మోదీ గద్దె దిగు.. లేకుంటే ప్రజలే దింపుతారు

– 13 కోట్ల ఓట్ల గల్లంతు ఎలా సాధ్యం?
– దళితులు, మైనారిటీలు, ఆదివాసీల ఓట్ల తొలగింపు వెనుక కుట్ర
– ఈడీ, ఐటీ, సీబీఐ దాడులు బీజేపీ ప్రభుత్వాన్ని రక్షించలేవు
– ఓటు బచావో.. దేశ్ బచావో ప్రదర్శనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

దిల్లీ, అక్టోబర్ 8 : ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకుని దొడ్డిదారిన అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తే ప్రజలు తిరుగుబాటు చేస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఈడీ, ఆదాయపు పన్ను శాఖ, సీబీఐ దాడులు ఇకపై బీజేపీ ప్రభుత్వాన్ని ఏమాత్రం రక్షించలేవన్నారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెంటనే భర్తరప్ చేయాలని డిమాండ్ చేశారు. అలా చేయకుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన గద్దెను ఖాళీ చేయాలని, లేకపోతే ప్రజలే ఆయనను గద్దె దించుతారని రేవంత్‌రెడ్డి అన్నారు. ఓటు బచావో.. దేశ్ బచావో ఉద్యమంలో భాగంగా విపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ సీనియర్ నేతలు ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, ఇండి కూటమి నేతలు మహాత్మా గాంధీ సమాధి రాజ్‌ఘాట్ వరకు గురువారం ప్రదర్శన నిర్వహించారు. రాజ్‌ఘాట్ వద్ద నివాళుల అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ఈ ఉద్యమం కాంగ్రెస్ పార్టీ పోరాటం కోసమో, ఇండి కూటమి కోసమో కాదని, దేశంలోని సామాన్యుల హక్కుల పరిరక్షణ ఉద్యమమని అన్నారు. 2014 ఎన్నికల నాటికి దేశంలో 81 కోట్ల మంది ఓటర్లు ఉంటే 2019 నాటికి ఆ సంఖ్య 91 కోట్లకు చేరిందని సీఎం గుర్తు చేశారు. 2024 నాటికి 97 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. దేశ జనాభా 140 కోట్లకు చేరుకుందని, ఓటర్ల సంఖ్య మరింతగా పెరగాల్సింది పోయి ఏకంగా 13 కోట్ల ఓట్ల గల్లంతు అయ్యాయని, అవి ఎలా తగ్గిపోయాయో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు. మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్, భగత్ సింగ్ వంటి వారు ప్రాణాలకు తెగించి పోరాడి స్వాతంత్య్రం తెచ్చారని సీఎం అన్నారు. సంపన్నులు, పేదలు తేడా లేకుండా డాక్టర్ అంబేడ్కర్ ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించారన్నారు. ఇప్పటివరకు ‘సర’ ఎన్నిసార్లు జరిగినా పేదల ఓట్లకు ముప్పు కలగలేదన్నారు. ఇప్పుడు మాత్రం రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును అణగారిన వర్గాల నుంచి గుంజుకునేందుకు ప్రధానమంత్రి మోదీ, సీఈసీ జ్ఞానేష్ కుమార్ ప్రయత్నిస్తున్నారని సీఎం ఆరోపించారు. ఎన్నికల సంఘం తప్పులను ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నేతలపై పోలీసులతో దాడులు చేయించడం, ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన నేతలను ఎన్నికల సంఘం కలవకపోవడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని సీఎం మండిపడ్డారు. కులం, మతం, ప్రాంతం, భాషల పేరుతో దేశ ప్రజలను విభజించి బీజేపీ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. దేశ ప్రజలను ఓటు ఉన్నవాళ్లు, ఓటు లేనివాళ్లుగా, రెండు వర్గాలుగా విభజిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీకి అనుకూలంగా ఉన్న వాళ్లు ఒకవైపు, వ్యతిరేకంగా ఉన్న పేదలు మరో వైపు అన్నట్లుగా మోదీ, జ్ఞానేష్ కుమార్ పరిస్థితులను మార్చారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా తీర్పునిచ్చే దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, మైనారిటీ ఓట్లను లక్ష్యంగా చేసుకుని వారి ఓట్లను తొలగిస్తున్నారని ఆరోపించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *