నేషన్ ఫస్ట్.. అదే మా సిద్ధాంతం

– గాంధీ పరివారానికి బానిసత్వం కాంగ్రెస్ నైజం
– బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26 : భారత దేశంలో రాబోయే రాజకీయ పోరు గాంధీ పరివార్ వర్సెస్ సంఘ్ పరివార్ అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడటం హాస్యాస్పదమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు ఓ ప్రకటనలో ఎద్దేవా చేశారు. ఆయన వ్యాఖ్యలే కాంగ్రెస్ నడిపే కుటుంబ స్వార్థ రాజకీయాలకు, సంఘ్ పరివార్ నమ్ముకున్న నిస్వార్థ దేశ భక్తికి మధ్య ఉన్న తేడా ఏంటో ప్రజలకు స్పష్టం చేస్తున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజకీయం అంటే ఒకే ఒక్క కుటుంబంతో మొదలవుతుంది.. ఆ కుటుంబంతోనే ముగుస్తుందని తెలిపారు. కానీ తమకు ఏ ఒక్క వ్యక్తి లేదా కుటుంబం కంటే దేశ ప్రయోజనాలే ఎల్లప్పుడూ ముఖ్యం అని స్పష్టం చేశారు. దేశంపై ఎమర్జెన్సీ రుద్ది ప్రజల గొంతు నొక్కింది, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది కాంగ్రెస్ కాదా అని నిలదీశారు. 1984లో దేశ రాజధాని నడిబొడ్డున వేలాదిమంది అమాయక సిక్కులను ఊచకోత కోసిన రక్తచరిత్ర కాంగ్రెస్ పాలనలోనే జరిగిందని గుర్తు చేశారు. 26/11 ముంబైపై పాకిస్థాన్ ఉగ్రవాదులు దాడి చేసి భారత ప్రజలను పొట్టనబెట్టుకుంటే కనీసం పాకిస్థాన్‌పై ఎదురుదాడి చేసే ధైర్యం లేక చేతులెత్తేసింది కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కార్ అని ఆయన విమర్శించారు. చివరకు 2013 నాటికి మన దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలోనే అత్యంత బలహీనమైన ఐదు దేశాల సరసన నిలబెట్టిన ఘనత కూడా కాంగ్రెస్ పాలనదేనన్నారు. సంఘ్ పరివార్ ఏ ఒక్కరి ఇంటిపేరు మీదో, ఒక కుటుంబం వారసత్వం మీదో నడిచేది కాదని, ఎలాంటి పదవులు, పేర్లు ఆశించకుండా కేవలం సమాజ సేవ, దేశ నిర్మాణం, క్రమశిక్షణ కోసం జీవితాలను త్యాగం చేసిన తరతరాల కార్యకర్తల త్యాగాలతో నిలబడిన వ్యవస్థ అని వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న పోలిక అర్థంపర్థంలేనిదని కొట్టిపడేశారు. దిల్లీ గాంధీ కుటుంబం కాళ్ల దగ్గర పడి తన బానిసత్వాన్ని నిరూపించుకోవడానికి రేవంత్ రెడ్డి ఎంతైనా పాకులాడవచ్చు.. కానీ ప్రజలు కోరుకుంటున్నది కుటుంబ పాలన కాదు.. ప్రజా సంక్షేమం, వంశపారపర్య పెత్తనం కాదు.. దేశ ప్రయోజనాలు అని రామచందర్‌రావు స్పష్టం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *