకు సైతం ఉపయోగించుకునేలా సమాంతరంగా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. డిసెంబర్ 11 నుంచి 22వ తేదీ వరకు రాష్ట్రంలో నిర్వహించనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 8వ ఎడిషన్ క్రీడా పోటీల నిర్వహణ ఏర్పాట్లపై ఎంసీఆర్ హెచఆర్‌డీలో ముఖ్యమంత్రి సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ పోటీలకు ఏర్పాట్లలో ఎక్కడా నాణ్యతా ప్రమాణాల లోపం లేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. తెలంగాణ క్రీడా విధానం, యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ద్వారా రాష్ట్రాన్ని దేశంలోనే క్రీడల హబ్‌గా మార్చేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఈ పోటీలను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఒలింపిక్స్‌లో పతకాలు సాధించడమే దీర్ఘ కాలిక లక్ష్యంగా అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు, ప్రపంచస్థాయి క్రీడా శిక్షణను రాష్ట్ర యువ క్రీడాకారులకు అందించేందుకు ఈ పోటీలను ఒక గొప్ప అవకాశంగా మలుచుకోవడం ప్రభుత్వ ఉద్దేశమని సీఎం అన్నారు.
ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో క్రీడలు, క్రీడాభివృద్ధికి సంబంధించిన పెట్టుబడుల ఆకర్షణ కూడా ఒక భాగం అయినందున అధికారులు కలిసికట్టుగా పనిచేయాలన్నారు. యువతలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి వారిని అంతర్జాతీయస్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలన్నారు. అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో క్రీడా ప్రాంగణాలను తీర్చిదిద్ది ఖేలో ఇండియా పోటీల తర్వాత కూడా అవి గొప్ప క్రీడా వనరులుగా ఉపయోగపడేలా చూడాలన్నారు. ఏర్పాట్లలో నాణ్యతా ప్రమాణాల లోపం లేకుండా పటిష్ట చర్యలు తీసుకునే విధంగా గ్రూప్-1 స్థాయి అధికారులకు ఏర్పాట్ల నుంచి క్రీడలు ముగీసే వరకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించాలన్నారు. వివిధ జిల్లాల్లో జరగనున్న పోటీలకు సంబంధించి ఏర్పాట్ల పర్యవేక్షణకు ఆయాచోట్ల స్థానికంగా పనిచేస్తున్న ట్రైనీ అధికారులు, గ్రూప్-1 అధికారులను నియమించాలన్నారు. క్రీడాకారులకు ఆహారం, వసతి సౌకర్యాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు. ప్రతి వారం ఏర్పాట్ల పురోగతిపై సమాచారం ఇవ్వాలన్నారు. కాగా, గత బీఆరఎస్ ప్రభుత్వ హయాంలో క్రీడా పోటీల్లో జరిగిన పరిణామాలు పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గత ప్రభుత్వ పాలనలో క్రీడలకు కొన్నిచోట్ల చేపట్టిన మౌలిక సదుపాయాల పనులు క్రీడా పోటీలు ముగిసిన కొన్నాళ్లలోనే పాడేపోయాయని గుర్తు చేశారు. ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో క్రీడా పోటీల ప్రారంభ, ముగింపు వేడుకల్లో అనవసరమైన ఆడంబరాలకు తావు లేకుండా జాగ్రత్త తీసుకోవాలన్నారు.

ఏడు వేలకుపైగా యువ క్రీడాకారులు

ఈ క్రీడా పోటీల్లో దేశవ్యాప్తంగా వేలాదిమంది యువ క్రీడాకారులు పాల్గొననున్నారు. ఏడు వేలకు పైగా యువ క్రీడాకారులతోపాటు సుమారు రెండు వేల మంది కోచింగ్ సిబ్బంది, అధికారులు రాష్ట్రానికి రానున్నారు. రాష్ట్రంలో హైదరాబాద్ సహా ఆరు నగరాల్లో 20 చోట్ల 27 రకాల క్రీడా పోటీలు, ఒక డెమో పోటీ నిర్వహించనున్నారు. తెలంగాణ కర్రసాము క్రీడను కూడా ఆతిథ్య రాష్ట్ర కోటాలో ఖేలో ఇండియా క్రీడల్లో చేర్చే విధంగా వెంటనే కార్యాచరణ చేపట్టాలని సీఎం సూచించారు. ఈ పోటీల్లో రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించే క్రీడాకారులు సత్తా చాటేలా చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు తెలిపారు. ఇప్పటికే వివిధ జిల్లాల్లో ఖేలో ఇండియా శిబిరాల్లో క్రీడాకారులు శిక్షణ పొందుతున్నారన్నారు. వివిధ క్రీడా పోటీల నిర్వహణకు 20 వేదికల్లో చేపడుతున్న మౌలిక సదుపాయాల అభివృద్ధి పనుల పురోగతి గురించి అధికారులు వివరించారు. సమావేశంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనా రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, సీఎం సలహాదారు కె.రామకృష్ణా రావు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ(స్పోర్ట్స్) వాణీప్రసాద్, స్పోర్ట్స్ అథారిటీ ఎండీ సోని బాలా దేవి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *