సీమవెతలను రూపుకట్టిన కథకుడు

చెమ్మ : వారాల ఆనంద్

ఒక ప్రాంతపు మట్టిని పట్టుకుని విశ్వ మానవుడి హృదయాన్ని తాకడమే ప్రాంతీయ కథ అసలుశక్తి. ప్రాంతీయత అన్నది దానివేర్లు అయితే విశ్వజనీనత విస్తరించిన కొమ్మలు. వేర్లు ఎంత లోతుగా ఉంటేనే కదా కథ ప్రపంచంలోకి ప్రయాణించగలదు. తెలుగు కథా సాహిత్యాన్ని సమగ్రంగా అర్థం చేసుకోవాలంటే ప్రాంతీయ కథను పక్కనపెట్టి చూడలేం. ఎందుకంటే తెలుగుకథకు అసలైన జీవం అనేకప్రాంతాల మట్టి, మనుషులు,  మాండలికాలు, వృత్తులు, సంస్కృతులు, సామాజిక సంఘర్షణల నుంచే వచ్చింది. భూమి భాష  జీవితం ఈ మూడింటినీ నిజాయితీగా పట్టుకున్న ప్రాంతీయ కథ కేవలం ఒక ప్రాంతపు సంస్కృతిని కాపాడటమే కాదు తెలుగు సాహిత్యపు వైవిధ్యాన్ని, జీవన వైశాల్యాన్ని, చివరికి విశ్వమానవ అనుభవాన్ని విస్తరిస్తుంది. నిజానికి ఏ ప్రాంతమయినా కథకు చిరునామా మాత్రమే, మనిషే దాని అసలు ప్రపంచం.

ఆ దిశలో కేతు విశ్వనాథరెడ్డి కథలు రాయలసీమ జీవితానికి అద్దం పట్టిన కథలు. ఆయన కథలు ఆ మట్టిమీది  మనుషుల అంతరంగాన్ని, వారి ఆకలిని, ఆశలను, కరువును, కక్షలను, అక్కడ మారుతున్న సామాజిక సంబంధాలను లోతుగా దర్శించిన కథలు. ఆయనకు సీమ కేవలం ప్రాంతం కాదు ఆయనకు అది ఒక జీవన అనుభవం, ఒక సామాజిక చరిత్ర, ఒక మానవ వేదన. ఆయనకు రాయలసీమ ఒక ప్రాంతం మాత్రమే కాదు, జీవన అనుభవం, సామాజిక చరిత్ర, మానవ వేదన. గొప్ప ప్రాంతీయ రచయిత యొక్క గొప్పతనం అతను తన ప్రాంతం నుంచి బయటకు రావడంలో కంటే తన ప్రాంతాన్ని అయన అత్యంత లోతుగా చూడడంలో ఉంది. చివరికి ఆ దృష్టికోణం సమస్త మానవ జీవితానికి అద్దంగా మారిన తీరులో ఆ గొప్పదనం నిలిచి ఉంటుంది. కేతు విశ్వనాథరెడ్డి తనరచనల్లో అదే చేశారు. ఆయన కథల్లో ప్రాంతంగా రాయలసీమ ఉంది. అంతేకాదు అక్కడి రైతు ఉన్నాడు. అక్కడి కూలీ, స్త్రీ,  భూమి, ఆకలి, అధికారం, కరువు, ప్రతిఘటన ఉన్నాయి. వీటన్నింటి కంటే ముఖ్యంగాబతుకును అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న మనిషి ఉన్నాడు. అందుకే కేతు విశ్వనాథరెడ్డి కథలను చదవడం అంటే కేవలం రాయలసీమ అనే ఒక ప్రాంతాన్ని చదవడం కాదు, సమాజపు లోపలి చరిత్రను చదవడం. అందుకే కేతు విశ్వనాథ రెడ్డి సీమ వెతలను కళ్లకుకట్టి, ఆ వెతల్లోని మానవత్వాన్ని పాఠకుల హృదయానికి హత్తుకునేలా రాసిన మహత్తర వాస్తవిక కథకుడు.

కేతు విశ్వనాథరెడ్డి 1939 జూలై 10న కడపజిల్లా ఎర్రగుంట్ల మండలంలోని రంగశాయిపురంలో నాగమ్మ, వెంకటరెడ్డి దంపతులకు వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరులో విద్యాభ్యాసం చేసి, 1955లో కడప ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ, అనంతరం శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో తెలుగు ఎం.ఏ. పూర్తి చేశారు. ఆచార్య జి.ఎన్.రెడ్డి పర్యవేక్షణలో కడపజిల్లా గ్రామనామాలపై పరిశోధన చేసి డాక్టరేట్ పొందారు.1962 ఆగస్టు 2న పద్మావతితో వివాహం జరిగింది.

పాత్రికేయుడిగా వృత్తిజీవితం ప్రారంభించి, 1962–1976 మధ్య కడప, శ్రీకాళహస్తి, కందుకూరులో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో తెలుగు అధ్యాపకుడిగా పనిచేశారు. తరువాత శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో, అనంతరం డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగా, ఆచార్యుడిగా, డైరెక్టర్‌గా సేవలందించారు. ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాల సంపాదకుడిగానూ, ‘ఆంధ్రరత్న’, ‘ఈనాడు’, ‘ఆంధ్రభూమి’, ‘ఆంధ్రజ్యోతి’ పత్రికలతోనూ అనుబంధం కలిగి ఉన్నారు. ఉద్యోగ విరమణ అనంతరం ‘ఈ భూమి’కి సంపాదకత్వం వహించారు. కేంద్ర సాహిత్య అకాడమీ జనరల్ కౌన్సిల్, నేషనల్ బుక్ ట్రస్ట్ తెలుగు సలహామండలి లోనూ సేవలందించారు.

కాలేజీ రోజుల్లోనే ‘అమ్మ’ కథ రాసిన ఆయన తొలికథ 1963లో ‘అనాది వాళ్లు’. దాదాపు వంద కథలు రాసిన ఆయన ‘జప్తు’, ‘ఇచ్చాగ్ని’ వంటి సంపుటాల ద్వారా విశేష గుర్తింపు పొందారు. తరువాత ‘కేతు విశ్వనాథరెడ్డి కథలు’ పేరుతో రెండు సంపుటాలు వెలువడ్డాయి.

‘వాన కురుస్తే’, ‘జప్తు’, ‘సానుభూతి’, ‘వెనకా ముందూ’, ‘పీర్ల సావిడి’, ‘గడ్డి’, ‘కూలిన బురుజు’, ‘స్వస్తి’, ‘విరూపం’, ‘పొడి నిజం’, ‘నిజం కాని ఒక్క నిజం’ వంటి కథల్లో రాయలసీమ గ్రామీణజీవిత పరిణామాలను, కరువు, కక్షలను, సామాజిక వైరుధ్యాలను సజీవంగా ఆవిష్కరించారు. ఆయన కథల్లో కరువు కేవలం వర్షాభావం కాదు, అవకాశాల, భద్రత, న్యాయం, సంబంధాల కొరత కూడా. ఫ్యాక్షన్ కేవలం హింస కాదు, దాని వెనుక ఉన్న భూమి, కులం, ఆర్థిక అసమానత, అధికార నిర్మాణాలను ఆయన ఆవిష్కరించారు. రాయలసీమ మాండలికాన్ని అలంకారంగా కాకుండా పాత్రల జీవన స్వభావాన్ని వ్యక్తం చేసే సహజమైన భాషగా మలిచారు. స్త్రీలు, దళితులు, బహుజనులు, మధ్యతరగతి వర్గాల జీవన వైరుధ్యాలకు ఆయన కథల్లో ప్రత్యేకస్థానం ఉంది. కథకుడిగానే కాక విమర్శకుడు, సంపాదకుడు, పరిశోధకుడి గానూ ఆయన విశిష్ట కృషి చేశారు. ‘దృష్టి’, ‘దీపధారులు’, ‘సంగమం’, ‘పరిచయం’, ‘నూరేళ్ల తెలుగు కథ’, ‘తెలుగు చరిత్ర–సంస్కృతి’, ‘రాయలసీమ రాగాలు’ వంటి రచనలు, సంకలనాలు ఆయన విస్తృత సాహిత్య దృష్టికి నిదర్శనాలు. కొడవటిగంటి కుటుంబరావు రచనలను 13 సంపుటాలుగా సంపాదించి, విలువైన ముందుమాటలు రాశారు.

భారతీయ భాషా పరిషత్, తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారాలతో పాటు రావిశాస్త్రి పురస్కారం, తుమ్మల వెంకటరామయ్య బంగారు పతకం, ప్రతిభామూర్తి జీవితకాల సాధన పురస్కారం, వైఎస్సార్ జీవన సాఫల్య పురస్కారం, ఉత్తమ అధ్యాపక పురస్కారం వంటి అనేక గౌరవాలు ఆయన అందుకున్నారు.2023 మే 22న కేతు విశ్వనాథరెడ్డి కన్నుమూశారు కానీ ఆయన కథల్లోని రాయలసీమ ఇంకా జీవిస్తూనే ఉంది. ఆయన కథలు ఒక ప్రాంతపు చరిత్రను మాత్రమే కాదు—భూమి, కరువు, అధికారం, ఆకలి, సంబంధాలు, మార్పుల మధ్య తన బతుకును అర్థం చేసుకోవడానికి ప్రయత్నించే మనిషి చరిత్రను చెబుతాయి. అందుకే కేతు విశ్వనాథరెడ్డి రాయలసీమ కథకుడు మాత్రమే కాదు; సీమవెతల్లోని మానవత్వాన్ని తెలుగు కథకు అందించిన మహత్తర వాస్తవిక కథకుడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *