గోదావరి–కృష్ణా అనుసంధానమే పరిష్కారం

– డిండికి ఏదుల నుంచి నీళ్లు తేవడం సులువు కాదు
– ఎల్లూరు పంపుహౌస్ డిజైన్ మార్పుతో పాలమూరుకు నష్టం చేశారు
– కాళేశ్వరం అదనపు నీటినుంచి డిండి ఎత్తిపోతలకు నీళ్లివ్వడమే పరిష్కారం
– ప్రశ్నిస్తూ పరిష్కారం చూపుతున్నది టీఆర్ఎస్ మాత్రమే
– తెలంగాణ రక్షణసేన చీఫ్  కవిత

నల్గొండ, ప్రజాతంత్ర, నవంబర్ 7 : డిండి రిజర్వాయర్ కు ఏదుల నుంచి నీళ్లు తెస్తామంటూ మహబూబ్ నగర్, నల్గొండ ప్రజలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నారని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. అసలు ఏదులకే 2 టీఎంసీల నీళ్లు తేవటం సాధ్యం కాదంటే అక్కడ నుంచి డిండికి నీళ్లు ఎలా తెస్తారని ప్రశ్నించారు. డిండి రిజర్వాయర్ కు నీళ్లు తేవాలంటే గోదావరి, కృష్ణా నదులను అనుసంధానం చేయటమే సరైన పరిష్కారమని చెప్పారు. దానికి సంబంధించిన టెక్నికల్ డీయిటెల్స్ ను వివరిస్తూ డిండి రిజర్వాయర్ వద్దే శనివారం ఆమె పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. డిండి రిజర్వాయర్ కు ఏదులను సోర్స్ పాయింట్ గా చేసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన ప్రకటనపై తీవ్రంగా మండిపడ్డారు. ఏదుల నుంచి డిండికి నీళ్లు తేవటం అంత సులువు కాదని చెప్పారు. శ్రీశైలం నుంచి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకే 2 టీఎంసీల నీళ్లు తీసుకోలేని పరిస్థితి ఉంటే డిండికి నీళ్లు ఎలా తెస్తారని ప్రశ్నించారు. పైగా శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకునే లెవల్ 800 అడుగుల నుంచి 820 అడుగులకు పెరిగిందని గుర్తు చేశారు. ఎల్లూరు పంపుహౌస్ ను ఓపెన్ కట్ నుంచి అండర్ గ్రౌండ్ గా మార్చడంతోనే సమస్య వచ్చిందని చెప్పారు. అప్రోచ్ చానల్ 140 మీటర్ల నుంచి 50 మీటర్లకు తగ్గిపోయిందని, ఎల్లూరు పంపుహౌస్ కోసం చేపట్టిన బ్లాస్టింగ్స్ తో కల్వకుర్తి పంపు హౌస్ లో ఒక పంపు పేలిపోయిందన్నారు. ఏళ్లు గడిచినా దాన్ని రీస్టోర్ చేయకపోగా ఇప్పుడు మళ్లీ 0.6 టీఎంసీల కోసం ఇంకో సోర్స్ కోసం పంపు హౌస్ తవ్వితే కల్వకుర్తి, పాలమూరు పంపు హౌస్ లకు ప్రమాదం తప్పదని హెచ్చరించారు. అన్ని అడ్డంకుల మధ్య ఏదుల నుంచి డిండికి లింక్ చేస్తామని చెప్పటం రెండు జిల్లాల ప్రజల మధ్య తగువులు పెట్టించటమేనన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు నీళ్లు తేవటం చేతగాకనే ముఖ్యమంత్రి రెండు జిల్లాల ప్రజల మధ్య పంచాయితీ పెడుతున్నారన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 9 సార్లు సర్వేలు చేసి సోర్స్ పాయింట్ గుర్తించలేకపోయిందని, కాంగ్రెస్ ఏ విధంగా ఏదుల సోర్స్ పాయింట్ అని చెబుతుందో చెప్పాలన్నారు. సర్వే చేయకుండా, జీవో ఇవ్వకుండా నోటి మాటతో ఎలా చెబుతారని నిలదీశారు. కృష్ణాలో నీళ్లే లేకుండా డిండికి అక్కడ నుంచి ఉల్పరకు నీళ్లు ఎలా తెస్తారని ఆమె ప్రశ్నించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్ కు శ్రీశైలం సోర్స్ పాయింట్ గా చేస్తామని చెప్పిందని గుర్తు చేశారు. అసలు ఆ ప్రతిపాదనే తప్పన్నారు. తెలంగాణ సాధించుకున్న తర్వాత మనకు కావాల్సిన ప్రాజెక్ట్ లను పూర్తి చేసుకోకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పుచేసిందన్నారు. ఆనాటి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నందుకు క్షమించాలని కోరారు. బీఆర్ఎస్ తప్పిదాలు చాలవన్నట్లు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మూడేళ్ల తర్వాత ఇప్పుడు సాధ్యం కానీ ప్రతిపాదనలు చేస్తూ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారన్నారు.
ఉమ్మడి నల్గొండ నీటి సమస్యలకు గోదావరి, కృష్ణా నదుల అనుసంధానమే శాశ్వత పరిష్కారమని కవిత చెప్పారు. ఎంతో మంది మేధావులు, ఇంజనీర్లతో గంటల తరబడి మేధో మదనం చేసిన తర్వాతే తాము ఈ విషయం చెబుతున్నామన్నారు. కాళేశ్వరం అడిషనల్ టీఎంసీతో బస్వాపూర్ మీదుగా డిండి ఎత్తిపోతలకు నీళ్లు ఇవ్వడమే శాశ్వత పరిష్కారమన్నారు. గోదావరి నీళ్లను కృష్ణాతో అనుసంధానం చేయటం ద్వారా సమస్య పరిష్కారమవుతుందన్నారు. ఇప్పటికే బస్వాపూర్ రిజర్వాయర్ పనులు 80 శాతం పూర్తయ్యాయని, ఆ పనులు పూర్తి చేస్తే డిండికి నీళ్లు తేవటం సులువని చెప్పారు. శివన్న గూడెం, కిష్టరాయిపల్లి పూర్తి కాకపోయినప్పటికీ మల్లన్న సాగర్ నుంచి గోదావరి నుంచి నీళ్లు తీసుకోవచ్చన్నారు. ఉల్పరకు కూడా బస్వాపూర్ నుంచి నీళ్లు తీసుకోవచ్చని చెప్పారు. కొండపోచంపల్లి నుంచి షామిర్ పేట్ చెరువు ద్వారా కూడా శివన్నగూడెంకు గోదావరి నీళ్లను తీసుకురావచ్చని చెప్పారు. డిండికి నీళ్లను ఎత్తిపోసుకునేందుకు ఇప్పుడున్న మార్గం ఇదేనని..గోదావరి నీళ్లు రాకపోతే డిండికి నీళ్లు వచ్చే పరిస్థితి లేదని చెప్పారు. మనకున్న గోదావరి, కృష్ణా నదుల్లో నీటిని పుష్కలంగా వాడుకోవాలంటే ఆ రెండు నదులను అనుసంధానం చేయాల్సిందేనని కవిత అన్నారు. ఈ విషయాన్ని అప్పట్లోనే పీవీ నర్సింహారావు గుర్తించారని, ఎస్ఆర్ఎస్పీ ద్వారా నల్కొండ వరకు కూడా నీళ్లు ఇచ్చే విధంగా కెనాల్స్ కూడా ఏర్పాటు చేశారని చెప్పారు. గోదావరి ద్వారా పూర్తిగా సిద్ధంగా ఉన్న వ్యవస్థను వాడుకోకుండా కృష్ణా నీళ్లను డిండికి తెస్తామని అన్యాయం చేస్తున్నారన్నారని విమర్శించారు. అటు గోదావరి, కావేరి నదుల అనుసంధానాన్ని తుపాకుల గూడెం వద్దే జరిగేలా చూడాలని, ఆంధ్రా ప్రభుత్వం ఒత్తిడికి తలొగ్గి పోలవరం వద్ద చేస్తామంటే ఊరుకోమని ఆమె హెచ్చరించారు.

రాష్ట్రంలో ఉన్న సమస్యలపై పోరాటం చేయటమే కాక వాటి పరిష్కారాలకు కూడా తాము మార్గం చూపిస్తున్నామని కవిత అన్నారు. పాలమూరు- రంగారెడ్డి విషయంలో కూడా పరిష్కార మార్గాలు చూపామన్నారు. ముందుగా పెండింగ్ ప్రాజెక్ట్ లను పూర్తి చేసి రాష్ట్రానికి మేలు చేయాల్సినప్పటికీ ముఖ్యమంత్రి అలా చేయటం లేదన్నారు. బస్వాపూర్ రిజర్వాయర్ పనులను పక్కన పెట్టి గంధమల్ల పనులు స్టార్ట్ చేయటం ఏంటనీ ప్రశ్నించారు. డబ్బుకోసమో, పేరు కోసమో ప్రజలకు అన్యాయం చేయవద్దని సూచించారు. ముందుగా పెండింగ్ ప్రాజెక్ట్ లను పూర్తి చేయాలని సూచించారు. మేడిగడ్డ వద్ద కన్నెపల్లి పంప్ హౌస్ నడిపించి నీళ్లు ఎత్తిపోసుకునే అవకాశం ఉన్న అది పక్కన పెట్టి తుమ్మడి హెట్టి కడతామని చెప్పటం ఏంటనీ నిలదీశారు. ఇప్పటికీ ఏటా గోదావరి నుంచి 3 వేల 5 వందల టీఎంసీల నీళ్లు సముద్రం పాలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చాక ముందుగా పెండింగ్ ప్రాజెక్ట్ లను పూర్తి చేస్తామని అదే తమ విధానమని చెప్పారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో రెండు నెలల క్రితం మళ్లీ ఫ్లోరైడ్ కేసు నమోదవటం ఆందోళనకు గురిచేసిందని కవిత చెప్పారు. ఫ్లోరైడ్ సమస్య పోవాలంటే 40 ఏళ్ల వరకు ఈ నేల నదీ జలాలతో తడవాల్సిన అవసరముందన్నారు.  జూరాల నుంచి శ్రీశైలం వరకు 200 కి.మీ దూరం వరకు మనం ఒక్క ప్రాజెక్ట్ కట్టుకోకపోవటం అన్యాయమన్నారు. గతంలో కేసీఆర్ ఒక ప్రాజెక్ట్ కడతామని చెప్పి ఆ తర్వాత పట్టించుకోలేదన్నారు. కానీ తాము అధికారంలోకి వచ్చాక కచ్చితంగా నల్గొండ జిల్లాలో చిన్నచిన్న రిజర్వాయర్లు కడతామని చెప్పారు. ఈ జిల్లా నుంచే నీటిపారుదల శాఖ, పౌర సరఫరాల మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డికి కూడా డిండికి ఏదుల నుంచి నీళ్లు తేలేమని తెలుసన్నారు. ప్రతి సమస్యపై పోరాటం చేస్తూ పరిష్కారం చూపించే దిశగా ప్రజల కోసం పనిచేస్తున్న తమ పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేయాలని ఆమె గ్రాడ్యుయేట్లకు విజ్ఞప్తి చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *