~ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 10 : దక్షిణాఫ్రికాలో సౌత్ ఆఫ్రికా తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో జోహాన్నెస్‌బర్గ్ నగరంలో శనివారం నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ నివసిస్తున్న తెలంగాణ ఆడబిడ్డలతో కలిసి ఆమె బతుకమ్మ ఆడి, పాడారు. సంప్రదాయ బతుకమ్మ పాటలు, ఆటలతో సందడి చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను విదేశీ గడ్డపై సైతం ఘనంగా చాటుతున్న ప్రవాస తెలంగాణ మహిళలతో కలిసి మంత్రి సీతక్క బతుకమ్మ సంబరాల్లో పాలుపంచుకున్నారు. తెలంగాణ ఆడబిడ్డల ఆత్మీయత, ఉత్సాహం మధ్య ఈ వేడుకలు కొనసాగాయి. పూలతో బతుకమ్మలను అందంగా అలంకరించి, సంప్రదాయ దుస్తుల్లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని బతుకమ్మ పాటలు పాడుతూ సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను దేశ సరిహద్దులు దాటి విదేశాల్లోనూ ఘనంగా నిర్వహించడం పట్ల మంత్రి సీతక్క సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ ఆడబిడ్డలు ఎక్కడ ఉన్నా తమ మూలాలను, సంస్కృతి సంప్రదాయాలను మరువకుండా బతుకమ్మ వంటి పండుగలను జరుపుకోవడం అభినందనీయమని ఈ సందర్భంగా సీతక్క అన్నారు. ఇలాంటి వేడుకలు ప్రవాస తెలంగాణ ప్రజల మధ్య ఐక్యతను పెంపొందించడంతోపాటు, భావితరాలకు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను పరిచయం చేయడానికి దోహదపడతాయని అన్నారు. మంత్రి సీతక్క వెంట వ్యవసాయ కమిషన్ సభ్యురాలు భవాని రెడ్డి ఉన్నారు. సౌత్ ఆఫ్రికా తెలంగాణ అసోసియేషన్ ప్రతినిధులు, ప్రవాస తెలంగాణ మహిళలు, ఇతర సభ్యులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
————————————————————————————————————————————————————
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





