– రెండు రోజుల సామర్థ్యాభివృద్ధి కార్యక్రమంలో సింగరేణి అధికారులు
– సింగరేణి అమలు చేస్తున్న వినూత్న సీఎసఆర్ కార్యక్రమాలకు ప్రశంసలు
హైదరాబాద్, నవంబర్ 7 : ప్రభుత్వరంగ సంస్థల్లో కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్‌ఆర్) కార్యక్రమాల అమలులో మరింత సమర్థతను పెంపొందించడం, ప్రాజెక్టుల రూపకల్పన, నిధుల సద్వినియోగం, పర్యవేక్షణ, మూల్యాంకనం, సామాజిక ప్రభావ అంచనాలపై అవగాహన కల్పించే లక్ష్యంతో కోల్‌కతాలో జాతీయస్థాయి సామర్థ్యాభివృద్ధి కార్యక్రమం నిర్వహించారు. ఇందులో సింగరేణి కాలరీస్ కంపెనీ అధికారులు పాల్గొన్నారు. కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, కోల్ ఇండియా లిమిటెడ్ సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 4, 5 తేదీల్లో బొగ్గు రంగ సంస్థల కోసం ప్రత్యేక కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎసఆర్) విధానంపై ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో ఐఐసీఏ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఎన్విరాన్‌మెంట్ డీన్ ప్రొఫెసర్ గరిమా దధీచ్ బొగ్గు రంగ సంస్థలకు అనువైన ప్రత్యేక సీఎస్‌ఆర్ విధానాలు, సామాజిక అవసరాల ఆధారంగా ప్రాజెక్టుల ఎంపిక, ప్రణాళికాబద్ధమైన అమలు, నిధుల సమర్థ వినియోగం, పర్యవేక్షణ, ఫలితాల మూల్యాంకనం, దీర్ఘకాలిక సామాజిక ప్రభావం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. సింగరేణి తరఫున హైదరాబాద్ కార్యాలయ డిప్యూటీ జనరల్ మేనేజర్(ఐఈ), పరిపాలనాధికారి నిమ్మ భాస్కర్, సీఎసఆర్ విభాగం సీనియర్ పర్సనల్ ఆఫీసర్ ఎస్.ఎం.డి.గౌస్ పాషా ఈ శిక్షణలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సింగరేణి ప్రతినిధిగా భాస్కర్ సంస్థ అమలు చేస్తున్న వివిధ ప్రతిష్ఠాత్మక సామాజిక బాధ్యత కార్యక్రమాలు, వాటి లక్ష్యాలు, అమలు విధానాలు, లబ్దిదారులకు అందుతున్న ప్రయోజనాలు, సామాజిక అభివృద్ధికి అందిస్తున్న సహకారాన్ని సమగ్రంగా వివరించారు. ముఖ్యంగా రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం, జస్టిస్ ఆన్ వీల్స్, హరే కృష్ణ ఫౌండేషన్ సహకారంతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అల్పాహార పంపిణీ, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, జలవనరుల పునరుద్ధరణ, గ్రామీణ ప్రాంతాల్లో సురక్షిత తాగునీటి సదుపాయాల ఏర్పాటు, నిరుద్యోగ యువత కోసం జాబ్ మేళాల నిర్వహణ, నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు, స్వయం ఉపాధి అవకాశాల కల్పనలో భాగంగా తేనెటీగల పెంపకం ప్రోత్సాహం తదితర కార్యక్రమాలను వివరించారు. స్థానిక ప్రజల అవసరాలను గుర్తించి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచే లక్ష్యంతో సింగరేణి అమలు చేస్తున్న ఈ కార్యక్రమాలను కోల్ ఇండియా లిమిటెడ్, దాని అనుబంధ సంస్థల ప్రతినిధులు ప్రశంసించారÁT. ముఖ్యంగా విద్య, ఉపాధి, గ్రామీణాభివృద్ధి, మౌలిక సదుపాయాలు, సామాజిక సంక్షేమం వంటి రంగాల్లో సింగరేణి చేపడుతున్న కార్యక్రమాలను అభినందించారు.
ఉన్నత విద్యార్హత సాధించిన భాస్కర్‌కు సీఎండీ అభినందనలు 
సింగరేణి డిప్యూటీ జనరల్ మేనేజర్ నిమ్మ భాస్కర్ ఇటీవల ఇందిరా గాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం నుంచి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సును విజయవంతంగా పూర్తి చేశారు. సీఎసఆర్ రంగంలో ప్రత్యేక విద్యార్హత సాధించడంతోపాటు కోల్‌కతాలో జరిగిన జాతీయస్థాయి శిక్షణ కార్యక్రమంలో సింగరేణి సామాజిక బాధ్యత కార్యక్రమాలను సమర్థవంతంగా వివరించి సంస్థకు ప్రశంసలు లభించేలా కృషి చేసిన భాస్కర్‌ను సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాశ్ జ్యోతి అభినందించి సన్మానించారు. కార్యక్రమంలో జనరల్ మేనేజర్ (కోఆర్డినేషన్, మార్కెటింగ్) టి.శ్రీనివాస్ పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





