జన‌గాం మెడిక‌ల్ కాలేజీ ప్రారంభోత్స‌వానికి ఏర్పాట్లు చేయాలి

– ఆరోగ్య శాఖ మంత్రి దామోద‌ర్ ఆదేశం

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 23 : జనగాం మెడికల్ కాలేజీ భవనం, క్రిటికల్ కేర్ బ్లాక్ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలని ఉన్నతాధికారులకు మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు. కరీంనగర్ మెడికల్ కాలేజీ, హాస్టల్స్‌, సిద్ధిపేట టీచింగ్ హాస్పిటల్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, హుస్నాబాద్ ఏరియా హాస్పిటల్ నిర్మాణ పనులను వేగ‌వంతం చేయాల‌ని కూడా ఆదేశించారు. ఆయా భవనాల నిర్మాణ పురోగతిపై స‌చివాల‌యంలో మంత్రి సోమ‌వారం సమీక్షించారు. జనగాం మెడికల్ కాలేజీ, క్రిటికల్ కేర్ బ్లాక్ నిర్మాణ పనులు పూర్తయ్యాయని, సుమారు రూ.154 కోట్లు వెచ్చించి అత్యాధునిక వసతులతో ఈ భవనాలను ప్రభుత్వం నిర్మించిందని అధికారులు వివరించారు. కాలేజీ, సీసీబీ భవనాల ప్రారంభోత్సవానికి వెంటనే ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. కరీంనగర్ మెడికల్ కాలేజీ, హాస్టల్ భవనాల నిర్మాణ పనులు ఆలస్యం అవుతుండడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నెల చివరికల్లా గర్ల్స్‌ హాస్టల్, డిసెంబర్ చివరికల్లా బాయ్స్‌ హాస్టల్‌ను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చి చివరి నాటికి మెడికల్ కాలేజీ భవనాన్ని సైతం విద్యార్థులకు అందుబాటులోకి తేవాలని మంత్రి ఆదేశించారు. సిద్ధిపేట టీచింగ్ హాస్పిటల్ నిర్మాణ పనులను వేగ‌వంతం చేసి మార్చి చివరి వారంలో ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలన్నారు. సిద్ధిపేట మెడికల్ కాలేజీ, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, నర్సింగ్ కాలేజీ, ఆయుష్ హాస్పిటల్‌ తదితర సంస్థలకు మాజీ మంత్రి, దివంగత అనంతుల మదన్‌ మోహన్‌ పేరు పెడుతూ ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా వెంటనే ఆయా సంస్థల బోర్డులు మార్చాలని, ప్రభుత్వ రికార్డులు, వెబ్‌సైట్లలోనూ పేరును అప్‌డేట్ చేయాలని జిల్లా కలెక్టర్‌‌కు, ఆరోగ్య శాఖ అధికారులకు మంత్రి సూచించారు. వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ పెండింగ్ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధం చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. హుస్నాబాద్‌ ఏరియా హాస్పిటల్‌ను వంద బెడ్ల నుంచి 250 బెడ్లుగా అప్‌గ్రేడ్ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం, రూ.82 కోట్లతో నూతన భవన నిర్మాణ పనులు చేపట్టింది. ఈ పనులను వేగంగా పూర్తి చేయించి, ప్రజలకు అందుబాటులోకి తేవాలని బీసీ సంక్షేమ‌, ర‌వాణా శాఖ‌ల మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు సూచించారు. హుస్నాబాద్‌లో మెడికల్ పీజీ కాలేజీని సైతం ఏర్పాటు చేయనున్నట్టు ఆరోగ్య శాఖ మంత్రి రాజనర్సింహ గుర్తు చేశారు. తమ పరిధిలోని మెడికల్ కాలేజీలు, హాస్పిటళ్లు, హాస్టళ్ల నిర్మాణ పనులు, ఇతర అంశాలపై రెగ్యులర్ సమీక్షలు జరపాలని, ప్రతి వారం తనకు నివేదిక అందజేయాలని కలెక్టర్లను మంత్రి దామోద‌ర్ ఆదేశించారు. స‌మీక్ష‌లో ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తు, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ ముషారఫ్ అలీ ఫరూఖీ, డీఎంఈ వాణి, అకాడమిక్ డీఎం రమాదేవి, కరీంనగర్, వరంగల్, సిద్ధిపేట్, జనగాం కలెక్టర్లు చిత్రా మిశ్రా, సత్య చంద్రిక, హైమావతి, సందీప్ కుమార్ ఝా, ఆర్‌‌ అండ్ బీ, ఆరోగ్య శాఖల ఉన్నతాధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *