దేశ ప్రగతికి ఎంఎస్ఎంఈలే ప్రధాన చోదక శక్తులు

– జీడీపీలో 32%, ఎగుమతుల్లో 49% వాటా చిన్న పరిశ్రమలదే
– 40 కోట్లకుపైగా ప్రజలకు ఉపాధి కల్పిస్తున్న లఘు పరిశ్రమలు
– 2047 నాటికి ‘వికసిత్ భారత్’ సాధనలో వీSవీజుల పాత్ర కీలకం
– ‘లఘు ఉద్యోగ్ భారతి  – సౌత్ ఇండియా కాంక్లేవ్‌’లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 10 : దేశంలో ఉద్యోగ కల్పనతోపాటు 2047 నాటికి వికసిత్ భారత్‌గా రూపుదిద్దడంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు(ఎంఎస్ ఎంఈలు) కీలకమైన ఇంజిన్‌గా వ్యవహరిస్తాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కేవలం పెద్ద పరిశ్రమల ద్వారానే కాక గ్రామాలు, పట్టణాలు, పారిశ్రామిక ప్రాంతాల్లోని ఎంఎస్ఎంఈలు బలోపేతమైనప్పుడే దేశ అభివృద్ధి వేగవంతమవుతుందని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో శనివారం నిర్వహించిన ‘లఘు ఉద్యోగ్ భారతి – సౌత్ ఇండియా కాంక్లేవ్‌’లో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ఎంఎస్ఎంఈలు దేశ ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నాయని, దేశ జీడీపీలో 32%, తయారీ రంగ ఉత్పత్తిలో 36%, ఎగుమతుల్లో 49% వాటా కలిగి ఉన్నాయని వెల్లడించారు. ‘ఉద్యమ’ ప్లాట్‌ఫాంపై దాదాపు 9.80 కోట్ల ఎంఎస్ఎంఈలు నమోదయ్యాయని, ఇవి 40 కోట్లకుపైగా ప్రజలకు ఉపాధి కల్పిస్తున్నాయని చెప్పారు. ఇందులో 37% సంస్థలు మహిళల యాజమాన్యంలో నడవడం విశేషమన్నారు.

కేంద్ర ప్రభుత్వ తోడ్పాటు

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈల ఎదుగుదలకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించిందన్నారు. స్టార్టప్‌లకు త్వరితగతిన అనుమతులు ఇవ్వడం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, క్రెడిట్ గ్యారంటీ ఫండ్, పీఎం విశ్వకర్మ, ముద్ర, గవర్నమెంట్ ఇ-మార్కెట్ ప్లేస్(జీఈఎం) వంటి అనేక పథకాల ద్వారా ఆర్థిక సాయం, రుణ సదుపాయాలను అందిస్తున్నట్లు వివరించారు. ఎంఎస్ఎంఈలకు అవసరమైన ఫైనాన్స్ అందించేందుకు బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

ఉత్పత్తి రంగానికి దక్షిణ భారత్ హబ్

దక్షిణ భారతదేశం ఆటోమొబైల్, ఫార్మా, టెక్స్‌టైల్స్, ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలు, సాంకేతిక ఆవిష్కరణలకు ప్రధాన కేంద్రంగా మారిందని కొనియాడారు. ప్రస్తుతం భారత్ ప్రపంచంలోనే ప్రముఖ సెల్ ఫోన్ తయారీ కేంద్రంగా మారిందని, ఐఫోన్లు కూడా ఇక్కడే ఉత్పత్తి అవుతున్నాయని కిషన్‌రెడ్డి గుర్తు చేశారు.

ప్రతిపక్షాలపై ధ్వజం

ప్రపంచమంతా భారత ఆర్థిక వ్యవస్థను పొగుడుతుంటే, కొందరు ప్రతిపక్ష నేతలు విదేశీ వేదికలపై ఇండియన్ ఎకానమీ డెడ్‌ అని మాట్లాడుతూ దేశ పరువు తీస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ స్వార్థం కోసం పెట్టుబడులను, యువత ఉపాధి అవకాశాలను పణంగా పెట్టవద్దని హితవు పలికారు. 2014 ముందు నాటి పరిస్థితులతో పోలిస్తే ప్రస్తుతం దేశంలో విద్యుత్ కోతలు లేవని, విమానాశ్రయాలు, మెడికల్ కాలేజీలు, ఉత్పాదక రంగం భారీగా విస్తరించాయని ఆయన స్పష్టం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *