– పదేళ్ల పాలనలో అప్పుల ఊబిలోకి నెట్టారు
- దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాల అమలు
– పార్టీ పటిష్టత, ప్రచార కార్యక్రమాలపై నూతన ఇన్చార్జితో చర్చించాం
– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 23 :ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర ఆదాయాన్ని తిరిగి ప్రజలకే చేరవేస్తూ ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. గతంలో సంపద, వనరులు కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతమైతే ప్రస్తుతం ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగుతోందని పేర్కొన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ఆదాయాన్ని, వనరులను దుర్వినియోగం చేయడంతోపాటు రాష్ట్రాన్ని రూ.8.20 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టారని విమర్శించారు. హైదరాబాద్లోని గాంధీభవన్లో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ, పార్టీ తెలంగాణ ఇన్చార్జి సందీప్ కుమార్ను సోమవారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందించిశాలువాతో సత్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పార్టీ సంస్థాగత వ్యవహారాలు, భవిష్యత్ ప్రచార కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై సందీప్ కుమార్తో చర్చించినట్లు తెలిపారు. సంస్థాగత వ్యవహారాల్లో, యువజన కాంగ్రెస్లో సుదీర్ఘ అనుభవం ఉన్న సందీప్ కుమార్ సేవలు తెలంగాణ కాంగ్రెస్ కమిటీ బలోపేతానికి ఎంతగానో ఉపయోగపడతాయని భట్టి విశ్వాసం వ్యక్తం చేశారు.
పార్టీలో విభేదాల్లేవు.. క్రమశిక్షణ సహజం
పార్టీలో అంతర్గత విభేదాలున్నాయన్న ప్రచారాన్ని భట్టి ఖండించారు, ఊహాజనిత ప్రచారాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. పార్టీ పటిష్టంగా ఉందని, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యాచరణతో ముందుకు సాగుతోందని చెప్పారు. ఏ సంస్థకైనా క్రమశిక్షణ అత్యంత ముఖ్యమని, అది తమ పార్టీకి సహజమైన అంతర్భాగమని పేర్కొన్నారు. కృష్ణా, గోదావరి జలాల వినియోగంపై బీఆర్ఎస్ నాయకత్వం కావాలనే తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. తెలంగాణకు నదీ జలాల ద్వారా అత్యధిక ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వాలేనని గుర్తు చేశారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఇతర మంత్రివర్గ సహచరులతో కలిసి రాష్ట్ర ప్రయోజనాల కోసం కృషి చేస్తున్నారని తెలిపారు. గతంలో చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు బీఆర్ఎస్ నేతలు అసత్య ప్రచారాలకు దిగుతున్నారని విమర్శించారు. ప్రజలు వాస్తవాలను గమనించాలని కోరారు.
గత పదేళ్లలో రాష్ట్ర ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, స్వేచ్ఛ లేని జీవితాన్ని అనుభవించారని భట్టి అన్నారు. వనరులు దోపిడీకి గురికావడం, వ్యవస్థలు దెబ్బతినడం, ఆస్తులు ధ్వంసం కావడం వంటి పరిణామాలను ప్రజలు ప్రత్యక్షంగా చూశారన్నారు. సోనియా గాంధీ నాయకత్వంలో రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన ప్రధాన ఉద్దేశం ఇక్కడి వనరులు, ఆస్తులు, సంస్థలు ప్రజల అభివృద్ధికి ఉపయోగపడాలన్నదేనని వివరించారు. అయితే పదేళ్ల పాలనలో భారీగా అప్పులు తెచ్చి ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేశారని విమర్శించారు.
ప్రతీ కుటుంబానికి సంక్షేమ ఫలాలు
కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని వివరించారు. రైతులకు రైతు భరోసా, కోటి ఆరు లక్షల కుటుంబాలకు వ్యక్తికి ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం, 53 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 46 లక్షల కుటుంబాలకు చేయూత పింఛన్లు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 27 లక్షల మంది విద్యార్థులకు అల్పాహార పథకాన్ని అమలు చేస్తున్నామని, రోజువారీ అల్పాహారంతోపాటు వారంలో ఆరు రోజుల్లో రోజు విడిచి రోజు పాలు, రాగి జావ అందిస్తున్నామని చెప్పారు. 12 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను నేరుగా ఖాతాల్లో జమ చేస్తున్నామని వివరించారు. పేదలకు సొంతింటి కల సాకారం చేసేందుకు ఒక్కో ఇంటికి రూ.5 లక్షల చొప్పున ఎనిమిది లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి నిర్మాణ పనులు చేపట్టామని తెలిపారు. కుటుంబంలో ఎవరికైనా అనారోగ్యం కలిగితే ఏడాదికి రూ.10 లక్షల వరకు వైద్య సేవలు పొందేలా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు.
విద్య, మహిళా సాధికారతకు పెద్ద పీట
విద్యారంగంలో విప్లవాత్మక మార్పులే లక్ష్యంగా ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నామని భట్టి తెలిపారు. ఒక్కో పాఠశాలకు రూ.200 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో భవనాలు, విద్యా సదుపాయాలు, క్రీడలు, ఇతర పాఠ్యేతర కార్యకలాపాలకు అవసరమైన వసతులు కల్పిస్తున్నామని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాలణం, ఆర్థికంగా ఎదిగేందుకు స్వయం సహాయక సంఘాల మహిళలకు బ్యాంకు లింకేజీ ద్వారా ఏటా రూ.20 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు అందించే కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. రైతులకు రైతు భరోసాతోపాటు ధాన్యానికి కనీస మద్దతు ధరకు అదనంగా క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తున్నామని చెప్పారు.
ప్రజల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ప్రాధాన్యం
రాష్ట్రానికి వచ్చే ఆదాయం, ప్రజలు చెల్లించే పన్నుల ద్వారా సమకూరే నిధులను తిరిగి ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ఖర్చు చేస్తున్నామని స్పష్టం చేశారు. గతంలో ఇంతకంటే ఎక్కువ ఆదాయం, అప్పులు ఉన్నప్పటికీ ఈ స్థాయిలో సంక్షేమ పథకాలు ఎందుకు అందించలేదని ప్రశ్నించారు. రాష్ట్ర సంపదను ప్రజలకు పంచుతూ, పేద కుటుంబాల జీవన ప్రమాణాలను పెంచడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు. బీఆర్ఎస్ పాలనలో జరిగిన విధ్వంసాన్ని సరిచేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని చెప్పారు. ప్రజలు గత పాలనను, ప్రస్తుత ప్రభుత్వ పనితీరును బేరీజు వేసుకుంటున్నారని, గతంలో మాదిరిగా రాష్ట్రాన్నిమళ్లీ దోపిడీ పాలనలోకి నెట్టేందుకు ప్రజలు సిద్ధంగా లేరని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
ప్రజాస్వామ్య పరిరక్షణ గురించి బీజేపీ మాట్లాడటం హాస్యాస్పదం
ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాం అంటూ పాదయాత్రలు చేపట్టి బీజేపీ తనను తానే అపహాస్యం చేసుకుంటోందని భట్టి విక్రమార్క అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పాదయాత్రలు చేపడుతున్నామంటూ చేస్తున్న ప్రచారాన్ని ఆ పార్టీ, అధ్యక్షుడు నితిన్ నబిన్ నిలిపివేయాలని హితవు పలికారు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. కరీంనగర్లో బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్ చేపట్టిన ‘లోక్తంత్ర బచావో.. అరాచకత హటావో’ పాదయాత్రపై స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తున్నది బీజేపీయేనన్న విషయం దేశ ప్రజలందరికీ తెలుసన్నారు. రాజ్యాంగాన్ని బలహీనపరచడంతో పాటు దానిని మార్చి ప్రజాస్వామ్య వ్యవస్థను తమ నియంత్రణలోకి తీసుకురావాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. దేశం మొత్తాన్ని తమ గుప్పిట్లో పెట్టుకోవాలన్నదే బీజేపీ లక్ష్యమని, ప్రజాస్వామ్యానికి బదులు ఒక రకమైన రాచరిక పాలనను తీసుకురావాలని చూస్తోందని విమర్శించారు. దేశ ప్రజల ప్రజాస్వామ్య హక్కులను, ఓటు హక్కును పరిరక్షించేందుకు కాంగ్రెస్ పార్టీతోపాటు దేశ ప్రజలు పోరాటం చేస్తున్నారని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





