– ప్రకటించిన కేంద్ర ఆర్థిక శాఖ
– హర్షం వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
న్యూదిల్లీ, ఏప్రిల్ 23 : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం, వారి భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం సరికొత్త జీవిత బీమా పథకాన్ని ప్రారంభించింది. కేంద్ర మంత్రిత్వ శాఖలు, కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న అన్ని రకాల ఉద్యోగులకు ఆర్థిక భద్రత, బ్యాంకింగ్ సౌకర్యాలను అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనే కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా బ్యాకింగ్ సేవలతోపాటు ఇన్సూరెన్స్ సేవలు, బ్యాంకుల ద్వారా వివిధ రకాల ప్రయోజనాలు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేసే కార్మికుల, ఉద్యోగస్తుల, భద్రతా సిబ్బంది, మిలటరీ, పారా మిలటరీ వంటి అన్ని రకాల సిబ్బందికి అందుతాయి. ఆర్థిక సహకారం, ఇతర సమస్యల పరిష్కారానికి ఇది ‘వన్ స్టాప్ సొల్యూషన్’లా పనిచేస్తుంది. ఈ కొత్త పథకంలో అన్ని స్థాయిల్లో, అన్ని విభాగాల్లో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మెరుగైన సేవలతో జీరో-బ్యాలెన్స్ శాలరీ అకౌంట్ సౌకర్యం, ఉచితంగా ఆర్టీజీఎస్/ఎనఈఎఫ్‌టీ/యూపీఐ వంటి చెల్లింపులు, బ్యాంక్ చెక్ బుక్ సౌకర్యం, తక్కువ వడ్డీ రేట్లకే గృహ, విద్య, వాహన, వ్యక్తిగత రుణం అందించే సౌకర్యం లభిస్తాయి. ఇవేగాక లాకర్ అద్దె, లోన్ ప్రాసెసింగ్‌లలో అదనపు చార్జీలపై మినహాయింపు, రూ.1.5 కోట్ల వరకు అన్ని విభాగాల ఉద్యోగస్తులకు వ్యక్తిగత ప్రమాద బీమా సౌకర్యం, దురదృష్టవశాత్తు విమాన ప్రమాదాలు జరిగితే రూ.2 కోట్ల వరకు బీమా సౌకర్యం, ప్రమాదాల్లో ఏ ఉద్యోగికైనా శాశ్వత, పాక్షిక వైకల్యం జరిగితే రూ.1.5 కోట్ల వరకు బీమా సౌకర్యం, రూ.20 లక్షల వరకు టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్, అదనంగా టాప్-అప్ సదుపాయం, వ్యక్తిగతంగా, కుటుంబం మొత్తానికి సమగ్ర ఆరోగ్య బీమా సౌకర్యం, డెబిట్, క్రెడిట్ కార్డులపై మరిన్ని మెరుగైన ప్రయోజనాలు లభిస్తాయి. అద్భుతమైన ఈ పథకాన్ని రూపొందించినందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతా రామన్‌కు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





