– పోలీసుల చర్య సరికాదు
– మానవ హక్కుల వేదిక
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 2: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నగర పర్యటన సందర్భంగా, మానవహక్కుల వేదిక నగర ఉపాధ్యక్షుడు సయ్యద్ బిలాల్ను ఏడుగంటల పాటు పోలీసులు అక్రమంగా గృహ నిర్బంధంలో వుంచారని, హ్యూమన్ రైట్స్ ఫోరం ఒక ప్రకటనలో ఆరోపించింది. హోం మంత్రి కార్యక్రమం ముగిసిన తర్వాత బయటకు అనుమతిస్తామని పోలీసులు తెలిపారని పేర్కొంది. బిలాల్ ఇంటిముందు ఇద్దరు కానిస్టేబుళ్లను కాపలాగా వుంచి, అమిత్ షా వెళ్లిన తర్వాత బయటకు వెళ్లడానికి అనుమతించారని, పోలీసుల ఏకపక్ష చట్టవిరుద్ధ చర్యను ఖండిస్తున్నామని పేర్కొంది. సయ్యద్ బిలాల్కు బీజేపీతో లేదా హోం మంత్రి పర్యటనతో ఎలాంటి సంబంధం లేదని గుర్తు చేసింది. చట్టబద్ధమైన కారణాలు లేకుండా ఈ విధంగా నిర్బంధించడం ఆమోదయోగ్యం కాదంది. ఒక రాజకీయ నాయకుడి పర్యటనను, కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించాలనే కారణంతో పౌరుల ప్రాథమిక హక్కులను పోలీసులు హరించజాలరని స్పష్టం చేసింది. అధికారంలో ఉన్నవారి సౌకర్యాల కంటే రాజ్యాంగ హక్కులు, చట్టబద్ధ పాలనకే ప్రాధాన్యత ఉండాలని గుర్తు చేసింది. ఈ ప్రకటనపై సమన్వయ కమిటీ సభ్యుడు ఎస్.సంజీవ్ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. తిరుపతి, నగర ప్రధాన కార్యదర్శి సంజీవ్ సంతకాలు చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





