– మీడియా కూడా తమవంతు పాత్ర పోషించాలి
– సీజీఆర్, హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో చర్చ
– గొట్టివారిపల్లి జలసంరక్షణ విధానం అనుసరణీయం : ప్రొఫెసర్ పురుషోత్తంరెడ్డి
– సామాన్యుల జీవితాలను ప్రభావితం చేయనున్న ఉష్ణోగ్రతలు : డాక్టర్ నరసింహా రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 2: వాతావరణ మార్పుల ప్రభావాల నుంచి సామాన్యులను రక్షించేలా ప్రభుత్వాలు తక్షణ కార్యాచరణ చేపట్టాలని పర్యావరణ, ప్రజావిధాన నిపుణులు కోరారు. నీటి కొరత ఆహార సంక్షోభంగా మారకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, అందుబాటులో ఉన్న జలాలను సమానంగా పంపిణీ చేసే విధానాన్ని ప్రకటించాలని సూచించారు. వర్షపు నీటి సంరక్షణ, భూగర్భజలాల పెంపు, రైతుల సహకార వ్యవస్థలను బలోపేతం చేయడం ద్వారా గ్రామాలకు కరువును తట్టుకునే సామర్థ్యం కల్పించాలని పేర్కొన్నారు. వాతావరణ మార్పులను ఎదుర్కొనే చర్యలు, అందులో మీడియా పాత్ర అనే అంశంపై అవగాహన, అనుభవాల పరస్పర అవగాహన కార్యక్రమానికి కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషన్ (సీజీఆర్), హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ సంయుక్తంగా సోమవారం సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు . ‘కాన్ఫరెన్స్ ఆఫ్ పీపుల్ ఆన్ క్లైమేట్ చేంజ్–కోప్6’ పేరుతో ఈ సమావేశాన్నిపేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సమాచార హక్కు మాజీ కమిషనర్ ఆర్. దిలీప్‌రెడ్డి సమన్వయకర్తగా పర్యావరణవేత్త ప్రొఫెసర్ కె. పురుషోత్తంరెడ్డి, ప్రజావిధాన నిపుణుడు డాక్టర్ దొంతి నరసింహారెడ్డి, తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి, ఆర్థికవేత్త, కాలమిస్టు మోహన్ గురుస్వామి, సీనియర్ జర్నలిస్టు ములుగు సోమశేఖర్, అధ్యక్షురాలు కె. లీలా లక్ష్మారెడ్డి పాల్గొన్నారు .వాతావరణ కార్యాచరణ, మీడియా బాధ్యతలపై వివిధ రంగాల నిపుణుల అభిప్రాయాలను పంచుకునే వేదికగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. వాతావరణ మార్పుల ప్రభావాలను ఎదుర్కొనేందుకు గ్రామస్థాయిలో జల సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రముఖ పర్యావరణవేత్త ప్రొఫెసర్ కె. పురుషోత్తంరెడ్డి పిలుపునిచ్చారు. వర్షపు నీటిని ఒడిసిపట్టడం, భూగర్భజలాలను పెంపొందించడం, నేలలో తేమను కాపాడుకోవడం ద్వారా కరువును తట్టుకునే సామర్థ్యాన్ని సాధించవచ్చని తెలిపారు. ప్రతి గ్రామం గొట్టిగారిపల్లిని, ప్రతి మండలం ముల్కనూరు సహకార స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఓజోన్ పొర క్షీణత, భూతాపం పెరుగుదల, జీవవైవిధ్యం తగ్గిపోవడం, ఎడారీకరణ ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రధాన పర్యావరణ సమస్యలని పురుషోత్తంరెడ్డి వివరించారు. అంతర్జాతీయ వాతావరణ సదస్సుల నేపథ్యంలో భూతాపం, వాతావరణ మార్పులు, ఎల్‌నీనో ప్రభావాలపై విస్తృత చర్చ జరుగుతున్నదన్నారు. తెలంగాణకు కూడా ఇవి ముఖ్యమైన సవాళ్లేనని, అయితే వాటిని ఎదుర్కొనేందుకు రాష్ట్రంలోనే ఆచరణాత్మక నమూనాలు ఉన్నాయని చెప్పారు. కోహీర్ మండలంలోని గొట్టిగారిపల్లి గ్రామంలో సుమారు 25 ఏళ్ల క్రితం టి.హనుమంతరావు రూపొందించిన ‘నాలుగు జలాల భావన’ను గ్రామస్థులు చిత్తశుద్ధితో అమలు చేశారని తెలిపారు. ఇది ప్రయోగశాలకో, పరిశోధన దశకో పరిమితమైన ప్రతిపాదన కాదని, క్షేత్రస్థాయిలో ఫలితాలను అందించిన విధానమని పేర్కొన్నారు. గ్రామంలో కురిసిన వర్షపు నీటిని వృథాగా పోనివ్వకుండా నిలుపుకోవడం, భూమిలోకి ఇంకించడం ద్వారా భూగర్భజలాలను పెంచుకున్నారని వివరించారు. అదనపు నీటిని ఉపరితల జలవనరుల్లో నిల్వ చేసుకోవడంతోపాటు నేల పైపొరలో తేమను కాపాడుకున్నారని చెప్పారు. ఈ చర్యలతో గ్రామంలో సంవత్సరానికి మూడు పంటలు పండిస్తున్నారని తెలిపారు. నాడు చేపట్టిన జల సంరక్షణ పనులు నేడు గ్రామానికి కరువు నుంచి రక్షణ కల్పించే కవచంగా పనిచేస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఇలాంటి ప్రయత్నాలను ప్రతి గ్రామానికీ విస్తరించాలని సూచించారు. రైతుల సమష్టి అభివృద్ధికి ముల్కనూరు మరో ఆదర్శమని పురుషోత్తంరెడ్డి పేర్కొన్నారు. అక్కడ రైతులు సహకార స్ఫూర్తితో ఒకే వేదికపైకి వచ్చి సంఘాన్ని, బ్యాంకును ఏర్పాటు చేసుకొని ఆర్థిక పురోగతికి బాటలు వేసుకున్నారని చెప్పారు. పరస్పర సహకారంతో సాధించిన ఈ విజయం దేశంలోని ఉత్తమ సహకార నమూనాల్లో ఒకటిగా నిలిచిందన్నారు. గ్రామస్థాయిలో జల సంరక్షణకు, మండలస్థాయిలో రైతుల సహకార వ్యవస్థలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. గొట్టిగారిపల్లి జల సంరక్షణ నమూనాను, ముల్కనూరు సమష్టి కృషిని అనుసరించడం ద్వారా గ్రామాల స్వయంసమృద్ధికి, రైతుల ఆర్థిక భద్రతకు బలమైన పునాది వేయవచ్చని పురుషోత్తంరెడ్డి స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





