– రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక చొరవతో రూ.17.68 కోట్ల సాయం
– 214 మందికి రూ.5.59 కోట్ల ఆర్థిక సాయం పంపిణీ
– 824 మంది లొంగుబాటు
– ఆరోగ్య కార్డులు, ఇళ్లు, ఉపాధి శిక్షణతో అండగా ప్రభుత్వం
– మిగిలిన ముగ్గురు మావోయిస్టులూ లొంగిపోవాలి
– డీజీపీ ఆనంద్
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబరు 23: జనజీవన స్రవంతిలో కలిసిన మావోయిస్టులకు పునరావాసం కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతోంది. లొంగిపోయిన వారికి ఆర్థిక సాయం, ఆరోగ్య భద్రత, నివాస వసతి, ఉపాధి అవకాశాలు కల్పిస్తూ సాధారణ జీవితం గడిపేందుకు అండగా నిలుస్తుందన్నారు డిజిపి సివి ఆనంద్. డిజిపి కార్యాలయంలో సోమవారం లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం, తాత్కాలిక ఆర్థిక సహాయానికి సంబంధించిన కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. ఇందులో భాగంగా 214 మందికి రూ.5 కోట్ల 59 లక్షల 50 వేల నగదు రివార్డులు, పునరావాస ఆర్థిక సాయాన్ని డిజిపి చేతుల మీదుగా పంపిణీ చేశారు.మీడియా సమావేశంలో డిజిపి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్చి 31 లక్ష్యానికి అనుగుణంగా ఆపరేషన్ కగార్ నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లో భద్రతా బలగాలు చేపట్టిన చర్యలతో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారు. జార్ఖండ్, ఒడిశా, మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల్లో ఈ పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణలో ఇప్పటివరకు మొత్తం 824 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో తెలంగాణకు చెందినవారు 59 మంది, ఛత్తీస్‌గఢ్‌కు చెందినవారు 754 మంది, ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు తొమ్మిది మంది, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలకు చెందినవారు ఒక్కొక్కరు ఉన్నట్లుగా వివరించారు.
ఇప్పటివరకు రూ.17.68 కోట్ల పంపిణీ
లొంగిపోయిన మావోయిస్టులకు తక్షణ అవసరాల నిమిత్తం ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున తాత్కాలిక ఆర్థిక సాయం అందించామని డిజిపి తెలిపారు. వారి ప్రభుత్వ రివార్డులకు అనుగుణంగా మిగిలిన ఆర్థిక సాయాన్ని దశలవారీగా అందిస్తున్నామన్నారు. ఇప్పటివరకు 755 మందికి రూ.22,31,85,000 నగదు రివార్డులు మంజూరు చేయగా, వివిధ దశల్లో అందించిన సాయంతో కలిపి ఇప్పటివరకు జనజీవన స్రవంతిలోకి వచ్చిన మావోయిస్టులకు మొత్తం రూ.17 కోట్ల 68 లక్షల 35 వేల నగదు పంపిణీ చేసినట్లు వివరించారు.ఆధార్ కార్డులు లేకపోవడంతో పలువురికి బ్యాంకు ఖాతాలు తెరవడం ఇబ్బందిగా మారిందని, ఈ సమస్యను పరిష్కరించేందుకు తెలంగాణ ఎస్ఐబీ అధికారులు ఛత్తీస్‌గఢ్ పోలీసులతో సమన్వయం చేసుకుని బ్యాంకు ఖాతాల ఏర్పాటుకు కృషి చేశారని తెలిపారు.
ఆరోగ్య భద్రత.. నివాస వసతి
లొంగిపోయిన వారికి ఆరోగ్య భద్రత కల్పించేందుకు 59 ఆరోగ్య రక్షణ కార్డులు అందించామని డిజిపి పేర్కొన్నారు. ఉచిత వైద్య చికిత్స అందించడంతోపాటు నిమ్స్, వారి వారి ప్రాంతాల్లో ఉన్న ఆసుపత్రుల్లో అవసరమైన వైద్య సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. నివాస వసతి కింద తెలంగాణకు చెందిన పది మందికి ఇళ్లు మంజూరు పూర్తికాగా, మరో 49 మందికి ఇళ్లు కల్పించనున్నట్లు చెప్పారు. కొంతమంది లొంగిపోయిన మావోయిస్టులు మారుమూల ప్రాంతాల్లో ఉండటం వల్ల పునరావాస సాయం అందించడంలో జాప్యం జరిగిందన్నారు. ఎస్ఐబీ అధికారులు నేరుగా వారి వద్దకు వెళ్లి వివరాలు సేకరిస్తున్నారని తెలిపారు. గత ఆగస్టులో వరంగల్ పర్యటన సందర్భంగా కూడా లొంగిపోయిన మావోయిస్టు కేడర్‌తో మాట్లాడి వారి అవసరాలు, ఆశయాలు తెలుసుకున్నానని వెల్లడించారు.
ఉపాధి అవకాశాలకు ప్రాధాన్యం
అడవుల్లో జీవించిన వారికి సాధారణ జనజీవనంపై అవగాహన కల్పించడంతోపాటు వారి అభిరుచులకు అనుగుణంగా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని డిజిపి చెప్పారు. కార్పెంటర్, ప్లంబర్, ఎలక్ట్రీషియన్ వంటి వృత్తుల్లో నైపుణ్య శిక్షణ అందిస్తామని తెలిపారు. భవిష్యత్తులో ఆటోలు, ట్రాక్టర్లు నడిపేందుకు డ్రైవింగ్ శిక్షణ కూడా కల్పిస్తామన్నారు. జిల్లాల ఎస్పీలు, పోలీసు కమిషనర్లు వ్యక్తిగతంగా లొంగిపోయిన వారితో సంప్రదింపులు జరుపుతూ, వారు తిరిగి తప్పుడు మార్గంలో వెళ్లకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని వివరించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగం కల్పించిన హక్కులు, పరిమితులకు లోబడి రాజకీయ, ప్రజా కార్యకలాపాల్లో పాల్గొనవచ్చని స్పష్టం చేశారు. అయితే మావోయిస్టు సిద్ధాంతాల ప్రచారాన్ని ప్రభుత్వం సహించబోదని తెలిపారు.
భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం
మావోయిస్టుల నుంచి పెద్ద సంఖ్యలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు డిజిపి వెల్లడించారు. 2026 నాటికి తెలంగాణ -ఛత్తీస్గడ్ సరిహద్దులోని కర్రగుట్ట ప్రాంతంలో మొత్తం తొమ్మిది ఆయుధాల డంపులు గుర్తించగా, వాటిలో 252 తుపాకులు, 359 బీజీఎల్ సెల్స్, నాలుగు ఎల్ఎంజీలు, 48 ఏకే-47 తుపాకులు లభించాయని తెలిపారు. కర్రెగుట్ట ప్రాంతంలో భారీగా పేలుడు పదార్థాలు, ల్యాండ్మైన్లు ఉన్నాయని, సీఆర్పీఎఫ్, ఛత్తీస్‌గఢ్ డీఆర్జీ బలగాల సమన్వయంతో ల్యాండ్మైన్లను జాగ్రత్తగా వెలికితీసి నిర్వీర్యం చేసే చర్యలు కొనసాగుతున్నాయన్నారు. భద్రతా కారణాల దృష్ట్యా ప్రస్తుతం పర్యాటకులకు ఆ ప్రాంతంలో అనుమతి ఇవ్వడం లేదని, ల్యాండ్మైన్ల తొలగింపు పూర్తయిన తర్వాతే దీనిపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.
మిగిలిన ముగ్గురూ లొంగిపోవాలి
ఇంకా ముగ్గురు మావోయిస్టు కీలక నేతలు లొంగిపోవాల్సి ఉందని డిజిపి తెలిపారు. కేంద్ర కమిటీ సభ్యుడు ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతితోపాటు మరో ఇద్దరు లొంగిపోయి సాధారణ జీవితం గడపాలని కోరారు.లొంగిపోయిన వారు తిరిగి మావోయిస్టు కార్యకలాపాల వైపు వెళ్లకుండా నిరంతర నిఘా, సంప్రదింపులు, పర్యవేక్షణ కొనసాగిస్తామన్నారు. గతంలో ఈ ప్రాంతాల్లో ప్రాంతాల్లో పాఠశాలలు, ఆసుపత్రుల గురించి కూడా తెలియని పరిస్థితులు ఉండేవని, ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ఆ ప్రాంతాల్లో మార్పు వస్తోందని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పది రాష్ట్రాల్లో ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాయని వివరించారు. గ్రేహౌండ్స్‌లోని సిబ్బందిని అవసరాలకు అనుగుణంగా పునర్వ్యవస్థీకరించి, కొంతమందిని టీ-మార్స్, పార్కింగ్, ట్రాఫిక్ నిర్వహణ వంటి విభాగాలకు కేటాయించిన విషయాన్ని డిజిపి గుర్తుచేశారు. తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి అందిస్తున్న ఆర్థిక సాయం, పునరావాస సదుపాయాలను సద్వినియోగం చేసుకుని లొంగిపోయిన వారంతా చట్టబద్ధమైన జీవితం గడపాలని డిజిపి ఆకాంక్షించారు. జనజీవన స్రవంతిలో కలిసిన వారికి గౌరవప్రదమైన జీవితం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




