కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల
ఫలితంగా పెరుగుతున్న నిరుద్యోగం
మోదీ అధికారంలోకి వొచ్చిన తరవాత గత పదేళ్లు పాలన అవినీతిరహితంగా సాగుతుందన్న పేరు వొచ్చింది. అలాగే సాహసోపేత నిర్ణయాలు కూడా తీసుకుని సత్తా చాటింది. అయోధ్య, కాశ్మీర్, ట్రిపుల్ తలాక్ విషయల్లో సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు. ఇకపోతే ఇంకా పట్టిపీడిస్తున్న సమస్యలు అనేకం ఉన్నాయి. ప్రధానంగా నిరుద్యోగం, ఆహారభద్రత, కరెంట్, నీళ్లు వంటి సమస్యలపై దృష్టి సారించాలి. నదీజలాల విషయంలో సాహసోపేత నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. నదుల అనుసంధానం ద్వారా దేశాన్ని బలోపతేం చేసే దిశగా అడుగులు వేయాలి. జిఎస్టీ లాంటి పన్నులు విధానంపై చర్చించాలి. మోదీ రెండోసారి అధికారంలోకి వొచ్చిన తరవాత తీసుకుకున్న నిర్ణయాలు చరిత్రలో నిలిచిపోతాయి. ట్రిపుల్ తలాక్‌కు మంగళం పాడడంతో ముస్లిం మహిళలకు వివాహబంధం విషయంలో భరోసా దక్కింది. అలాగే కాశ్మీర్‌లో 370 ఆర్టికల్ రద్దు కూడా సాహసోపేత నిర్ణయంగా నిలిచి పోనుంది. మోదీ సర్కార్ సాహస నిర్ణయాలకు వెనకాడదని రుజువు చేసుకుంది.
సర్జికల్ స్ట్రయిక్స్ చేసి దాయాది దేశాన్ని ప్రపంచంలో దోషిగా నిలబెట్టిన ఘనత మోదీదే అని చెప్పక తప్పదు. అలాగే అవినీతి మరక అంటకుండా మోదీ దేశాన్ని పాలించారన్న ప్రశంసలు ఉన్నాయి. ఇకపోతే కరోనా వ్యాక్సిన్ తయారీ, ప్రోత్సాహంలో దేశం అతిపెద్ద విజయం సాధించిందనే చెప్పాలి. దేశంలోని ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్ అందించడమే గాకుండా,అనేక దేశాలకు ఉచితంగా వ్యాక్సిన్ అందించి ఆపన్నహస్తం అందచేసింది. ఇలాంటి తరుణంలో మూడోసారి అధికారంలోకి వొచ్చారు. అయితే ప్రజలు పూర్తి మెజార్టీ ఇవ్వలేదు. అందువల్ల ప్రజలు మెచ్చే విధంగా పాలన సాగించాల్సి ఉంది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రధానంగా దృష్టి సారించాలి. క్షేత్రస్థాయి నుంచి సమాచారం తెప్పించుకోవాలి. సమస్యలు గుర్తించాలి. గత పదేళ్లుగా తనవైపు వేలెత్తి చూపే అవకాశం లేకుండా మోదీ జాగ్రత్తగా వ్యవహరించారు. ఎక్కడా ఒక కుంభకోణం అన్నది లేకుండా పాలన సాగిస్తున్న తీరు ప్రజలనుంచి అభినందనలు వొస్తున్నాయి. తన వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకునేలా చేసుకున్నారు. అయితే పాలనలో మాత్రం అంతగా దూసుకుని పోవడం లేదు.
ప్రధానంగా నోట్లరద్దు, జిఎస్టీతో ప్రజలకున్న ఆశలు అడియాశల య్యాయి. కాంగ్రెస్ విముక్త భారత్ లక్ష్యంగా చేస్తున్న రాజకీయాలు సత్ఫలితాలు ఇవ్వక పోగా కాంగ్రెస్‌ను బలోపేతం చేశాయి. ఇది బిజెపికి దెబ్బగానే చెప్పుకోవాలి. కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసే క్రమంలో చేస్తున్న పనులన్నీ దేశహితం కోసమేనని సరిపెట్టుకోలేం. భారతీయ జనతా పార్టీ విస్తరణ కాంక్ష మోదీ, షాలను నిలవనివ్వడం లేదు. ఈ క్రమంలోనే తప్పటడుగులు వేస్తున్నారు. ఇదో గుణపాఠం కావాలి. దేశమంతటా అన్ని రాష్టాల్రలో భారతీయ జనతాపార్టీ పతాకం రెపరెపలాడాలన్నది ఈ ఇరువురి నాయకుల కోరిక! కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నీతి వాక్యాలు వల్లె వేస్తోంది గానీ దేశ రాజకీయాలు ఇవ్వాళ ఇంతలా భ్రష్టుపట్టి పోవడానికి ఆ పార్టీనే ప్రధాన కారణం. గతంలో అధికారంలోకి వొచ్చిన కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం కూడా అనేక అడ్డదారులు తొక్కింది. రాష్ట్రాలలో అధికారం నిలబెట్టుకోవడం కోసం లేదా అధికారంలో ఉన్న ఇతర పార్టీల ప్రభుత్వాలను కూల్చడం కోసం కాంగ్రెస్ పార్టీ చేయని అరాచకం లేదు.
ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనపైకి ఇంటెలిజెన్స్ బ్యూరో వంటి సంస్థలను ప్రయోగించి నానా ఇబ్బందులు పెట్టారు. సీబీఐ ద్వారా విచారణలు జరిపించారు. ఇప్పుడు కాంగ్రెస్ అడుగుజాడలలో అదే నరేంద్ర మోదీ, అవే ఏజెన్సీలను కాంగ్రెస్ నాయకుల మీదకు ప్రయోగిస్తున్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడంలో గానీ, ప్రభుత్వ ఏజెన్సీలను దుర్వినియోగం చేయడంలో గానీ కాంగ్రెస్ ఎప్పుడూ ముందుండేది. ఇప్పుడు అదే పంథాను బిజెపి అనుసరిస్తోంది. బిజెపి ఇప్పుడు మిగతా పార్టీలకు భిన్నంగా ఏమీ లేదు. రాజకీయ స్వార్థం కోసం ఎంతకైనా తెగిస్తోంది. ఆ తెగువ పాలనలో కూడా చూపితే దేశం బాగుపడుతుంది. కేవలం విపక్షాలపైనే విచారణలు అన్న ఆరోపణలు పోవాలి. తప్పు చేసిన వారిపై విచారణలు జరగాలి. ఎపిలో జగన్, తెలంగాణలో కెసిఆర్ లాంటి వారి అవినీతిపైనా చర్యలు ఉండాలి. రాజకీయాలు పక్కన పెట్టి దేశం గురించి ఆలోచనచేయాలి.
-చరణ్





