అరాచక పాలనకు స్వస్తి పలకాలి

– ప్రతి ఒక్కరూ సంకల్పం తీసుకోవాలి
– మహా పాదయాత్రలో హోంమంత్రి అమిత్ షా పిలుపు
– హైదరాబాద్ వీధుల్లో కదం తొక్కిన కమల దళం
– బేగంపేట విమానాశ్రయంలో ఘన స్వాగతం
– భాగ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 2 : ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ అరాచకత్వాన్ని అంతం చేయాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. కాంగ్రెస్ సర్కార్‌ను గద్దె దించేందుకు హైదరాబాద్ గడ్డపై ప్రతి ఒక్కరూ సంకల్పం తీసుకోవాలని, రాబోయే రోజుల్లో రాష్ట్రంలో బీజేపీని గెలిపించుకోవాలని కోరారు. ప్రజాస్వామ్య పరిరక్షణే ధ్యేయంగా ‘లోక్‌తంత్ర బచావో – అరాచకత హఠావో’ నినాదంతో బీజేపీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో సోమవారం నిర్వహించిన మహా పాదయాత్ర కేంద్ర హోంమంత్రి అమిత్ షా నాయకత్వంలో అత్యంత ఉత్సాహభరితంగా సాగింది. నిజాం కాలేజీ సమీపంలోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం నుంచి ప్రారంభమైన ఈ యాత్ర మొజంజాహి మార్కెట్ క్రాస్ రోడ్స్ వరకు కొనసాగింది. పార్టీ శ్రేణులు, ప్రజలు, అభిమానుల భారీ భాగస్వామ్యంతో హైదరాబాద్ వీధులన్నీ కాషాయమయం అయ్యాయి. అడుగడుగునా జై బీజేపీ నినాదాలతో నగర వీధులు హోరెత్తాయి. కాషాయ జెండాలు రెపరెపలాడాయి. మహా పాదయాత్రలో ప్రజలకు అభివాదం చేస్తూ అమిత్ షా ముందుకు సాగారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో అమిత్ షా మాట్లాడుతూ నాటి ఉక్కు మనిషి సర్దార్ వల్లభ భాయ్ పటేల్ లేకపోతే హైదరాబాద్ సంస్థానానికి విముక్తి లభించేది కాదని గుర్తు చేశారు. కాంగ్రెస్, ఇండి కూటమి చేపడుతున్న ర్యాలీలు ఓటు బచావో కోసం కాదని, చొరబాటుదారు(ఘుస్‌పైఠియా)లను కాపాడేందుకేనని విమర్శించారు. ఓటర్ల జాబితా సవరణ (‘సర్‌’), ఓట్ల తొలగింపుపై రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దేశంలో 13 కోట్ల ఓట్లు రద్దయ్యాయని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు.. అసలు తొలగించిన ఓట్లలో ఆరున్నర కోట్లు వేరే ప్రాంతాలకు మారిన వారివి కాగా, మరో మÖడు కోట్ల మంది చనిపోయిన వారి ఓట్లు ఉన్నాయి. చనిపోయిన వారి ఓట్లను తొలగించవద్దా.. నకిలీ ఓట్లను తొలగిస్తుంటే రాహుల్ గాంధీకి ఎందుకు కడుపుమంట అని ప్రశ్నించారు. ‘సర’ కారణంగానే తాము అధికారంలోకి వచ్చామని రాహుల్ అంటున్నారు. . మరి రాహుల్ ఎంపీ అయింది కూడా ‘సర్‌’ వల్లేనా అంటూ కేంద్ర హోంమంత్రి చురకలంటించారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఎంత ప్రయత్నించినా చొరబాటుదారులకు ఓటు హక్కు దక్కనివ్వబోమని స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ వెంటిలేటర్‌పై ఉందంటూ అలాంటి పార్టీ మోదీని అడ్డుకుంటుందా అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ను రాహుల్ గాంధీ కాపాడలేరు అని స్పష్టం చేశారు.

ఈవీఎంలు, ‘సర్‌’పై చర్చకు సవాల్

‘సర్‌’ అమలులోకి రాకముందే కేంద్రంలో బీజేపీ వరుసగా మూడుసార్లు గెలిచిందని, 2014లో నరేంద్ర మోదీ ప్రధాని అయినప్పుడు ‘సర్‌’ జరగలేదని అమిత్‌షా గుర్తు చేశారు. మహారాష్ట్ర, హర్యానా, దిల్లీ, బీహార్, బెంగాల్, అస్సాం ఎన్నికల్లో ప్రజాదరణతోనే విజయం సాధించామన్నారు. గెలిస్తే ప్రజలు గెలిపించినట్లు, ఓడిపోతే ఈవీఎంలపై నెపం వేయడం కాంగ్రెస్‌కు అలవాటుగా మారిందని ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుగా వారి పరిస్థితి తయారైందని ఎద్దేవా చేశారు. ఈవీఎంల ద్వారానే బీజేపీ గెలిస్తే మరి తెలంగాణలో కాంగ్రెస్ ఎలా గెలిచింది.. కేరళ, తమిళనాడులో బీజేపీయేతర ప్రభుత్వాలు ఎలా ఏర్పడ్డాయి అని ఆయన ప్రశ్నించారు. ఈవీఎంలు, ‘సర్‌’  అంశాలపై చర్చకు తాము సిద్ధమంటూ పార్లమెంటులో ఈ అంశంపై చర్చకు రాకుండా కాంగ్రెస్ ఎందుకు పారిపోతోందో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించే కాంగ్రెస్, ఇండి కూటమి రాజకీయాలకు ప్రజాక్షేత్రంలోనే తగిన సమాధానం చెప్తామని, భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు.

మాక్ పార్లమెంటులోనే రాహుల్ ప్రధాని

రాహుల్ గాంధీ ఎప్పటికీ దేశానికి ప్రధాని కాలేరని అన్నారు. కేవలం మాక్ పార్లమెంటులోనే ప్రధాని కాగలరని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ పదేళ్ల పాలనలో రూ.12 లక్షల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు.

దిల్లీకి ఏటీఎంగా తెలంగాణ.. ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను దిల్లీ కాంగ్రెస్‌కు ఏటీఎంలా మార్చేసిందని, రాష్ట్ర ప్రజల సొమ్ముతో నిస్సిగ్గుగా ఆర్ఆర్ (రాహుల్-రేవంత్) ట్యాక్స్ పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నారని అమిత్ షా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వసూలు చేసిన ఈ సొమ్ము నేరుగా రాహుల్ గాంధీ వద్దకే వెళ్తోందని ఆరోపించారు. ఈ అవినీతిని బీఆర్ఎస్ గానీ, ఒవైసీ పార్టీ గానీ అడ్డుకోలేవని, బీజేపీ మాత్రమే చెక్ పెట్టగలదని ఉద్ఘాటించారు. మోదీ 12 ఏళ్ల పాలనపై ఒక్క అవినీతి మరక కూడా లేదంటూ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. మహా పాదయాత్ర, బహిరంగ సభలో రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు, కేంద్ర మంత్రులు జి.కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్, ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, డాక్టర్ కె.లక్ష్మణ్, డీకే అరుణ, ధర్మపురి అర్వింద్, గోడం నగేశ్, రఘునందన్ రావులతోపాటు అనేకమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ వర్గాలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

విమానాశ్రయంలో ఘన స్వాగతం.. భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనం 

హైదరాబాద్ పర్యటనకు ప్రత్యేక విమానంలో విచ్చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు బేగంపేట విమానాశ్రయంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకులు ఘన స్వాగతం పలికారు. శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం ఆయన చార్మినార్ సమీపంలోని ప్రసిద్ధ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనాలతో తీర్థప్రసాదాలు అందజేశారు.

ఇండి కూటమి ప్రచారాలను తిప్పికొడదాం : రామచందర్ రావు 

ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం.. అరాచకత్వాన్ని అంతం చేద్దాం అనే నినాదంతో మహా పాదయాత్రలో ప్రజలు, బీజేపీ కార్యకర్తలు కనీవినీ ఎరుగని రీతిలో భారీగా తరలివచ్చి విజయవంతం చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు కొనియాడారు. పాదయాత్రలో అడుగడుగునా ఉత్సాహం నింపిన కార్యకర్తలకు, ప్రజలకు, భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తరఫున, పార్టీ రాష్ట్ర శాఖ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంపైనా, బీజేపీపైనా, చివరకు దేశ రాజ్యాంగబద్ధ సంస్థలపైనా కాంగ్రెస్, ఇండి కూటమి పార్టీలు పచ్చి అబద్ధాలతో విష ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ముఖ్యంగా దేశ పౌరుల ప్రయోజనాల కోసం చేపడుతున్న ‘సర’ ప్రక్రియపై తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను దగా చేయాలని, తప్పుదోవ పట్టించాలని కుట్రలు పన్నుతున్నాయని అన్నారు. కాంగ్రెస్, ఇండి కూటముల ఈ విషపూరిత కుట్రలను, దుష్ప్రచారాన్ని ఎక్కడికక్కడ ఎండగట్టడానికే అమిత్ షా హైదరాబాద్ గడ్డపై మన మధ్యకు వచ్చి ఈ రెండు కిలోమీటర్ల మహా పాదయాత్రలో మనతో కలిసి అడుగులు వేశారని చెప్పారు. పార్టీ శ్రేణులు కూడా ప్రజల్లోకి వెళ్లి ఎక్కడికక్కడ దుష్ప్రచారాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ అరాచక పాలనను అంతమొందించేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని రామచందర్ రావు పిలుపునిచ్చారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *