చెకుముకి రవ్వలు: డా. కె. దివాకరాచారి

దేశం తాకట్టులో ఉందనేది

నిన్నటి తరిమెల* మాట

దోచుకుంటూ అమ్ముకుంటూ

దివాలా తీసిందనేది నేటి నిజభారతం

విద్య వైద్యం రవాణా బాంకింగ్

అన్నిరంగాలను వ్యాపారం చేసి

వ్యవసాయాన్ని దళారుల గుప్పిట అందించి

రైతు బ్రతుకు చిందరవందర పరచి

అడవుల్ని కొండల్ని ఆక్రమించి

ఆదివాసీల జీవనాన్ని అస్తవ్యస్తం చేసి

ఖనిజాల దోపిడీకి పెట్టుబడి వర్గాలకు

దారులు తెరిచిన వ్యవస్థ

నేడు శాస్త్ర రంగాన్ని కూడా

కార్పొరేట్ శక్తులకు దాసోహంచేసి

ఆకాశాన్ని అంతరిక్షాన్ని అమ్మకానికి

పెట్టిన అధ్వాన్నస్థితిలో

జల్ జంగల్ జమీన్ దోపిడీలకి

వ్యతిరేకంగా జరిగే పోరాటాలకు

ఆకాష్ ఔర్ అంతరిక్ష్ కూడా తోడైంది

ఆవురారుమంటూ దోపిడీ భూతం

వెయ్యి కాళ్ళ జెర్రిలా

దేశసంపదను కబళిస్తూ విర్రవీగుతోంది

మరోప్రక్క  ప్రతిభను వంచించేలా

ప్రశ్నాపత్రాల అమ్మకాలు

మార్కెట్లో వేలం వేస్తున్న

దౌర్భాగ్యపు వ్యాపార నిర్లజ్జా విద్యావ్యవస్థలో

ఉద్యోగాలు ఎండమావులై నిరుద్యోగ ఎడారిలో

యువత అల్లాడిపోతున్న దైన్యం

దేశ భవిత తరగతి గదిలో

రూపుదిద్దుకోవాలని కలగన్న

స్వాతంత్ర్య కాంక్ష కల్లలై

విద్యను కాషాయీకరిస్తూ

మత సామరస్యానికి తిలోదకం అర్పించి

స్వచ్ఛ స్వేచ్ఛా హృదయాలను

కలుషితపరిచే కుతంత్రంతో

ప్రైవేట్ పొత్తిళ్ళకు చదువును దారాదత్తం చేసి

ఎదిగే మెదళ్ళలో అజ్ఞానం

ఉగ్గుపాలను నింపాలనుకునే

కుహనాకుట్రలను కనిపెట్టి

మేల్కొన్న అశేష అక్షర కీటకసైన్యం

నిజమెరిగి నిగ్గతీసి అన్యాయం అంటూ

ప్రశ్నిస్తూ అధికారం గుండెలో

అలజడి ఆయుధాన్ని ఝళిపిస్తే

పునాదులు కదిలి  దగుల్బాజీ రాజకీయం

తలవంచి దిగివచ్చిన రాజ్యం

కాగితప్పులులేనని తేలిపోయింది

ప్రతి ప్రతిఘటన చీకటి వ్యవస్థ గుండెలో

రగిలే చెకుముకి నిప్పు రవ్వలేననే

చరిత్రపాఠం మరవొద్దు

( కామ్రేడ్ తరిమెల నాగిరెడ్డి)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *