చలనానికి మూలమైన నడక
గమ్యాన్ని చేర్చే పయనం
జీవనానికి గుర్తింపైన నడత
జీవితాన్ని మలిచే ప్రవర్తనం
క్రమం తప్పని నడక
నిలకడైన ఆరోగ్యానికి సూచిక
క్రమశిక్షణ తప్పని నడత
సత్ప్రవర్తనకు ప్రతీక
చక్కని దారులవెంట నడిస్తే
సాగుతుంది పయనం హాయిగా
మంచి నడతతో జీవితాన్ని కొనసాగిస్తే
గడుస్తుంది బతుకు ఉన్నతంగా
నడిచే నడక ఇష్టమైనపుడు
ఏ దారైనా అవరోధం కాదు
సాగించే నడత సక్రమమైనపుడు
ఏ సమస్యయినా కష్టం కాదు
బుడిబుడి అడుగులతో మొదలయ్యే నడక
జీవితాంతం సాగే జీవన ప్రక్రియ
చిరుచిరు విలువలతో మొదలయ్యే నడత
జీవన సౌశీల్యాన్ని పెంచే ప్రవర్తనాక్రియ
నడకైనా నడతైనా
మార్గమేదైనా గమ్యమొక్కటే
ఆశయమైనా ఆకాంక్షైనా
చర్యలేమైనా లక్ష్యమొక్కటే
వయోభేదాలు లేక
నడకను సాగిస్తుంటే
నీవెప్పుడూ నిత్య ఆరోగ్యవంతుడవే!
దుష్కర్మలు లేక
నడతను ఆచరిస్తుంటే
నీవెప్పుడూ నిత్య సజ్జనుడవే!!
***
-పి.వి.ప్రసాద్
9440176824





