కాంగ్రెస్ హయాంలో రైతుల కష్టాలు

– మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే
– రైతులను తప్పక ఆదుకుంటాం
– జిల్లా అభిపృద్ధిని పట్టించుకోని రేవంత్ రెడ్డి 
– ప్రభుత్వం హాస్పిటల్స్ పై దృష్టి పెట్టాలి
– బీఆర్ ఎస్ ఎల్పీ ఉప నాయ‌కుడు హరీశ్ రావు 
వనపర్తి, ప్రజాతంత్ర, నవంబర్ 2 : కాంగ్రెస్ పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రైతులు అధైర్యపడవద్దని, మరో ఏడాదిన్నర తర్వాత మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రైతులను ఆదుకుంటుందని బీఆర్ ఎస్ ఎల్పీ ఉప నాయ‌కుడు తన్నీరు హరీశ్ రావు అన్నారు. రైతులకు అండగా నిలిచి వారి సమస్యలను పరిష్కరించే బాధ్యతను బీఆర్ఎస్ తీసుకుంటుందని భరోసా ఇచ్చారు.వనపర్తి జిల్లా పెద్దమందడి మండల పరిధిలోని అల్వాల గ్రామంలో ఎండిపోయిన పంటలను ఆయ‌న‌ సోమవారం పరిశీలించారు. అనంతరం గ్రామ సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్య అతిథిగా మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను విమర్శిస్తూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు సక్రమంగా విద్యుత్ సరఫరా చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని హరీశ్ రావు ఆరోపించారు. సాగు సమయంలో రైతులకు అవసరమైన విద్యుత్ అందకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. వ్యవసాయానికి నిరంతర విద్యుత్ అందించే బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తోందని విమర్శించారు. ప్రస్తుతం వనపర్తి జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న పరిస్థితులు బాధాకరంగా ఉన్నాయని, ఎండిపోయిన పంటలను చూస్తుంటే రైతుల కష్టాలు అర్థమవుతున్నాయని తెలిపారు. రైతులకు అవసరమైన సమయంలో సాగునీరు అందించడంలో ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని ఆయన సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో వైద్య విద్య, వైద్య సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంలో కేసీఆర్ ప్రభుత్వం కీలక పాత్ర పోషించిందని హరీశ్ రావు గుర్తుచేశారు. వనపర్తి, మహబూబ్‌నగర్, గద్వాల, నాగర్‌కర్నూల్, నారాయణపేట జిల్లాల్లో వైద్య కళాశాలల ఏర్పాటు ద్వారా స్థానిక ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. వైద్య కళాశాలలు ఏర్పాటు వల్ల పేద ప్రజలకు వైద్యం అందించే అవకాశాలు పెరిగాయని, స్థానిక విద్యార్థులకు వైద్య విద్య అభ్యసించే అవకాశం లభించిందని తెలిపారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వ హాస్పిటల్స్ లో  రోగులకు అవసరమైన మందులు, సూదులు కూడా సరిపడా అందుబాటులో లేవని ఆరోపించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన ప్రభుత్వం హాస్పిటల్స్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు వైద్యం కోసం ఇబ్బందులు పడకుండా అవసరమైన మందులు, వైద్య సిబ్బంది, ఇతర సౌకర్యాలు కల్పించాలని సూచించారు.
జిల్లా అభివృద్ధిని పట్టించుకోని రేవంత్ రెడ్డి 
వనపర్తి జిల్లాకు చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి కావడంతో జిల్లా అభివృద్ధి వేగంగా జరుగుతుందని ప్రజలు ఆశించారని హరీశ్ రావు అన్నారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా అభివృద్ధిని పట్టించుకోవడం లేదని విమర్శించారు. జిల్లా ప్రజలు ఆయనపై పెట్టుకున్న ఆశలు నెరవేరడం లేదని ఆయన అన్నారు.జిల్లాలో సాగునీటి సమస్యలు, రైతుల ఇబ్బందులు, విద్యుత్ సరఫరా వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించకుండా రాజకీయ విమర్శలకు మాత్రమే పరిమితమవడం సరికాదని ఆయన పేర్కొన్నారు.వనపర్తి జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే గుర్తించి పరిష్కరించాలని, సాగునీరు అందించే విషయంలో నిర్లక్ష్యం చేయవద్దని కోరారు.జూరాల ప్రాజెక్టు నుంచి మరో 15 రోజుల పాటు సాగునీరు అందిస్తే రైతుల పంటలు పండే అవకాశం ఉంటుందని హరీశ్ రావు అన్నారు. రైతుల పంటలు ఎండిపోతున్న సమయంలో సాగునీటి సరఫరాను నిలిపివేస్తామని చెప్పి వారిని భయభ్రాంతులకు గురిచేయడం ప్రభుత్వం మానుకోవాలని సూచించారు.సాగునీటి విడుదల విషయంలో రైతులకు ముందస్తు సమాచారం ఇవ్వాలని, పంటలు కాపాడుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. కల్వకుర్తి రిజర్వాయర్ నుంచి ఐదు గంటల పాటు మోటార్లు నడిపించి చెరువులు, కుంటలను నీటితో నింపాలని హరీశ్ రావు ప్రభుత్వాన్ని కోరారు. చెరువుల్లో నీరు నిల్వ ఉంటే రైతులకు సాగునీటి అవసరాలు తీరడంతో పాటు భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంటుందని అన్నారు. రైతులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న కష్టాలను చూసి అధైర్యపడవద్దని హరీశ్ రావు అన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు బీఆర్ఎస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, సాగునీరు, విద్యుత్, రైతు సంక్షేమంపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు.రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడం, సాగునీటి సరఫరా, విద్యుత్ సమస్యలను పరిష్కరించడం ప్రభుత్వ ప్రాధాన్యతగా ఉండాలని అన్నారు. రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోతే బీఆర్ఎస్ వారి తరఫున పోరాటం చేస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమానికి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అధ్యక్షత వహించారు. నాయకులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకుడు గట్టు యాదవ్ ,గొర్రెల సహకార సంఘం మాజీ అధ్యక్షుడు కురుమూర్తి యాదవ్, వాకిటి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
———————————————————————————————————————————————————–

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *