మాటలు కాదు, చేతలు కావాలి?

 “ఒక రాష్ట్రానికి సర్వాధికారాలు ఉన్న ముఖ్యమంత్రి అయి ఉండి, చట్ట ప్రకారం – రాజ్యాంగ ప్రకారం తన విధులు తాను నిర్వహించుకుంటూ పోవాల్సింది పోయి.. సాయుధ విప్లవ భాషను పోలిన పదజాలం, ప్రతిపక్ష పార్టీలను ఉద్దేశించి మాట్లాడడం ప్రజాస్వామికం అవుతుందా? రాజ్యాంగబద్ధ విధానం అవుతుందా? రాబోయే ఎన్నికల గెలుపు కోసం, పాలకులు ఈ విధంగా దిగజారి మాట్లాడడం, ప్రజాస్వామ్యాన్ని అవమానించడం కాదా? ముఖ్యమంత్రి స్థానంలో ఉండి, ఈ భాష మాట్లాడడం సరైంది కాదు అని, ఎవరు చెప్పాలి వీళ్లకు! అందరూ దొంగలే అని ప్రజలకు తెలుసు, మీడియాకు తెలుసు, సామాజిక బుద్ధి జీవులందరికి తెలుసు..”
ముద్దగౌని సుభాష్ సామాజిక ఉద్యమ రచయిత ఫోన్: 9000904284

రాజకీయ చతురతలో గురుశిష్యులుగా ముద్రపడిన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఈ మధ్యకాలంలో ఒకరిని మించి ఒకరు సంచలన ప్రకటనలు చేస్తున్నారు. కాశీలో ప్రధానమంత్రి పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు  ‘యువతకు ఉపాధి గురించి కానీ, ఇంకేవైనా అభివృద్ధి కార్యక్రమాల గురించి కానీ మాట్లాడుతారు అనుకుంటే, కాశీలో వెంకటేశ్వర స్వామి గుడి కట్టించాలని, ప్రధాన మంత్రి మోదీ  సమక్షంలో మాట్లాడం విడ్డూరంగా ఉంది! హైటెక్ ముఖ్యమంత్రి కొలువుల గురించి మాట్లాడకుండా, గుళ్ళ గురించి మాట్లాడడం ఏమిటని, దేశ ప్రజలు ఆశ్చర్య పోతున్నారు! ఎందుకంటే ఈ దేశంలో గుళ్ళకు, మసీదులకు, చర్చీలకు కొదువలేదు. ఒకవైపు దీపారాధనకు కూడా నోచుకోని గుళ్ళు దేశంలో ఎన్నో ఉన్నాయి. అంతగా ఈయన గారికి భక్తి ఎక్కువైతే, జీర్ణస్థితిలో ఉన్న ఆ గుళ్ళను పునరుద్ధరించవచ్చు కదా? అనునిత్యం హైటెక్ – అభివృద్ధి అంటూ జపం చేసే ఈ హైటెక్ ముఖ్యమంత్రి.. యువత భవిత కంటే కూడా, గుడి నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వడం దేనికి సంకేతం? అభివృద్ధి గుడుల వల్ల అవుతుందా? ప్రజలకు ఉపాధి కల్పించే కంపెనీల వల్ల అవుతుందా? ఇలాంటి పాలకుల చిత్తశుద్ధిని, నేటి యువతరం లోతుగానే ఆలోచిస్తున్నారు‌! 

ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి  కూడా, వారం రోజుల్లో రెండు సంచలన ప్రకటనలు చేసి ప్రజలను విస్మయానికి గురి చేసారు. ‘రాజకీయ నాయకులు ఏమీ మాట్లాడినా, రాజకీయ ప్రయోజనాలు లేకుండా మాట్లాడరు’ అన్నది జగమెరిగిన సత్యం! అయినా సరే, మనం ప్రజలుగా దేనికదిగానే చూడాలి. ప్రజలకు మేలు జరిగే అంశం ఉంటే అభినందించాలి, లేదంటే ప్రశ్నించాలి. మొన్న దిల్లీలో ‘అసోం దినపత్రిక ప్రతిదిన్’ మీడియాతో ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  మాట్లాడుతూ.. ‘ఎన్నికల సంఘాన్ని అడ్డం పెట్టుకుని, కేంద్ర ప్రభుత్వం అడ్డగోలుగా ప్రజల వోటు హక్కును కాల రాస్తుంది. ఇది అప్రజాస్వామికం. ఆనాడు బ్రిటిష్ పాలనలో సైమన్ కమిషన్ నియామకానికి వ్యతిరేకంగా.. ‘సైమన్ – గో బ్యాక్’ అని ప్రజలు ముక్తకంఠంతో వ్యతిరేకించారు.
అట్లాగే ఈనాడు కూడా ‘సర్ – గో బ్యాక్’ అనీ, సర్ కు నిరసనగా దేశ ప్రజలంతా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది అని అన్నారు. సర్ ప్రక్రియను నిరసిస్తూ మీడియా ముఖంగా రేవంత్ రెడ్డి గారు, దిల్లీ నడి వీధిలో చేసిన ఈ ప్రకటనను, అందరమూ అభినందించాల్సిందే! అయితే అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ అంశం పట్ల రేవంత్ రెడ్డి గారు, తాను మాట్లాడిన దానికి కట్టుబడి ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇక సర్ ప్రక్రియలో జరుగుతున్న మోసాల గురించి, కేంద్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారు ప్రశ్నించినప్పుడు.. దేశ ప్రధాని మోదీ  పాలనలో భాగస్వామి అయిన, చంద్రబాబు గారు ఎందుకు ప్రశ్నించరు అని, ప్రజలు చర్చించుకుంటున్నారు‌. ఇకపోతే, అవినీతి దోపిడీ పాలనపై ప్రశ్నిస్తానని రాజకీయాల్లోకి వచ్చిన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , తానే ఒక ప్రశ్నగా మిగిలిపోయారు! వోట్ల సవరణ పేరుతో కేంద్ర ప్రభుత్వం, భారత దేశంలో పుట్టిన 15 కోట్ల మంది ప్రజలకు వోటు హక్కు లేకుండా చేస్తుంటే, పవన్ కళ్యాణ్ గారు మౌనంగా ఉండడం, ఏ విధమైన దేశభక్తి అవుతుంది?
ఇక రేవంత్ రెడ్డి గారు నిన్న సిరిసిల్లలో కెసిఆర్, కేటీఆర్ లను ఉద్దేశించి బహిరంగ సభలో మాట్లాడుతూ ఒక సంచలన ప్రకటన చేసారు. “కాళేశ్వరం లో  లక్ష కోట్ల రూపాయల దోపిడీ చేశారు. వాళ్లకి ఫామ్ హౌస్ లు ఎక్కడి నుండి వచ్చాయి? వందల వేల ఎకరాల భూములు ఎక్కడి నుంచి వచ్చాయి? సిరిసిల్లలో తండ్రి కొడుకుల గడీలను బద్దలు కొడతాం! సిరిసిల్ల గడీల మీద గురిపెడతాం! ఫిరంగులమై పేలుదాం! సిరిసిల్ల గడీని నేలమట్టం చేద్దాం! ఇదేనా ప్రతిజ్ఞ!” అని మాట్లాడారు.
ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే, ఒక రాష్ట్రానికి సర్వాధికారాలు ఉన్న ముఖ్యమంత్రి అయి ఉండి, చట్ట ప్రకారం – రాజ్యాంగ ప్రకారం తన విధులు తాను నిర్వహించుకుంటూ పోవాల్సింది పోయి.. సాయుధ విప్లవ భాషను పోలిన పదజాలం, ప్రతిపక్ష పార్టీలను ఉద్దేశించి మాట్లాడడం ప్రజాస్వామికం అవుతుందా? రాజ్యాంగబద్ధ విధానం అవుతుందా? రాబోయే ఎన్నికల గెలుపు కోసం, పాలకులు ఈ విధంగా దిగజారి మాట్లాడడం, ప్రజాస్వామ్యాన్ని అవమానించడం కాదా? ముఖ్యమంత్రి స్థానంలో ఉండి, ఈ భాష మాట్లాడడం సరైంది కాదు అని, ఎవరు చెప్పాలి వీళ్లకు! అందరూ దొంగలే అని ప్రజలకు తెలుసు, మీడియాకు తెలుసు, సామాజిక బుద్ధి జీవులందరికి తెలుసు. అయితే ముఖ్యమంత్రే స్వయంగా ప్రతిపక్ష పార్టీల దోపిడీ చిట్టాను బహిర్గతం చేయడం ప్రజలు హర్షిస్తారు. అంతేకానీ ఆ చట్ట విరుద్ధ భాషను సహించరు! పదిహేను వందల మంది పిల్లల బలిదానంతో వచ్చిన తెలంగాణలో.. పాలన పేరుతో, అభివృద్ధి పేరుతో ‘పాలక – ప్రతిపక్ష పార్టీలు’ చేస్తున్న దోపిడీకి అంతులేకుండా పోతోందని, ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు!
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ఈ విధంగా పదేపదే మీరు, ప్రతిపక్ష పార్టీపై చేస్తున్న ఈ దోపిడీ అవినీతి ఆరోపణలకు సంబంధించి, ప్రజలు ఏమనుకుంటున్నారంటే..
“ముఖ్యమంత్రి గారు, మీరు సర్వాధికారాలు ఉన్న పాలకుడిగా ఉండి, ప్రతిపక్ష పార్టీ నాయకుడి వలె ఈ విధమైన ఆరోపణలు చేయడం తగదు! ప్రభుత్వమే మీది అయినప్పుడు, ఆధారాలు మీ దగ్గర ఉన్నప్పుడు, సిట్టింగ్ జడ్జి చేత ఒక విచారణ కమిటీ వేయించండి! ప్రతిపక్ష పార్టీలు, పాలకపక్ష పార్టీలు అనే తేడాలు లేకుండా, సర్పంచుల నుండి ఉన్నత ప్రభుత్వాధికారుల వరకూ.. అందరిమీదా నిష్పక్షపాతంగా, చట్టబద్ధంగా విచారణ జరిపించండి! నిందితులకు చట్ట ప్రకారం శిక్షలు పడేలా చూడండి! ఈ మహత్తర కార్యక్రమం, మీ నుండే, మీ ఇంటి నుండే మొదలవ్వాలి” అని ప్రజలు కోరుకుంటున్నారు!
ముద్దగౌని సుభాష్ 
సామాజిక ఉద్యమ రచయిత 
ఫోన్: 9000904284

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *