– పెజావర్ మఠం పీఠాధిపతి విశ్వప్రసన్న తీర్థ స్వామీజీ
– కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో స్వామీజీకి పాద పూజ
– హాజరైన ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్, కేంద్ర మంత్రులు
న్యూదిల్లీ, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22: అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణంతో మన ప్రయాణం ఆగిపోకూడదని, రామరాజ్య స్థాపన దిశగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని పెజావర్ మఠం పీఠాధిపతి విశ్వప్రసన్న తీర్థ స్వామీజీ పిలుపునిచ్చారు. న్యూదిల్లీలోని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి నివాసంలో స్వామీజీ పాదపూజ కార్యక్రమం మంగళవారం భక్తిశ్రద్ధలతో జరిగింది. కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, కేంద్ర సహాయ మంత్రులు బండి సంజయ్ కుమార్, భూపతిరాజు శ్రీనివాస్ వర్మలతోపాటు పలువురు ఉన్నతాధికారులు, పారిశ్రామిక ప్రముఖులు పాల్గొని స్వామీజీ ఆశీస్సులు స్వీకరించారు. ఈ సందర్భంగా స్వామీజీ అనుగ్రహ భాషణం చేస్తూ పలు కీలక విషయాలను వెల్లడించారు. పిల్లలకు చిన్నతనం నుంచే భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు, కుటుంబ విలువలు నేర్పాలన్నారు. రామ, కృష్ణ, గోవింద, శంకర వంటి అర్థవంతమైన పేర్లు పెట్టడం ద్వారా వేదాలు, పురాణాల పట్ల వారికి సహజమైన అనుబంధం ఏర్పడుతుందన్నారు.
ఆచరణలో రామరాజ్యం
‘రామో విగ్రహవాన్ ధర్మః’ అనే సూక్తి ప్రకారం శ్రీరాముని సద్గుణాలను ప్రతి ఒక్కరూ జీవితంలో ఆచరించాలి. ఇతరుల బాధను తన బాధగా, ఇతరుల ఆనందాన్ని తన ఆనందంగా భావిస్తూ పౌరులు బాధ్యతాయుతంగా నడుచుకున్నప్పుడే రామరాజ్యం సాకారమవుతుంది. పేదలకు ఇళ్లు నిర్మించడం, విద్య, వైద్య సేవలు అందించడం, ప్రకృతి వైపరీత్యాల వేళ బాధితులకు అండగా నిలవడమే భగవంతుడికి చేసే నిజమైన సేవ. భగవంతుడిపై భక్తి కలిగి ఉండటమే నిజమైన దేశభక్తి.
సామాజిక ఐక్యత
ఇటీవల వర్షాలకు ఇల్లు కోల్పోయిన ఒక కుటుంబానికి గ్రామస్తులంతా ఏకమై ఇటుకలు, శ్రమదానం అందించి కొత్త ఇల్లు నిర్మించిన తీరు భారతీయ సంస్కృతికి అద్దం పడుతోందని స్వామీజీ అన్నారు. కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలిచే ఈ సేవాభావాన్ని ప్రతి ఒక్కరూ పెంపొందించుకోవాలని ఉద్బోధించారు. ప్రతి ఒక్కరూ తమ సామర్థ్యానికి తగ్గట్టుగా సమాజ సేవలో, దేశ సేవలో భాగస్వాములు కావాలని, శ్రీరామకృష్ణుల అనుగ్రహంతో భారతదేశం శాంతి, సమృద్ధి, సౌభాగ్యాలతో ముందుకు సాగాలని స్వామీజీ ఆకాంక్షించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





