బొగ్గు, గ‌నుల రంగంలో పార‌ద‌ర్శ‌క‌తకు చర్యలు

– మీడియా స‌మావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి 

న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఆగస్టు 13 : బొగ్గు, గనుల రంగంలో మోదీ నాయకత్వంలో గత పన్నెండేళ్లుగా అనేక సంస్కరణలు తీసుకొచ్చామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. గతంలో మాదిరి కాకుండా ఈ-ఆక్షన్ ద్వారా బొగ్గు, గనుల రంగంలో కేటాయింపుల విషయంలో పారదర్శకత తీసుకురావడానికి ఎన్నో చర్యలు తీసుకున్నామని గురువారం దిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో చెప్పారు. గనుల కేటాయింపులపై సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా 2015, 2020లలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని, ఇప్పటివరకు 141 బొగ్గు గనుల వేలం ప్రక్రియ పూర్తి కాగా అందులో 105 మినరల్ బ్లాక్స్‌లో ఉత్పత్తి ప్రారంభమైందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు అనేక సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. 2014కు ముందు రాష్ట్ర ప్రభుత్వాలకు రెవెన్యూ షేర్ ద్వారా రూ.13,258 కోట్లు మాత్రమే వచ్చేదని, ఇప్పుడు రూ.71వేల కోట్లు రెవెన్యూ రాష్ట్ర ప్రభుత్వాలకు అందుతోందని చెప్పారు. కేంద్రం తన పన్నులు తగ్గించుకుని.. రాష్ట్రాలకు లాభం చేస్తున్నదనే విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు. మినరల్స్ దేశ సంపద కాబట్టి వీటి ప్రయోజనం దేశంలో అందరికీ అందాలనేదే కేంద్ర ప్రభుత్వం ఆలోచన అని పేర్కొన్నారు. దేశంలో మినరల్స్ కొరత ఉండకూడదని, ఉపాధి కల్పన జరగాలని, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక స్థితిని మెరుగుపరచాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2015 నుంచి బొగ్గు, గనుల రంగంలో సంస్కరణలు తీసుకొస్తోందని తెలిపారు.
బొగ్గు రంగంలో రెవెన్యూ విషయాన్ని గమనిస్తే 2014-15లో రాష్ట్రాలకు దాదాపు రూ.12 వేల కోట్ల రెవెన్యూ వచ్చేదని, ఇప్పుడు రూ.58,592 కోట్లకు పెరిగిందని, గతంలో 45% ఉన్న ఆదాయాన్ని కేంద్ర ప్రభుత్వం 4% నుంచి 10%కి తగ్గించుకుందని తెలిపారు. ఆక్షన్ ప్రీమియంలో కూడా వంద శాతం రాష్ట్రాలకే అందజేస్తున్నామని, రాయల్టీ కూడా వంద శాతం రాష్ట్రాలకే అందజేస్తున్నామని చెప్పారు. మైనింగ్ ద్వారా ప్రభావితమయ్యే ప్రాంతాల్లో అభివృద్ధి పనుల కోసం డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్‌ను జిల్లా కలెక్టర్ ద్వారా ఖర్చు చేయిస్తున్నామని, ఇందులోని ప్రతి రూపాయి కూడా ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన, విద్య, వైద్యం, తదితరాలకు ఖర్చు చేస్తున్నామని కిషన్‌రెడ్డి తెలిపారు. తక్కువ రేటుతో విద్యుత్ తయారీ కోసం ప్రభుత్వరంగ సంస్థలు, ప్రైవేటు విద్యుత్ తయారీ సంస్థలకు తక్కువ ధరకే బొగ్గును అందజేస్తున్నామన్నారు. 2018 తర్వాత కోలిండియా కంపెనీ బొగ్గు ధరను ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా పెంచలేదని గుర్తు చేశారు. ఇవాళ పార్లమెంటులో పాస్ అయిన బిల్లు కేవలం మేజర్ మినరల్స్ విషయానికి సంబంధించినదేనని, రాష్ట్రాల పరిధిలో ఉన్న మైనర్ మినరల్స్ విషయంలో ఎలాంటి సవరణలు తీసుకురాలేదని ఆయన చెప్పారు. మేజర్ మినరల్స్ చాలా కీలకమైనవి. వీటి ధరలు పెరిగితే పేద, మధ్యతరగతి వారి ఇళ్ల నిర్మాణం, ఇతర మౌలిక వసతుల కల్పన విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయని, అందుకే సిమెంట్, స్టీల్, అల్యూమినియం ఉత్పత్తికి కీలకమైన మేజర్ మినరల్స్ ధరలు పెరగొద్దనే ఉద్దేశంతో ఈ చట్టంలో సవరణలు తీసుకొచ్చామని అన్నారు. కోల్ గ్యాసిఫికేషన్ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.46 వేల కోట్లు ఖర్చు చేస్తోందని, దీని వల్ల ప్రస్తుతం దేశం దిగుమతి చేసుకుంటున్న వివిధ ఉత్పత్తులను దేశీయంగానే ఉత్పత్తి చేసుకునే అవకాశం కలుగుతుందని చెప్పారు. క్రిటికల్ మినరల్స్ విషయంలోనూ దిగుమతులపైనే ఆధారపడాల్సి వస్తున్న సందర్భంలో కేంద్రం రూ.34వేల కోట్లతో నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్‌ను ప్రారంభించిందని, ఇప్పటికే 20 దేశాలతో ఎంవోయÖలు చేసుకున్నామని, ఈ దిశగా ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నామని కిషన్‌రెడ్డి తెలిపారు.

త్వరలో కోల్‌ ఎక్స్ఛేంజ్‌ .. దేశవ్యాప్తంగా బొగ్గుకు ఒకే ధర

దేశవ్యాప్తంగా బొగ్గుకు ఒకే ధర ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని కిషన్‌ ‌రెడ్డి తెలిపారు. త్వరలో కోల్‌ ఎక్స్ఛేంజ్‌ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. దీనివల్ల విద్యుత్‌ ఉత్పత్తి వ్యయం తగ్గి వినియోగదారులకు తక్కువ ధరకు విద్యుత్‌ అం‌దుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 2018 నుంచి బొగ్గు ధరలను పెంచలేదని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. అదే విధంగా సిమెంట్‌, ‌స్టీల్‌ ‌వంటి రంగాలకు సంబంధించిన ధరల విషయంలోనూ పెరుగుదలను నియంత్రించే చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. మినరల్స్ అం‌శంలో రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం పెత్తనం చేయబోదని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. పన్నులు, సెస్‌ల విషయంలోనూ కేంద్రం జోక్యం చేసుకోదని తెలిపారు. దేశంలో మినరల్స్ ఉత్పత్తిని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోందని కిషన్‌రెడ్డి తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *