మూడో రోజుకు చేరిన విపక్షాల ఆందోళన

– రాహుల్ గాంధీ నేతృత్వంలో ప్రతిపక్షాల సత్యాగ్రహం
– దాదాపు మూడువందల ఎంపీల మద్దతు
– సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు పట్టు
– దేశాన్ని హైజాక్ చేస్తున్నారు: రాహుల్ గాంధీ
– రాజ్‌ఘాట్ వద్ద గంటపాటు నిరసన
– సత్యాగ్రహంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
– విపక్షాల ఆరోపణలను తోసిపుచ్చిన బీజేపీ

న్యూదిల్లీ, అక్టోబర్ 8: దేశంలో ఎన్నికల ప్రక్రియ పారదర్శకత, వోటర్ల జాబితాల సవరణ, ఎన్నికల సంఘం స్వతంత్రతపై నెలకొన్న వివాదం నేపథ్యంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామాను డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి గురువారం దేశ రాజధాని న్యూదిల్లీలో ఆందోళనలను మరింత ఉధృతం చేసింది. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నాయకత్వంలో ప్రతిపక్ష ఎంపీలు మహాత్మా గాంధీ సమాధి రాజ్‌ఘాట్‌ను శాంతియుత నిరసనకు వేదికగా ఎంచుకున్నారు. వరుసగా మూడో రోజు కొనసాగిన ఈ ఉద్యమంలో దాదాపు 300 మంది ఎంపీలు భాగస్వాములయ్యారని ప్రతిపక్ష నేతలు పేర్కొన్నారు. అయితే రాజ్‌ఘాట్ వద్ద ప్రత్యక్షంగా హాజరైన ఎంపీల సంఖ్యను స్వతంత్రంగా నిర్ధారించాల్సి ఉంది. గత రెండు రోజులుగా పార్లమెంట్ స్ట్రీట్, ఆకాశవాణి భవన్, జంతర్‌మంతర్ ప్రాంతాల్లో నిరసనలు నిర్వహించడానికి ప్రయత్నించిన ప్రతిపక్ష ఎంపీలను పోలీసులు అడ్డుకోవడం, పలువురు నేతలను అదుపులోకి తీసుకోవడంతో రాజకీయ ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ నేపథ్యంలో గురువారం మహాత్మా గాంధీ సమాధి వద్ద సత్యాగ్రహం చేపట్టాలని ప్రతిపక్షాలు నిర్ణయించాయి. గత రెండు రోజుల మాదిరిగా కాక గురువారం రాజ్‌ఘాట్ వద్ద పరిమితులతో కూడిన నిరసనకు పోలీసులు అవకాశం కల్పించారు.

ప్రతిపక్ష ఎంపీల భోజన సమావేశం 

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గురువారం మధ్యాహ్నం కన్నాట్ ప్లేస్‌లోని ఒక రెస్టారెంట్‌లో ప్రతిపక్ష ఎంపీలకు ఏర్పాటు చేసిన భోజన సమావేశంలో తదుపరి ఉద్యమ కార్యాచరణపై చర్చించారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, కేసీ వేణుగోపాల్ తదితర నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.సమావేశం అనంతరం ప్రతిపక్ష నాయకులు ప్రత్యేక బస్సుల్లో రాజ్‌ఘాట్‌కు బయలుదేరారు. అక్కడ గాంధీజీ స్మారక ప్రదేశం వద్ద శాంతియుతంగా నిరసన తెలియజేయాలని నిర్ణయించారు. పెద్ద సంఖ్యలో ఎంపీలు, కాంగ్రెస్ కార్యకర్తలు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు ఈ కార్యక్రమానికి మద్దతుగా తరలివచ్చారు. ప్రతిపక్ష ఆందోళనల సందర్భంగా రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ కలిసి దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. దేశ రాజ్యాంగ వ్యవస్థలను బలహీనపరుస్తూ ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని దెబ్బతీస్తున్నారని విమర్శించారు. ఎన్నికల్లో జరుగుతున్నాయని తాము ఆరోపిస్తున్న అక్రమాలపై బాధ్యులు సమాధానం చెప్పాల్సిందేనని స్పష్టం చేశారు.దాదాపు 300 మంది ఎంపీలు శాంతియుతంగా తమ నిరసన తెలియజేయడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ పదేపదే అడ్డుకుంటున్నారని రాహుల్ పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులపై బలప్రయోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ ఆరోపణలను పోలీసులు అంగీకరించడం లేదు. రాజ్‌ఘాట్‌కు చేరుకున్న ప్రతిపక్ష ఎంపీలు మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. అక్కడ దాదాపు గంటపాటు గడిపిన అనంతరం నేతలు వెనుదిరిగారు. అంతకుముందు రాజ్‌ఘాట్ ప్రాంతంలో భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్‌ఎస్ఎస్) సెక్షన్ 163 కింద ఆంక్షలు విధించిన ఢిల్లీ పోలీసులు, చివరకు నేతల నిరసనకు పరిమితంగా అనుమతించారు.పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బందిని భారీగా మోహరించారు. రాజ్‌ఘాట్‌కు వెళ్లే మార్గాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి, డ్రోన్ల ద్వారా పరిస్థితిని పర్యవేక్షించారు. స్మారక ప్రాంగణంలో నినాదాలు, బైఠాయింపులపై పరిమితులు విధించారు. గురువారం జరిగిన ప్రతిపక్షాల కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కూడా పాల్గొనడం ప్రాధాన్యం సంతరించుకుంది. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు, కాంగ్రెస్ నాయకులు ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, మాణిక్కం ఠాగూర్, వివేక్ తంఖా, జ్యోతిమణి, రాజీవ్ శుక్లా, దీపేందర్ హుడా తదితరులు హాజరయ్యారు.తృణమూల్ కాంగ్రెస్ నుంచి అభిషేక్ బెనర్జీ, మేనకా గురుస్వామి, సమీరుల్ ఇస్లాం, సమాజ్‌వాదీ పార్టీకి చెందిన రాజీవ్ రాయ్, మొహిబుల్లా, సీపీఎం ఎంపీ జాన్ బ్రిట్టాస్, సీపీఐ నేత పి. సంతోష్, ఆర్జేడీ నేత సుధాకర్ సింగ్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.అయితే ప్రతిపక్ష కూటమిలోని అన్ని పార్టీలు సమాన స్థాయిలో పాల్గొనడం లేదు. డీఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీ ఈ మూడు రోజుల నిరసనలకు దూరంగా ఉండగా, సమాజ్‌వాదీ పార్టీ కొన్ని కార్యక్రమాల్లో పాల్గొని మరికొన్నింటికి హాజరుకాలేదు.

అసలు వివాదం ఏమిటి?

దేశవ్యాప్తంగా వోటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ) ఈ ఉద్యమానికి ప్రధాన నేపథ్యంగా మారింది. ఈ ప్రక్రియలో భారీ సంఖ్యలో వోటర్ల పేర్లు తొలగించారని, అర్హులైన పౌరుల వోటు హక్కుకు భంగం కలుగుతోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.వోటర్ల జాబితాల్లో అవకతవకలకు ఎన్నికల సంఘం చర్యలు దోహదపడుతున్నాయని, అవి అధికార బీజేపీకి రాజకీయ ప్రయోజనం కలిగించేలా ఉన్నాయని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. అయితే ఎన్నికల సంఘం ఈ ఆరోపణలను ఖండిస్తూ, మరణించినవారు, వేరే ప్రాంతాలకు వెళ్లినవారు, నకిలీ లేదా అనర్హమైన నమోదులను తొలగించేందుకే సవరణ చేపట్టినట్లు వివరిస్తోంది. ప్రతిపక్షాల రాజకీయ పక్షపాత ఆరోపణలను బీజేపీ కూడా తిరస్కరించింది.

జ్ఞానేశ్ కుమార్ తప్పుకోవాల్సిందే: సీపీఎం

ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తన పదవికి రాజీనామా చేసే వరకు నిరసనలు కొనసాగిస్తామని సీపీఎం ఎంపీ జాన్ బ్రిట్టాస్ ప్రకటించారు. శుక్రవారం కూడా ఆందోళన కొనసాగుతుందని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా రాష్ట్ర, జిల్లా, బ్లాక్ స్థాయిల్లో నిరసనలకు పిలుపునిచ్చింది. తెలంగాణలో కూడా ఉద్యమానికి మద్దతు వ్యక్తమవుతోంది. సంగారెడ్డిలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి, ఆయన సతీమణి నిర్మల బుధవారం రాత్రి నుంచి నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీనామా, ప్రజల వోటు హక్కు పరిరక్షణను వారు ప్రధాన డిమాండ్లుగా పేర్కొన్నారు.

బీజేపీ ప్రతిస్పందన

ప్రతిపక్షాల ఆరోపణలను బీజేపీ ఖండించింది. ఎన్నికల సంఘంపై చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు లేవని, రాజకీయ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ ఉద్యమాలు నిర్వహిస్తోందని బీజేపీ ప్రతినిధులు విమర్శించారు. ప్రతిపక్షాల నిరసనలు అరాచక పరిస్థితులను సృష్టించే ప్రయత్నంగా ఉన్నాయని పేర్కొన్నారు. దిల్లీ పోలీసులు కూడా తమ చర్యలను సమర్థించుకున్నారు. అనుమతులు, శాంతిభద్రతల పరిరక్షణకు సంబంధించిన నిబంధనల ప్రకారమే నిరసన ప్రదర్శనలను నియంత్రించినట్లు తెలిపారు.

ఎన్నికల సంఘం వివరణ

అక్టోబర్ 6న దాదాపు 300 మంది ఎంపీలు ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను కలవడానికి ప్రయత్నించగా అనుమతి నిరాకరించారని రాహుల్ గాంధీ ఆరోపించారు. అయితే అదే రోజు సాయంత్రం నాలుగు గంటల వరకు రాజకీయ పార్టీల అధికార ప్రతినిధుల ద్వారా ఎలాంటి అధికారిక అపాయింట్‌మెంట్ అభ్యర్థన అందలేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.2025లో అమల్లోకి తెచ్చిన విధానం ప్రకారం, రాజకీయ పార్టీలు అధీకృత ప్రతినిధుల ద్వారా ముందస్తుగా అపాయింట్‌మెంట్ కోరాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ విషయంలో కాంగ్రెస్, ఎన్నికల సంఘం మధ్య భిన్నమైన వాదనలు కొనసాగుతున్నాయి.

మూడు రోజులుగా కొనసాగుతున్న ఆందోళన

ఈనెల‌ 6న పార్లమెంట్ నుంచి ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం వైపు ప్రతిపక్ష ఎంపీలు చేపట్టిన ప్రదర్శనను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఆకాశవాణి భవన్ ప్రాంగణంలోకి ప్రవేశించి గంటల తరబడి బైఠాయించారు. చివరకు వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని అనంతరం విడుదల చేశారు. 7న జంతర్‌మంతర్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించిన ప్రతిపక్ష నాయకులను విండ్సర్ ప్లేస్ సమీపంలో పోలీసులు నిలువరించారు. అక్కడ జరిగిన నిరసనల్లో ప్రియాంక గాంధీ రాజ్యాంగ ప్రతిని చేతబట్టుకుని రోడ్డుపై బైఠాయించారు. రాహుల్ గాంధీ సహా పలువురిని మరోసారి అదుపులోకి తీసుకున్నారు.అక్టోబర్ 8న మాత్రం గాంధీజీ సమాధి వద్ద నిరసన నిర్వహించడం ద్వారా ఉద్యమాన్ని కొనసాగించారు. ఈ మూడు రోజుల పరిణామాలతో ఎన్నికల సంఘం పనితీరు, రాజకీయ పార్టీల నిరసన హక్కు, ప్రజాప్రతినిధులపై పోలీసు చర్యలు జాతీయస్థాయి చర్చనీయాంశాలుగా మారాయి. ఎన్నికల జాబితాల సవరణ, ఎన్నికల సంఘం నిర్ణయాలపై అధికార, ప్రతిపక్షాల మధ్య కొనసాగుతున్న ఈ వివాదం మరింత తీవ్రమవుతోంది. రాజ్యాంగబద్ధ సంస్థల స్వతంత్రతను, వోటు హక్కును పరిరక్షించడమే తమ ఉద్యమ లక్ష్యమని ప్రతిపక్షాలు చెబుతుండగా, ఎన్నికల ప్రక్రియపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని అధికారపక్షం విమర్శిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీనామా డిమాండ్‌తో ప్రారంభమైన నిరసనలు రాబోయే రోజుల్లోనూ కొనసాగనున్నాయి.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *