ఒక పాపి వందమంది పుణ్యాత్ములు!

  -బమ్మిడి జగదీశ్వరరావు

బ్రహ్మయ్య కొయ్యబారిపోవడం చూసిన సరస్వతమ్మ ‘యేమయిందండీ’ అని ఆందోళనగా అడిగింది. ‘వీళ్ళను నేనే పుట్టించానా?’ అన్నాడా దేవదేవుడు గొంతు తడారిపోతుండగా, నేల చూపులు చూస్తూ. మగని చూపులవెంట నేలమీదకు చూసింది సరస్వతమ్మ. బ్రహ్మయ్య కాలచక్రాన్ని రవ్వంత వెనక్కి జరిపాడు.

కథ వెనక్కి వచ్చింది. మొదలైన దగ్గరికి!

ఎండ వొంట్లోని నీటిని చెమట రూపంలో తోడేసిందేమో యెంత గుటకలు వేసి వుమ్ము మింగినా దాహం తీరలేదు. పైగా గొంతు తడారిపోతోంది. కళ్ళు తిరుగుతున్నాయి. అందుకే గ్లాసుడు నీళ్ళని తీసుకొని తాగాడు వొక నరమానవుడు. తోటి నరమానవులు తొంగి చూశారు. ఆ నరమానవుడి జాతీ జాతకమూ తెలిసిపోయింది. ‘జాత్తక్కువ నాకొడకా’ అని అపవిత్రం చేసినందుకు అవమానంతో దండన విధించారు. పిడిగుద్దులు గుద్దారు. చెప్పు తీసుకు కొట్టారు. దుడ్డుగర్రలతో చితకబాదారు. తాగిన నీళ్ళు కక్కలేదు కాని రక్తం కక్కాడు.

నేలని కరచుకొని ఆ నరమానవుడు యెగశ్వాసతో ‘వుక్… వుక్…’ అని బెక్కుతున్నాడు.

‘ప్రాణం పోతోంది’ ఆదుర్దాగా అన్నాడు ముదరమనిషి, అంతవరకు నిమ్మళంగా చూసినా.

‘శివ శివ’ అని మరెవరో, ‘పాపం’ అన్నారు అప్రయత్నంగా.

‘ఎవరికీ?’ అని యింకెవరో అన్నారు, అనుమానంగా.

చితక్కొట్టి పడేసిన వాళ్ళముఖాల్లో రవ్వంత చింతని చూసిన సరస్వతమ్మ ముఖంలో చింతాకంత ఆశ చిగురించింది.

సరిగ్గా అప్పుడే ‘ప్రాణం పోతోంది, గొంతులో నీళ్ళుపొయ్యండి’ అన్నాడు ముదర మనిషి. వంత పలుకుతూ మరికొంత మంది అదేమాట అన్నారు.

కొన ప్రాణం కొట్టుకుంటోంది.

చేతిలో చెప్పులూ కర్రలూ పట్టినవాళ్ళ పిడికిళ్ళలో వాటి స్థానంలో పాపభీతి.

‘వాడి గొంతులో నీళ్ళు పొయ్యండి, పుణ్యం వస్తుంది’

ఆ మాట వింటూనే తాము చేసిన పాపానికి విరుగుడుగా పోటీపడి బిందెలతో బకెట్లతో నీళ్ళు తెచ్చి మరీ ముఖాన పోశారు. కాదు, కొట్టారు. నేలని కరచుకున్న దేహం చుట్టూ నీళ్ళతో గొయ్యిలా అయిపోయింది. నీటి మడుగులో ప్రాణం. కొన వూపిరి కొనలే పోసుకుందో వూపిరే వదిలేస్తోందో తెలీడం లేదు. నీళ్ళు పోయడం ఆపకపోవడంతో యెగశ్వాస యెక్కువైంది. కాదు, నీటి గుంటలో పడి వూపిరి ఆడక చనిపోయాడు.

‘చేసిన పాపాన్ని పుణ్యంగా మార్చుకున్నారు’ అన్నాడో అనుకున్నాడో అది చూసిన వో సన్యాసి.

ఆ మాటవిని అమ్మా అయ్యా ముఖాముఖాలు చూసుకున్నారు.

‘ఇప్పుడు భగవంతుడు కూడా హర్షిస్తాడు’ అని లోలోపల అనుకుంటున్న నర మానవుల మనసుల్ని చదివేసిన సరస్వతమ్మ కళ్ళు తిరిగి పడిపోయింది. ఆమె ముఖాన నీళ్ళు చిలుకరించి తనూ నెత్తిమీద నీళ్ళు పోసుకున్నాడు బ్రహ్మయ్య.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *