టీ- ఉపాఖ్యానం  

కష్టం సుఖం జీవితం లో కలగలిసినట్లు
పాలు నీళ్లలా మనుష్యులు కలిసిపోవాలనీ
ప్రభోదిస్తు స్నేహితులకు ఇచ్చే తొలి విందు టీ

బజారులో విలువైన షాపులేన్ని కొలువైవున్నా
అప్పుడే కోసి తెచ్చిన పువ్వు పరిమళం లాంటి
టీ స్టాల్ గనుక లేకపోతే అదో వెలితి

ఎందుకు మద్యం ? పద్యం లా ఉద్యమించే
ఉదయపు టీలో వుండే మాధుర్యం
ఏ వైన్ విస్కీ లలో వుండదోయి

పొడవు పొట్టి భేదమెందుకు
ఎత్తు పొడుగు తారతమ్యమెందుకు
ఏ లోపం లేనివాడేవ్వరంటూ
అందరినీ అల్లుకపోయి కలుపుకుపోవాలనీ
బొటనవేలును చూపుడు వేలును కలుపుతుంది టీ కప్పు

ఏ కలలను అందుకోవాలనో
అంత చలి లో స్వప్నాలను మరిగించి
తేనీరు అందించు మానవమాత్రులు
జీవిత సారము కాచివడపోయు దేవదూతలు

శరదృతువు శరీరాన్ని దుప్పట్లకప్పచేబుతుంటే
దేహానికి వెచ్చదనంతో పునర్జన్మ ఇస్తూ
చల్లబడిన ఆలోచనలకు కొత్త స్పూర్తినిస్తూ
బద్దకాన్ని బజారు చివరి దాకా తరుముతుంది

రెండు పెదాలు రాత్రి రహస్యాలను
టీ కప్పు చెవిలో చేప్పుతున్నట్లు టీ
పిడికిటీలో వెచ్చదనాన్ని తనువులో నింపును
ఆత్మీయం గా ఆలింగనం చేసుకున్నట్లు టీ
తాగే ప్రతి టీ గొంతులో పుష్పించే మల్లీ
గల్లీ గల్లీలలో ఉదయించే వసంతాలకు తల్లీ

రాత్రి గొంతులో చేరిన కాకీ
ఉదయపు టీ సేవనంతో పారిపోతుంది
టీ తాగిన గొంతులో చంద్రుడస్తమిస్తాడు
ప్రకృతి లో రుతువులు మారినట్లు
శరీరంలో ప్రకృతి మారును
బ్రహ్మండమైన టీ కప్పు తోనే
ప్రతి అందరిలో సూర్యుడుదయిస్తాడు

 డా. ఐ.చిదానందం
చరవాణి – 8801444335

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page