– మాక్ పార్లమెంట్ పీఎంగానే సంతృప్తిపడాలి
– అదే సోనియా మనస్సుకు ఊరట : అమిత్ షా
– రాష్ట్ర రాజకీయాల్లో హీట్ పెంచిన కేంద్ర హోం మంత్రి పర్యటన
(మండువ రవీందర్‌రావు)
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా పర్యటన తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెంచింది. కాంగ్రెస్ పార్టీపైన, రాహుల్ గాంధీపైన అమిత్‌షా ఘాటైన విమర్శలు చేశారు. రాహుల్‌ను ప్రధానిని చేయాలని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించవని స్పష్టం చేశారు. ఇటీవల కాంగ్రెస్‌పార్టీ దేశరాజధానిలో మాక్ పార్లమెంట్ నిర్వహించిన సందర్భాన్ని పురస్కరించుకుని రాహుల్‌గాంధీ మాక్ పార్లమెంట్‌లోతప్ప, అసలైన పార్లమెంట్‌లో ప్రధాని కాలేడనడంతో సభికులనుండి పెద్దఎత్తున స్పందన కనిపించింది. ఆవిధంగానైనా సోనియాగాంధీ హృదయం శాంతిస్తుందని పేర్కొన్న అమిత్‌షా, కాంగ్రెస్ మునుగుతున్న నావలాంటిదని, ఆ పార్టీ ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోయిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. దిల్లీలో ఓట్‌బచావ్ ఆందోళనచేస్తున్న రాహుల్, ఎప్పుడూ తనచేతిలో రాజ్యాంగాన్ని పట్టుకుని ఉంటాడని, కాని గత కాంగ్రెస్ పన్నెండేళ్ల పాలనంతా అవినీతిమయమేనన్నారు. కాని, మోదీ పదేళ్ళుగా ప్రధానిగా కొనసాగుతున్నప్పటికీ ఒక్క అవినీతి ఆరోపణరాకపోవడాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఎస్‌ఐఆర్‌పైన ఆందోళన చేస్తున్న కాంగ్రెస్‌పార్టీ కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఎలా అధికారంలోకి వచ్చిందో ఆలోచించుకోవాలన్నారు. ఎస్‌ఐఆర్ కారణంగానే బిజెపి గెలుస్తున్నదన్న ఆరోపణపై 2014, 2019లో ఎస్‌ఐఆర్‌లాంటి ప్రక్రియ ఏమీలేనప్పటికీ, ప్రజల ప్రేమాభిమానాలు మోదీని గెలిపించారన్నారు. ప్రజలకు మోదీపైనఉన్న ప్రేమ రాహుల్‌గాంధీపైలేదన్నారు. గెలిస్తే తమను ప్రజలు గెలిపించారని, ఓడితే ఈవీఎంలు సరిగా పనిచేయడంలేదని కాంగ్రెస్ ఆరోపిస్తున్నదంటూ, దానికి ఉపమానంగా నాట్యం చేయలేక స్టేజీ సరిగాలేదన్నట్లున్నదని అమిత్‌షా చలోక్తివిసిరారు. బంగ్లాదేశ్‌నుంచి వచ్చిన రోహింగ్యాలు, చనిపోయినవారంతా కలిపి కోట్లలో ఉన్నారని, వారి వోట్లను తొలగించవద్దని కాంగ్రెస్‌తోపాటు ఆ పార్టీ మద్దతుదారులు అనడాన్ని ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. దిల్లీలో కాంగ్రెస్ నేతృత్వంలో మహార్యాలి ముగిసిన మరుసటిరోజే అమిత్‌షా హైదరాబాద్‌కువచ్చి మహాపాదయాత్ర చేపట్టడం తెలంగాణ రాజకీయాల్లో పెనుమార్పులకు సంకేతంగా భావిస్తున్నారు.
ఈ సందర్భంగా ఆయన సినీ, పారిశ్రామిక, మేధావి, మీడియా ప్రముఖులను వేరువేరుగా కలువడం వెనుక బిజెపి ఏదో సీక్రేట్ ఎజండాతో ముందుకు పోతున్నదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అమిత్‌షాను కలిసినవారిలో చిరంజీవి, ఆయన కుమారుడు రామ్‌చరణ్, జూపల్లి కృష్ణారావు తదితరులున్నారు.ముందుగా ప్రకటించినట్లే దిల్లీనుండి బేగంపేట విమానాశ్రయంలో సోమవారం మధ్యాహ్నం దిగిన అమిత్‌షా నేరుగా చార్మినర్‌లోని భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని, ఐటీసీ కాకతీయలో ప్రముఖులను కలుసుకుని, బషీర్‌బాగ్‌లోని నిజాంకాలేజీ ఎదురుగాఉన్న బాబు జగ్జీవన్‌రామ్ విగ్రహం నుండి సాయంత్రం నాలుగుగంటలకు పాదయాత్రను ప్రారంభించారు. ఆయన వెంట కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కుమార్, బిజెపి రాష్ట్ర అద్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు, ఎంపిలు రఘునందన్‌రావు, ఈటల రాజేందర్, డాక్టర్ లక్ష్మయ్య, డికె అరుణ, ధర్మపురి అరవింద్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డితోపాటు పార్టీ ఎమ్మెల్యేలు, ఎంఎల్సీలు, పార్టీ ముఖ్యనాయకులున్నారు. ఈ సందర్భంగా ‘ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం..అరాచకవాదాన్ని అంతం చేద్దాం’ అన్న నినాదాలు మిన్నుముట్టాయి. అమిత్‌షా పాదయాత్ర పొడవునా బిజెపి జండాలు, కటౌట్లు, బ్యానర్లను పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. పాదయాత్ర ముగిసిన ఎంజె మార్కెట్‌వద్ద ఏర్పాటుచేసిన వేదికనుండి అమిత్‌షా ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. కాగా ఆయన ప్రసంగమంతా కాంగ్రెస్, రాహుల్‌తోపాటుగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపైనకూడా సెటైర్లు వేశారు. దిల్లీ దర్బార్‌కు తెలంగాణ ఏటిఎంగా మారిందని, ఇక్కడ జరుగుతున్న అవినీతి, అక్రమాలను నిలువరించటం కాంగ్రెస్ వల్ల అయ్యేపనికాదని, మోదీతోనే అది సాధ్యమంటూ, అందుకు బిజెపిని అత్యంత భారీ మెజార్టీతో గెలిపించేందుకు తెలంగాణ ప్రజలు శపథం తీసుకోవాలని అమిత్‌షా కోరారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





